ప్రాణం తీసిన చికెన్‌ గొడవ  

Father Killed By Son  - Sakshi

తండ్రిని చంపిన తనయుడు

పాపయ్యపేటలో ఘటన

చెన్నారావుపేట(నర్సంపేట): కొడుకే కాలయముడయ్యాడు.. చికెన్‌ కూర విషయంలో గొడవపడి చితకబాది తండ్రిని హత్య చేసిన సంఘటన వరంగల్‌ రూరల్‌ జిల్లా చెన్నారావుపేట మండలం పాపయ్యపేట గ్రామంలో గురువారం రాత్రి జరిగింది. గ్రామస్తుల ప్రకారం.. పాపయ్యపేటకు చెందిన మేర్గు సంజీవ(58), పద్మ దంపతులకు కుమారుడు నర్సయ్య ఉన్నాడు. గ్రామంలో సంజీవ నీరటిగా పనిచేస్తున్నాడు.

వీరు ముగ్గురు మూడు నెలల క్రితం హైదరాబాద్‌ మాదాపూర్‌లోని అపార్ట్‌మెంట్‌లో పనిచేసేందుకు వెళ్లారు. నర్సయ్య మూడు రోజుల క్రితం పాపయ్యపేటకు రాగా, గురువారం సాయంత్రం సంజీవ, పద్మ కూడా వచ్చారు. జ్వరంతో ఇంట్లో పడుకొని ఉన్న నర్సయ్య తాను మూడు రోజులుగా అన్నం తినలేదని, వండి పెట్టాలని తల్లిని అడిగాడు. దీంతో తల్లి తన భర్త సంజీవకు చికెన్‌ తీసుకురమ్మని పంపింది. బయటికి వెళ్లిన సంజీవ రెండు గంటలు దాటిన తర్వాత చికెన్‌ తీసుకొని వచ్చాడు.

తనకు ఆకలి అవుతోందని, చికెన్‌ ఎందుకు వండలేదని తల్లిని అడుగుతుండగా సంజీవ కల్పించుకుని కొడుకుపై కోపం చేశాడు. ఇప్పటిదాకా నువ్వు ఎక్కడికి వెళ్లావని కొడుకు తండ్రిని నిలదీయడంతో ఇరువురి మధ్య మాటామాట పెరిగి ఇంట్లో నుంచి బయటికి నెట్టేసుకుంటూ వచ్చారు. ఇంతలో నర్సయ్య గుడిసెలో ఉన్న పారను చేతిలోకి తీసుకొని తండ్రి తలపై కొట్టాడు. దీంతో అతడు పక్కనే ఉన్న రాళ్లపై పడ్డాడు.

ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న ఏసీపీ సునీతామోహన్, నెక్కొండ సీఐ వెంకటేశ్వర్‌రావు, ఎస్సై కూచిపూడి జగదీష్‌ పోలీస్‌ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకోని పరిశీలించారు. జరిగిన ఘటన విషయాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. మృతుడి భార్య పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కూచిపూడి జగదీష్‌ తెలిపారు. నిందితుడు నర్సయ్య పరారీలో ఉన్నాడు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top