చిన్నారి కళ్లెదుటే తండ్రి దుర్మరణం

Father Died in Bike Accident Guntur - Sakshi

పనులకు వెళ్తూ మృత్యు ఒడికి..

ట్రాక్టర్‌–బైక్‌ ఢీకొని ప్రమాదం

పెదనాన్న పరిస్థితి విషమం

ప్రాణాలతో బైటపడిన మృతుడి కుమారుడు

వారిద్దరూ అన్నదమ్ములు. కూలీలుగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. విధులకు బయల్దేరిన సమయంలో వెళ్లనీయకుండా మారాం చేస్తుండడంతో తమ కుమారుడినీ బైక్‌లో తీసుకెళ్లారు. మార్గమధ్యంలో ప్రమాదానికి గురై సోదరుల్లో ఒకరు  మృత్యువాత పడ్డారు. మృతుడి కుమారుడు అదృష్టవశాత్తు ప్రాణాలతో బైటపడ్డాడు. కళ్లెదుటే తండ్రి చనిపోవడం, పెదనాన్న తీవ్రగాయాలతో అచేతనంగా పడిపోవడంతో ఆ చిన్నారికి ఏం చేయాలో దిక్కుతోచలేదు. భోరున ఏడవడం మినహా..

వాల్మీకిపురం : ట్రాక్టర్‌–మోటార్‌ సైకిల్‌ ఢీకొని ఒకరు మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మరో చిన్నారి సురక్షితంగా  బైటపడ్డాడు. గురువారం ఈ సంఘటన స్థానిక బైపాస్‌ రోడ్డులో చోటు చేసుకుంది. వివరాలు..వాల్మీకిపురం శివారులోని అగ్నిమాపక బాధిత కాలనీకి చెందిన రెడ్డిబాషా తన ఇద్దరు కుమార్తెలను మదనపల్లె బసినికొండకు చెందిన అన్నదమ్ములు బావాజాన్‌ (24) చాన్‌బాషా (22)కు ఇచ్చి పెళ్లి చేశారు. వివాహానంతరం వాల్మీకిపురంలో మామగారి ఇంటిలోనే వారు కాపురం పెట్టారు. మదనపల్లెలోని ఓ లారీ షెడ్‌లో కూలీలుగా పని చేస్తూ నిత్యం వెళ్లివచ్చేవారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం విధులకు వెళ్లడానికి వారిద్దరూ ద్విచక్రవాహనంలో బయలుదేరారు. దీంతో చాన్‌బాషా కుమారుడు బైక్‌ ముందు నిలబడ్డాడు. వెళ్లవద్దని ఏడుపు అందుకున్నాడు. సముదాయించినా ఏడుపు ఆపలేదు. పోనీలెమ్మని తమతో తీసుకువెళితే షెడ్డులో పనులు చేసేంతవరకు ఆడుకుంటూ ఉండాడని సోదరులు తలచారు. దీంతో చాన్‌బాషా తన రెండేళ్ల కుమారుడు సయ్యద్‌ మహమ్మద్‌నూ బైక్‌లో మధ్యలో కూర్చోబెట్టుకుని బయల్దేరారు. కొంతదూరం వెళ్లేసరికి బైక్‌లో పెట్రోలు అయిపోవడంతో సమీపంలోని పెట్రోల్‌ బంకు వద్ద పెట్రోలు పట్టుకుని మళ్లీ తిరిగి పయనమయ్యారు. 

మార్గమధ్యంలో ప్రమాదానికి గురయ్యారు. ట్రాక్టర్‌ ట్రాలీని ద్విచక్రవాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో చాన్‌బాషా తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందగా, బావాజాన్‌ తీవ్రంగా గాయపడ్డాడు. చిన్నారి సయ్యద్‌ మహమ్మద్‌ ప్రాణాలతో బయపడ్డాడు. బావాజాన్‌ను చికిత్స నిమిత్తం మదనపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రథమ చికిత్స అనంతరం అక్కడి నుంచి చెన్నైకి తరలించారు. ట్రాక్టర్‌ డ్రైవర్‌    గంగాధర్‌ను పోలీసులు అదుపులోకి  తీసుకున్నారు. ఎస్‌హెచ్‌వో అలీఖాన్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top