‘ఐపీ’ పెట్టిన వ్యాపారి ఇంటి ఎదుట ఆందోళన

Farmers Protest In thallada - Sakshi

తల్లాడ ఖమ్మం : ఐపీ పెట్టి, తమ నోట్లో మన్ను కొట్టాడంటూ మిర్చి వ్యాపారి జలంధర్‌ ఇంటి ఎదుట బాధిత రైతులు ఆందోళనకు దిగారు. రైతు సంఘం ఆధ్వర్యంలో వంటా వార్పు నిర్వహించారు. తల్లాడకు చెందిన జలంధర్, 114 మంది రైతుల నుంచి మిర్చిని కొన్నాడు. వారికి దాదాపుగా రెండున్నర కోట్ల రూపాయలు ఇవ్వాల్సుంది. డబ్బు చెల్లించేందుకు వాయిదాలు పెట్టాడు. నెలలతరబడి ఆ రైతులు తన చుట్టూ తిప్పించుకున్నాడు.

చివరికి, రెండున్నరకోట్ల రూపాయలకు కోర్టులో ఐపీ దాఖలు చేశాడు. తమకు ప్రభుత్వం న్యాయం చేయాలన్న డిమాండుతో బాధిత రైతు లంతా రైతు సంఘం ఆధ్వర్యంలో ఆ వ్యాపారి ఇంటి ఎదుట సోమవారం ఆందోళనకు దిగారు. అక్కడే వంటావార్పు నిర్వహించారు. వర్షం వస్తున్నప్పటికీ లెక్కచేయలేదు. రైతు సం«ఘం నాయకులు శీలం సత్యనారాయణరెడ్డి, సూరంపల్లి గోపాల్‌రావు, నల్లమోతు మోహన్‌రావు, ఐనాల రామలింగేశ్వర్‌రావు, తమ్మిశెట్టి శ్రీను పాల్గొన్నారు.  

బాధిత రైతు తల్లి హఠాన్మరణం  

తల్లాడ : మిర్చి వ్యాపారి జలంధర్‌ బాధితుడైన ఓ రైతు తల్లి, సోమవారం గుండెపోటుతో మృతిచెందింది. మిర్చి రైతు గొడుగునూరి లక్ష్మీరెడ్డి తల్లి వెంకట్రావమ్మ(65), తన కుమారుడికి జరిగిన మోసాని తల్చుకుని కొన్నాళ్లుగా కుమిలిపోతోంది. ఇతడికి ఆ వ్యాపారి దాదాపుగా నాలుగులక్షల రూపాయలు ఇవ్వాల్సుంది.

ఆ వ్యాపారి ఐపీ పెట్టాడన్న వార్త విన్నప్పటి నుంచి తీవ్ర మనోవేదనతో బాధపడుతోంది. సోమవారం తెల్లవారుజామున గుండె పోటుతో తన ఇంటిలోనే కన్నుమూసింది. మృతదేహాన్ని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సందర్శించి నివాళులర్పించారు.

 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top