అప్పులే ఉరితాళ్లై..

Farmers Commit Suicide In Nellore District - Sakshi

కుప్పకూలుతున్న అన్నదాతల బతుకులు

జిల్లాలో ఇద్దరు రైతుల ఆత్మహత్య

అధికారులు అన్యాయం చేశారంటూ సైదాపురంలో రైతు సూసైడ్‌ నోట్‌ రాసి ఆత్మహత్య

అప్పులు భారమై సోమశిల పెన్నాలో దూకి తనువు చాలించిన మరో రైతు

పంట కోసం ఆరుగాలం శ్రమించిన జిల్లా రైతన్నను కరువుతో పాటు అప్పులు వెంటాడుతున్నాయి. ఉరితాళ్లుగా మారుతున్నాయి. వేలకు వేలు తీసుకువచ్చి సాగుచేసినా పంట చేతికి రాకపోవడంతో అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాడు. ప్రకృతి సైతం కరుణించక పోవడంతో రైతన్నలు ఆత్మస్థైర్యాన్ని కోల్పోతున్నారు.  తీసుకున్న అప్పులు తీర్చలేక తనువు చాలిస్తున్నారు. గురువారం ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. పెరుగుతున్న అప్పులకు తోడు అధికారులు సహకరించడంలేదంటూ సైదాపురం మండలంలో  పురుగు మందు తాగి ఒకరు, అప్పులు తీర్చే మార్గం కానరాక సోమశిల జలాశయం  సమీపంలోని పెన్నాలో దూకి మరో రైతు ఆత్మహత్య చేసుకున్నారు. ఇదిలా ఉండగా సోమ, మంగళవారాల్లో ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలిచింది. తక్షణ సాయంగా కుటుంబానికి రూ. 2 లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని అధికారులు అందజేశారు. 

సాక్షి, సైదాపురం: మండలంలోని కట్టుబడిపల్లి గ్రామానికి చెందిన వేముల కేశవరావు (64) గురువారం అప్పుల బాధలు తట్టుకోలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి జేబులో లభించిన సూసైడ్‌ నోట్‌ అభించింది. తనకు జరిగిన అన్యాయంపై సూసైడ్‌ నోట్‌లో ముఖ్యమంత్రికి రాసినట్లు మృతుడి బంధువులు పేర్కొన్నారు. గ్రామంలో తనకు ఉన్న ఎకరా 25 సెంట్ల భూమికి సంబంధించి పట్టాదారు పాసుపుస్తకం కోసం నాలుగేళ్లగా కాళ్లరిగేలా సైదాపురం రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకుండా పోయిందని, దీనికి తోడు పాసు పుస్తకం కోసం రెవెన్యూ అధికారులు డబ్బులు కూడా డిమాండ్‌ చేశారని సూసైడ్‌ నోట్‌లో ఉన్నట్టు వారు తెలిపారు. తాను ఇప్పటికే ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోవడంతో పాటు కుమార్తెల పెళ్లిళ్లకు చేసిన అప్పులు తీర్చలేక అల్లాడిపోతుండేవాడినని, దానికి తోడు ఉన్న భూమిని అమ్మి అప్పులు తీర్చే క్రమంలో రెవెన్యూ అధికారులకు అడిగిన లంచం ఇవ్వలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు మృతుడు తన సూసైడ్‌ నోట్‌లో స్పష్టం చేసినట్టు వివరించారు.

సైదాపురం మండలంలోని కట్టుబడిపల్లి గ్రామానికి చెందిన వేముల కేశవరావు(64)కు గ్రామంలో ఒకట్నిర ఎకరా భూమి ఉంది. ఆ భూమికి సంబంధించి పట్టాదారు పాసుపుస్తకం కోసం నాలుగేళ్లుగా సైదాపురం రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. కొన్నేళ్లుగా ఆయన స్వగ్రామమైన కట్టుబడిపల్లిలో కాకుండా నెల్లూరు పట్టణంలోని దర్గామిట్ట వద్ద కాపురం ఉంటుండేవారు. భార్య, వసంతమ్మ, ఇద్దరు కుమార్తెలున్నారు. ఇద్దరు కుమార్తెలకు వివాహం జరిపించారు. ఉన్న ఎకరా 25 సెంట్ల పొలంలో సవక తోటను సాగు చేసుకుండేవారు. అప్పడప్పుడు తోటలోకి వస్తూపోతూ ఉండేవారు. ఉన్న పొలానికి పాసుపుస్తకం కావాలంటూ నాలుగేళ్లుగా అర్జీ పెట్టుకున్నారు. ఇటీవలన వీఆర్వో ఆ పొలానికి సంబంధించి సర్వే చేయిస్తానని చెప్పినట్టు తెలిసింది. ఇదిలా ఉండగా తనకు పాసుస్తకం ఇవ్వాలంటూ అధికారులను ప్రాధేయ పడగా వాటికి డబ్బులు ఖర్చు అవుతాయి పెట్టుకుంటావా? అంటూ రెవెన్యూ అధికారులు చెప్పారని రైతు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

తనకు ఉన్న కొద్దిపాటి భూమికి సంబంధించి పాసు పుస్తకం కొరకు తిరిగినా ప్రయోజనం కానరాకపోవడంతో ఉన్న అప్పులు తీరకపోవడంతో ఆయన మనస్తాపం చెందారు.  బుధవారం ఉదయం నెల్లూరులోని తన ఇంటి వద్ద నుంచి స్వగ్రామైన కట్టుబడిపల్లి గ్రామానికి చేరుకున్నారు. అక్కడ బంధువుల ఇంటికి వెళ్లి తర్వాత తోట్లోకి వెళ్లాడు. కేశవరావు భోజనానికి రాకపోవడంతో వారు సవక తోట వద్దకు వచ్చే సరికి పురుగుల మందు తాగి విగతజీవిగా కేశవులు పడిఉన్న దృశ్యాన్ని చూసి ఆందోళన చెందారు. అపస్మారక స్థితిలో ఉన్న అతనిని నెల్లూరు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. మృతుడి జేబులో సూసైడ్‌ నోట్‌ ఉండటంతో కలకలం రేగింది.

జేసీ విచారణ
ఈ విషయం తెలుసుకున్న జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ వెట్రి సెల్వి సైదాపురం తహసీల్దార్‌ కార్యాలయానికి చేరుకుని సమగ్ర విచారణ చేపట్టారు. గూడూరు సబ్‌ కలెక్టర్‌ ఆనంద్‌ను క్షేత్రస్థాయిలో విచారణ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అనంతరం సబ్‌ కలెక్టర్‌ విచారణతో పాటు, మృతుని భార్య ఫిర్యాదు మేరకు జాయింట్‌ కలెక్టర్‌ సమగ్ర నివేదికను వెల్లడించారు. జాయింట్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ రైతు ఆరోపణలు నిరాధారమన్నారు. 2016–17,2018–19లో మీసేవలో పట్టాదారు పాసుపుస్తకం కోసం కేశవరావు ఎలాంటి దరఖాస్తు చేపుకోలేదని అలాగే భూమికి సంబంధించి ఎఫ్‌లైన్‌ కూడా సర్వే కొరకు కట్టలేదనే విషయాలు తమ విచారణలో తేలిందన్నారు ఆమె వెల్లడించారు. కేవలం ఆ రైతు ఇటీవలన జరిగిన స్పందన కార్యక్రమంలో నెల్లూరులోని తమ ఇంటి ముందు ఉన్న చెత్తను తొలగించాలనే అర్జీ తప్ప ఎలాంటి రెవెన్యూ సమస్యపై ఫిర్యాదు చేసిన దాఖలాల్లేవని ఆమె పేర్కొన్నారు. ఆర్థికంగా అప్పుల పాలుకావడంతో ఆరైతు ఆత్మహత్యకు ఒడిగట్టారనే విషయాన్ని మృతుడు భార్య వసంతమ్మ కూడా స్పష్టం చేశారని జాయింట్‌ కలెక్టర్‌ పేర్కొన్నారు. రైతు మృతిపై సమగ్ర విచారణ చేయాలని గూడూరు రూరల్‌ సీఐ రామకృష్ణారెడ్డిని జాయింట్‌ కలెక్టర్‌ ఆదేశించారు.

పెన్నానదిలో దూకి మరొకరు
సోమశిల: తీవ్రమైన అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలంలో ఉన్న సోమశిల జలాశయం సమీపం పెన్నానదిలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. పొదలకూరు మండలం కనుపర్తికి చెందిన ఉస్కలమూర్తి మస్తాన్‌రెడ్డి (55), భార్య మాధవిలకు ఒక కుమారుడు ఉన్నాడు. రెండెకరాల పొలంలో సాగు చేస్తూ పాడి పశువులతో జీవనం సాగిస్తున్నారు.


జలాశయంలో బయటపడిన మృతదేహం 

మస్తాన్‌రెడ్డి వరి సాగుచేశాడు. సాగునీరందక దిగుబడి తగ్గింది. పెట్టుబడులు కూడా తిరిగిరాలేదు. గతేడాది కూడా ఇదే పరిస్థితి ఉంది. మస్తాన్‌రెడ్డి అప్పులపాలయ్యాడు. ఈ నేపథ్యంలో ఆత్మహత్య చేసుకోవాలని భార్యాభర్తలిద్దరూ నిర్ణయించుకున్నారు. గురువారం సాయంత్రం సోమశిల జలాశయం దిగువ ప్రాంతంలో పెన్నానది వద్దకు చేరుకున్నారు. ఇద్దరూ నదిలో నడుచుకుంటూ వెళ్లారు. ప్రాణం మీద భయంతో భయపడి మాధవి వెనకుడుగు వేసింది. ఆ ప్రాంతంలో ఎక్కువగా సుడిగుండాలు ఉండడంతో మస్తాన్‌రెడ్డి ఇరుక్కుపోయిన మునిగిపోయాడు. వెంటనే మాధవి కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు సంఘటన స్థలానికి చేరుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్సై నాగశిరీష జాలర్ల సాయంతో గాలింపు చేపట్టారు. మృతదేహాన్ని వెలికితీశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలిసులు తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top