ప్రేమ బంధం.. విషాదం

Family Suicide Attempt In PSR Nellore - Sakshi

యజమాని మృతితో కుటుంబంఆత్మహత్యాయత్నం

పెద్దకుమార్తె మృతి

చికిత్స పొందుతున్న భార్య, మరో కుమార్తె

గురుతోటలో విషాదఛాయలు

భార్యాభర్తలు.. వారికిద్దరూ బిడ్డలు. వాళ్లది ఎంతో అన్యోన్యమైన కుటుంబం. పిల్లలు, భార్య అంటే ఆయనకు ఎంతో ఇష్టం. వారిని అత్యంత ప్రేమగా చూసుకునేవాడు. వాళ్లు సైతం ఆయన్ను విడిచి ఉండేవారు కాదు. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రేమానుబంధాలు అల్లుకున్న పొదరిల్లు. ఈ క్రమంలో అతను గుండెపోటుతో మృతిచెందాడు. విషయం తెలిసి భార్య, పిల్లలు జీర్ణించుకోలేకపోయారు. ఆయన లేని జీవితం వ్యర్థమనుకున్నారు. భార్య, ఇద్దరు కుమార్తెలు ఉరేసుకుని ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టారు. ఈ విషాదంలో పెద్ద కుమార్తె మృతి చెందగా, తల్లి, చిన్న కుమార్తె ఆస్పత్రిలో ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ హృదయ విదారక విషాద ఘటన నగరంలోని రంగనాయకులపేట గురుతోటలో ఆదివారం జరిగింది.  

నెల్లూరు(క్రైమ్‌): నగరంలోని రంగనాయకులపేట గురుతోట ఒకటో వీధిలోని సాయి శ్రీనివాస నిలయం రెండో అంతస్తులో నాలుగేళ్లుగా  ముం గర కొండలరావు (50), సుజాత దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి విష్ణువర్ధిని (13), దివ్యసోనిక ఇద్దరు కుమార్తెలు. స్టోన్‌హౌస్‌పేట అరుణాచలంవీధిలోని నారాయణ స్కూల్‌లో పెద్ద కుమార్తె ఏడో, చిన్నకుమార్తె ఐదో తరగతులు చదువుతున్నారు. కొండలరావు గతంలో కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి వద్ద పీఏగా పనిచేశారు. ఆయనకు విస్తృత పరిచయాలు ఏర్పడ్డాయి. అనంతరం అక్కడ పనిమానేసి రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం ప్రారంభించారు. ఆర్థికంగా నిలదొక్కుకున్నాడు. భార్య, పిల్లలంటే ఆయనకు చెప్పలేనంత ఇష్టం. అధిక సమయం వారితోనే గడిపేవాడు. వారు సైతం కొండలరావును వదిలి ఉండేవారు కాదు. వ్యాపార నిమిత్తం కొండలరావు తరచూ హైదరాబాద్‌కు వెళ్లేవాడు. వారం, పది రోజుల పాటు అక్కడే ఉండి వ్యాపార లా వాదేవీలు చూసుకుని తిరిగి ఇంటికి వచ్చేవాడు. ఎప్పటిలాగే నాలుగు రోజుల కిందట ఆయన హైదరాబాద్‌కు వెళ్లారు. అబిడ్స్‌లోని బృందావనం లాడ్జిలో ఓ గదిని అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. ఆదివారం ఉదయం ఆయన గుండెపోటుకు గురై లాడ్జిలోని తన గదిలో మృతి చెందాడు. లాడ్జి యాజమాన్యం అబిడ్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. కొండలరావు వద్ద లభ్యమైన ఫోను నంబర్లు ఆధారంగా అతని స్నేహితుడైన నెల్లూరు గురుతోటకు చెందిన ల్యాండ్రి యజమాని వెంకటేశ్వర్లుకు సమాచారం అందించారు.

మృతిని జీర్ణించుకోలేక..
ఆదివారం కావడంతో సుజాత తన పిల్లల కోసం చికెన్, దోసెలు చేసింది. ముగ్గురూ టిఫిన్‌ తింటుండగా వెంకటేశ్వర్లు కొండలరావు మృతి చెందాడన్న విషయాన్ని వారికి తెలియజేశాడు. దీంతో వారు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. గుండెలవిసేలా రోదిస్తుండటంతో వెంకటేశ్వర్లు గొల్లవీధిలోని మృతుడి బంధువులకు తెలియజేశారు. కొండలరావు లేడన్న విషయాన్ని జీర్ణించుకోలేని తల్లి, కుమార్తెలు ఉరేసుకుని ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టారు. బంధువులు హుటాహుటిన కొండలరావు ఇంటి వద్దకు వచ్చారు. తలుపులు తెరిచేందుకు ప్రయత్నించగా అవి రాలేదు. సుజాత, పిల్లలను పిలువగా లోపలి నుంచి అలికిడి లేకపోవడంతో చుట్టు పక్కలవారిని పిలిచారు. కింద ఇంట్లో కొయ్యపనిచేస్తున్న వారు పైకి వచ్చి తలుపులు తెరిచేందుకు ప్రయత్నం చేశారు. స్థానికులు షాబుద్దీన్, మరికొందరు అక్కడకు చేరుకుని తలుపులు పగులగొట్టి లోనికి ప్రవేశించారు. హాలులో పెద్ద కుమార్తె విష్ణువర్ధిని (13) ఫ్యాన్‌కు ఉరేసుకుని వేలాడుతూ కనిపించింది.

సుజాత, చిన్న కుమార్తె దివ్యసోనిక కోసం వెతగ్గా హాలులో ఉన్న మరో ఫ్యాన్‌కు, పడక గదిలోని ఫ్యాన్‌కు చీరలు వేలాడుతూ కనిపించాయి. పడక గదిలో తల్లి, దివ్యసోనికలు అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. వారి పక్కనే హిట్, హార్పిక్స్‌ బాటిల్స్‌ ఉన్నాయి.  ఉరేసుకోవడం కుదరకపోవడంతో దోమలను చంపేందుకు ఉపయోగించే హిట్, మరుగుదొడ్లును శుభ్రం చేసే హార్పిక్స్‌లను తాగినట్లు తెలుస్తోంది. దివ్యసోనిక ముక్కు, నోట్లో నుంచి రక్తం రావడాన్ని గమనించారు. వెంటనే సుజాత, ఆమె కుమార్తెను చికిత్స నిమిత్తం హుటాహుటిన నగరంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం నారాయణ హాస్పిటల్‌కు తరలించారు. ఈ ఘటనపై సంతపేట పోలీసులకు సమాచారం అందించారు. సంతపేట ఇన్‌స్పెక్టర్‌ బి. పాపారావు , ఎస్సై సుభాని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. స్థానికుల సహాయంతో విష్ణువర్ధిని మృతదేహాన్ని కిందకు దించారు. బాధిత బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్‌ మార్చురీకి తరలించారు. కొండలరావు మృతదేహం సోమవారం నెల్లూరుకు రానుంది. అందుకు బంధువులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.

గురుతోటలో విషాదఛాయలు
కొండలరావు అతని కుమార్తె విష్ణువర్ధిని మృతి చెందండం, అతని భార్య సుజాత, కుమార్తె దివ్యసోనిక ప్రాణాపాయస్థితిలో ఆస్పత్రిలో ఉండడంతో గురుతోట, గొల్లవీధిలో విషాదం నింపింది. ఈ ఘటన తెలుసుకున్న స్థానికులు పెద్ద ఎత్తున ఘటనా స్థలానికి చేరుకుని విష్ణువర్ధిని మృతదేహాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తోటి పిల్లలతో ఆడుకున్న విష్ణువర్ధిని, దివ్యసాయి, వారి తల్లి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అందరి హృదయాలను కలిచి వేసింది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top