నాకెందుకు శాపం.. నేనేమి చేశాను పాపం!

Three people Died In Road Accident At Nellore  - Sakshi

‘దేవుడా..! నాకెందుకు ఈ శాపం.. నేనేమి చేశాను పాపం.. నన్ను కూడా తీసుకెళ్లితే బావుండు.. నేను ఎవరి కోసం బతకాలి.. నేనెందుకు బతకాలి..’ అంటూ ఆ ఇల్లాలు గుండెలు బాదుకుంటూ రోదించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. కళ్లెదుటే విగతజీవులుగా పడి ఉన్న భర్త, ఇద్దరు పిల్లలను చూసి తల్లడిల్లిపోయింది. కళ్లల్లో నీళ్లు ఇంకిపోయే వరకు ఏడ్చింది. అల్లారుముద్దుగా పెంచుకున్న పిల్లలు దూరమవడాన్ని తట్టుకోలేకపోయింది. వారి తల నిమురుతూ.. పదేపదే ముద్దాడుతూ గుండెలు పగిలేలా రోదించింది. ఈ ఘటన రాపూరు మండలం గుండవోలులో ఆదివారం విషాదాన్ని నింపింది.  

శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు: మండలంలోని వెలుగోను జంక్షన్‌ నుంచి ఏపూరు వెళ్లే జాతీయ రహదారిలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదం ఆ కుటుంబంలో పెను విషాదాన్ని నింపింది. ప్రమాదంలో తండ్రి, కుమార్తె అక్కడికక్కడే మృతి చెందగా, కుమారుడు చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. అంతవరకు తనతో ఉన్న భర్త, ఇద్దరు పిల్లలను పోగొట్టుకున్న ఆ ఇల్లాలు షాక్‌కు గురై కుప్పకూలిపోయింది. మోటారు బైక్‌పై గంగోటి ప్రతాప్‌ తన కుమార్తె వైష్ణవి, కుమారుడు సిద్ధార్ధతో కలిసి గుండవోలుకు బయల్దేరారు. ఎదురుగా వస్తున్న ఇన్నోవా కారు ఢీకొనడంతో ప్రతాప్, వైష్ణవి, అక్కడికక్కడే మృతి చెందగా గాయపడిన సిద్ధార్ధను వైద్యం నిమిత్తం నెల్లూరుకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న సిద్ధార్ధ (8) ఆదివారం మృతి చెందాడు.   

కుప్పకూలిన ప్రభావతి 
భర్త, పిల్లలు ఒకేసారి మృత్యువాత పడడంతో ప్రభావతి కుప్పకూలింది. ఆమెను ఓదార్చడం ఎవరితరమూ కాలేదు. జేసీబీ డ్రైవర్‌గా పనిచేస్తున్న ప్రతాప్‌ (38) ముంపు గ్రామానికి చెందినవాడు కావడం త్వరలో ఉద్యోగం వస్తుందన్న ఆశతో ఉన్న కుటుంబానికి నిరాశే మిగిలింది. గ్రామంలో అందరితో కలిసిమెలిసి ఉంటున్న కుటుంబంలోని ముగ్గురూ మృత్యువాత పడడంతో వృద్ధ తల్లిదండ్రులతోపాటు గ్రామం అంతా విషాదంలో మునిగింది. 

ఒకేసారి ముగ్గురికి అంత్యక్రియలు 
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ప్రతాప్, వైష్ణవి, సిద్ధార్ధకు ఆదివారం గ్రామంలో ఒకేసారి అంత్యక్రియలు నిర్వహించారు. గ్రామంలోని బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు రోదనలతో గ్రా>మం శోకసంద్రంలో మునిగిపోయింది.  
 

మరిన్ని వార్తలు :

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top