నకిలీ శానిటైజర్స్‌ గుట్టురట్టు

Fake Sanitizers Rocket Reveals in Hyderabad - Sakshi

పోలీసుల దాడులు.. ముగ్గురి అరెస్టు..

రూ 40 లక్షల విలువైన ముడిసరుకు, యంత్రాలు స్వాధీనం..

కుషాయిగూడ: నకిలీ శానిటైజర్ల గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఈ సంఘటన కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది.  రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ ఆదేశాల మేరకు భువనగిరి ఎస్‌ఓటీ పోలీసులు, కుషాయిగూడ పోలీసులు, ఆయూష్‌ డ్రగ్‌ అధికారులు, కాప్రా రెవిన్యూ అధికారులు సంయుక్తగా దాడులు జరిపి నకిలీ శానిటైజర్లను తయారు చేస్తున్న ఓ కంపేనీ ఆకస్మిక దాడులు జరిపి ముగ్గురిని అరెస్టు చేసి సుమారు 40 లక్షల విలువైన శానిటైజర్లు, ముడిసరుకులు, యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఇన్‌స్పెక్టర్‌ చంద్రశేఖర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. చర్లపల్లి పారిశ్రామికవాడలోని ఫేజ్‌–3లో కాకర్లపుడి కృష్ణకిరణ్‌ అనే పారిశ్రామికవేత్త 2018లో సెవెన్‌హిల్స్‌ సాఫ్ట్‌జెల్‌ పరిశ్రమను నెలకొల్పి నిర్వహిస్తున్నాడు. ఎలాంటి అనుమతులు లేకుండానే పరిశ్రమను కొనసాగిస్తున్నాడు. కరోనా వైరస్‌ నేపధ్యంలో శానిటైజర్ల డిమాండ్‌ పెరిగిన విషయం తెలిసిందే. ఇదే అదునుగా బావించి తన కంపెనీలో సిమెన్‌ క్లీన్‌సెమ్, సెమెన్‌ కోక్లీన్‌ –19 పేర్లతో నకిలీ శానిటైజర్లను తయారు చేసి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలల్లో పెద్ద ఎత్తున విక్రయిస్తున్నారు. ఇప్పటికే సుమారు లక్ష బాటిళ్లను విక్రయించి రూ.1.44 కోట్ల వ్యాపారం చేశారు.

గత జనవరి నుంచి జాతీయ మార్కేట్‌లోకి ప్రవేశించి ఆన్‌లైన్, రిటైల్‌ మార్కెట్‌  ద్వారా చైనా, హుహన్‌లో అమ్మకాలు ప్రారంభించాడు.  మాస్క్‌లు, శానిటైజర్లను అధిక ధరలను విక్రయించే వారిని కట్టడి చేయాలని ప్రభుత్వం ఆదేశించిడంతో పోలీసులు జరిపిన దాడుల నేపధ్యంలో ఈ నకిలీ శానిటైజర్ల వ్యవహరం వెలుగులోకి వచ్చింది. వీరు తయారు చేసే శానిటైజర్లు డ్రై కావడం లేదని గ్రహించిన పోలీసులు మంగళవారం రాత్రి సీపీ ఆదేశాల మేరకు  చర్లపల్లిలోని సెవెన్‌హిల్స్‌ సాఫ్ట్‌ జెల్‌ కంపేనీపై ఎస్‌ఓటీ భువనగరి, స్థానిక పోలీసులు, ఆయూష్‌ డ్రగ్స్‌ ఇన్‌స్పెక్టర్‌ డాక్టర్‌ బాలకృష్ణ, కాప్రా తహసీల్థార్‌ గౌతమ్‌కుమాల నేతృత్వంలో  దాడులు జరిపారు. దీంతో నకిలీ శానిటైజర్ల తయారీ గుట్టు రట్టయింది. కంపేనీ ఎండీ కాకర్లపుడి కృష్ణకిరణ్, జనరల్‌ మేనేజర్‌ వేమూరి వెంకట సుబ్రమణ్యం, మెయింటనెన్స్‌ ఇంజనీర్‌ వేమూరి విశ్వనాథ్‌లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు 40 లక్షల విలువ చేసే  25 వేల నకిలీ 100 ఎంఎల్‌ శానిటైజర్‌ బాటిళ్లు, 3 ఐఎస్‌ఓ ప్రొల్పీ ఆల్కహాల్‌  డ్రమ్‌లు, మూడు ఫిల్లింగ్‌ యంత్రాలు, 2 స్టీల్‌డ్రమ్‌లు, 4 వేల ఖాళీ శానిటైజర్ల బాటిళ్లు, ఎస్‌టీఆర్, ఎస్‌హెచ్‌ఎం యంత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు.  ఘటన స్థలాన్ని రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్, మల్కాజిగిరి డీసీపీ రక్షితమూర్తి సందర్శించగా ఈ దాడుల్లో  అడిషనల్‌ డిప్యూటీ కమీషనర్‌  సురేందర్‌రెడ్డి, ఆయూష్‌ డ్రగ్స్‌ ఇన్‌స్పెక్టర్‌ డాక్టర్‌ బాలకృష్ణ, కుషాయిగూడ ఏసీపీ శివకుమార్, కాప్రా తహసీల్థార్‌ గౌతమ్‌కుమార్, ఎస్‌ఓటీ ఇన్‌స్పెక్టర్లు వెంకటేశ్వర్లు, కేఎస్‌ రత్నం, కుషాయిగూడ ఇన్‌స్పెక్టర్‌ చంద్రశేఖర్‌ పాల్గొన్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top