ప్యాక్‌ చేసి అమ్మేస్తాడు..!

Fake Cartridge Sales Man Arrest in Hyderabad - Sakshi

నకిలీ క్యాట్రిడ్జెస్‌ దందా గుట్టురట్టు

బ్రాండెడ్‌విగా పేర్కొంటూ విక్రయాలు

నిందితుడి అరెస్ట్‌

సాక్షి, సిటీబ్యూరో: అప్పటికే ఓసారి వినియోగించిన, నకిలీ క్యాట్రిడ్జెస్‌ను రీ–ప్యాక్‌ చేసి బ్రాండెడ్‌విగా పేర్కొంటూ విక్రయిస్తున్న గుట్టును ఉత్తర మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు బట్టబయలు చేశారు. ఓ నిందితుడిని అరెస్టు చేయడంతో పాటు భారీగా నకిలీ క్యాట్రిడ్జ్‌లు, వివిధ బ్రాండ్ల పేరుతో ఉన్న ఖాళీ బాక్సులు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ రాధాకిషన్‌రావు శుక్రవారం తెలిపారు. గుజరాత్‌లోని కచ్‌ ప్రాంతానికి చెందిన జగదీష్‌ అంబాబాయ్‌ రవారియా పదేళ్ల క్రితం కుటుంబంతో సహా నగరానికి వలసవచ్చి పంజగుట్ట ప్రాంతంలో స్థిరపడ్డాడు. ఇతడు కొన్నాళ్ల పాటు సికింద్రాబాద్, సీటీసీలోని ఓ కంప్యూటర్ల దుకాణంలో పని చేశాడు. అక్కడే ప్రింటర్లలో వినియోగించే క్యాట్రిడ్జెస్‌ క్రయ విక్రయాలపై అనుభవం సంపాదించాడు.

ఆ ఉద్యోగంలో వచ్చే జీతం చాలకపోవడంతో పాటు తేలిగ్గా తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకుగాను వినియోగదారులకు బ్రాండెడ్‌ అంటూ నకిలీ క్యాట్రిడ్జ్‌లు విక్రయించాలని పథకం వేశాడు. రసూల్‌పుర ఓ గోదాము అద్దెకు తీసుకున్న ఇతను ఆ దందా ప్రారంభించాడు. అందుకు అవసరమైన వస్తువులను ముంబైలో ఖరీదు చేసేవాడు. ఓసారి వినియోగించిన, నకిలీ క్యాట్రిడ్జ్‌లను తక్కువ ధరకు కొనుగోలు చేసే ఇతను ప్రముఖ కంపెనీల పేర్లతో ఉన్న డబ్బాల్లో ప్యాక్‌ చేసేవాడు. ఇలాంటి క్యాట్రిడ్జ్‌లను నిజమైనవిగా పేర్కొంటూ అమ్మి సొమ్ము చేసుకుంటున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.నాగేశ్వరరావు నేతృత్వంలో ఎస్సైలు జి.రాజశేఖర్‌రెడ్డి, కె.శ్రీకాంత్, బి.పరమేశ్వర్‌లతో కూడిన బృందం శుక్రవారం గోదాముపై దాడి చేసింది. జగదీష్‌ను పట్టుకోవడంతో పాటు భారీగా నకిలీ క్యాట్రిడ్జ్‌లు, ఖాళీ బాక్సులు తదితరాలు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం నిందితుడిని బేగంపేట పోలీసులకు అప్పగించారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top