రాకేష్‌ పోలీస్‌ కస్టడీ పొడిగింపు | Extension of Rakesh police custody | Sakshi
Sakshi News home page

రాకేష్‌ పోలీస్‌ కస్టడీ పొడిగింపు

Feb 17 2019 3:58 AM | Updated on Feb 17 2019 3:58 AM

Extension of Rakesh police custody  - Sakshi

రాకేష్‌ రెడ్డిని కోర్టుకు తరలిస్తున్న పోలీసులు

హైదరాబాద్‌: కోస్టల్‌ బ్యాంకు డైరెక్టర్‌ చిగురుపాటి జయరాం హత్య కేసులో ప్రధాన నిందితుడు కవకుంట్ల రాకేష్‌రెడ్డి, మరో నిందితుడు దున్న శ్రీనివాస్‌లను మరో 8 రోజులపాటు పోలీసు కస్టడీలోకి తీసుకునేందుకు నాంపల్లి కోర్టు అనుమతించింది. ఇప్పటికే మూడు రోజులపాటు రాకేష్‌రెడ్డి, శ్రీనివాస్‌లను పోలీసులు విచారించినా దర్యాప్తులో పెద్దగా పురోగతి కనిపించలేదు. మరింత సమాచారం, క్రైం సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ కోసం సమయం కావాలని, అందుకే వీరిద్దరి కస్టడీని పొడిగించాలని కోరుతూ జూబ్లీహిల్స్‌ పోలీసులుకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. మూడు రోజుల కస్టడీ ముగియడంతో రాకేష్‌రెడ్డి, శ్రీనివాస్‌లను పోలీసులు శనివారం ఉదయం న్యాయస్థానంలో హాజరుపరిచారు. అక్కడి నుంచి చంచల్‌గూడ జైలుకు తరలించారు. కస్టడీ పొడిగింపునకు అనుమతిస్తూ కోర్టు జారీ చేసిన ఉత్తర్వుల కాపీలను పోలీసులు జైలు సూపరింటెండెంట్‌కు అందజేసి మళ్లీ వీరిని కస్టడీలోకి తీసుకున్నారు.  

హత్యలో ఐదుగురి పాత్ర... 
జయరాం హత్య కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. నిందితులను ఒక్కొక్కరిని గుర్తిస్తున్నట్లు తెలుస్తున్నది. నగేష్‌ అనే రౌడీషీటర్‌ అల్లుడు విశాల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. సినీనటుడు సూర్య పోలీసుల అదుపులోనే ఉన్నాడు. రాకేష్‌రెడ్డి ఇంట్లో హత్య జరిగిన రోజున డైనింగ్‌ టేబుల్‌పై ఐదు ప్లేట్లు ఉన్న విషయాన్ని పోలీసులు గుర్తించారు. దీంతో ఈ హత్యలో ఐదుగురి పాత్ర ఉన్నట్లు భావిస్తున్నారు. ఇప్పటికే రాకేష్‌రెడ్డి, శ్రీనివాస్‌ల పాత్రలను గుర్తించారు. ఇంకో ముగ్గురిలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

ఇంకొకరు ఎవరనేదానిపై ఆరా తీస్తున్నారు. కేసుకు సంబంధించి అనుమానితులను విచారిస్తూనే రాకేష్‌రెడ్డి కాల్‌డేటాను పరిశీలిస్తున్నారు. హత్య జరిగిన రోజు, ఆ తెల్లవారి, అంతకుముందు వారం రోజులు ఎవరెవరికి ఫోన్లు చేశారనే వివరాలను సేకరిస్తున్నారు.  హత్య ఘటన కంటే ముందు వారం రోజులు, ఆ తర్వాత రెండు రోజులు చేసిన మొత్తం 300 పైగా కాల్స్‌ వివరాలను పోలీసులు సేకరించినట్లు తెలుస్తోంది. ఈ 8 రోజుల కస్టడీలో పూర్తి దర్యాప్తు కొనసాగుతుందని, కేసులో పురోగతి కనిపిస్తుందని పోలీసులు భావిస్తున్నారు. ఆదివారం వెస్ట్‌జోన్‌ డీసీపీ ఏఆర్‌ శ్రీనివాస్‌ ప్రత్యేకంగా రాకేష్‌రెడ్డిని విచారించడానికి బంజారాహిల్స్‌ ఠాణాకు రానున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement