ప్రాణాలు మింగిన కరెంటు తీగలు 

Electricity Cables Man Died Mancherial - Sakshi

గుడిహత్నూర్‌(బోథ్‌) : విద్యుత్‌శాఖ నిర్లక్ష్యానికి ఓ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. గంట వ్యవధిలో ఇంటికి రావాల్సిన వ్యక్తి కరెంట్‌ తీగలకు బలికావడంతో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. ఈ సంఘటన గుడిహత్నూర్‌ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. కుటుంబసభ్యుల సమాచారం ప్రకారం.. మండల కేంద్రంలోని రాజీవ్‌నగర్‌కు చెందిన సానప్‌ అర్జున్‌ (38) కూలీనాలీ చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. డ్రైవర్‌గా కూడా పని చేస్తూనే మేకలు పెంచుకుంటున్నాడు.

ఈ ఏడాది ముత్నూర్‌ శివారులో నాలుగు ఎకరాలు భూమి కౌలుకు తీసుకొని సాగుకు సిద్ధం చేశాడు. శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో కాలనీకి చెందిన అబ్బాయి మేకలను మేతకు తీసుకెళ్లడంతో వాటిని ఇంటికి కొట్టుకు రావడానికి అర్జున్‌ వెళ్లాడు. గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి వంగిన స్తంభాల తీగలు నేలకు అంటుకున్నాయి. ఓ మేక తీగలవైపు పరుగెత్తడంతో దానిని మరలించే క్రమంలో మేకతోపాటు అర్జున్‌ కరెంటు షాక్‌కు గురై అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ఆయన ముందు వెళ్తున్న అబ్బాయి ప్రమాదాన్ని గమనించి వెంటనే ఇంటికి చేరి సమాచారం అందించాడు. కుటుంబ సభ్యులు చేరుకొని బోరున విలపించారు. అర్జున్‌కు భార్య ఉష, కూతురు నందిని, కుమారుడు భగవాన్‌ ఉన్నారు.

విద్యుత్‌శాఖ అధికారులపై  కాలనీవాసుల ఆగ్రహం 

సమాచారం అందుకున్న కాలనీవాసులు, అతడి మిత్రులు సంఘటనా స్థలానికి చేరుకొని విద్యుత్‌శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సంఘటన జరిగి రెండు గంటలు కావస్తున్న అధికారుల ఫోన్లు స్విచ్ఛాప్‌ చేసుకొని ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడడం సరికాదని మండిపడ్డారు. ఆలస్యంగా అయినా చేరుకుని ఏఎస్సై అశోక్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. అనంతరం ఎస్సై ప్రమాద స్థలంలో వివరాలు సేకరించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

బోరున విలపిస్తున్న కుటుంబ సభ్యులు

మృతి చెందిన అర్జున్, మేక 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top