దర్జాగా విద్యుత్‌ చౌర్యం

Electrical Theft From The Transformer - Sakshi

చర్ల భద్రాచలం : మండలంలోని చింతగుప్ప సమీపంలో బ్రిడ్జి నిర్మాణ కాంట్రాక్టర్‌ దర్జాగా విద్యుత్‌ చౌర్యానికి పాల్పడుతున్నాడు. ఆర్‌ కొత్తగూడెం నుంచి కుర్నపల్లికి వెళ్లే ప్రదాన రహదారి పక్కనే ఈ వ్యవహారం కొనసాగుతున్నప్పటికీ విద్యుత్‌ శాఖాదికారులుగానీ, సిబ్బందిగానీ పట్టించుకోకపోవడాన్ని స్థానికులు తీవ్రంగా తప్పుపడుతున్నారు.

విద్యుత్‌ వాడకానికి సంబందించి కాంట్రాక్టర్‌ ఎటువంటి అనుమతులు తీసుకోకుండానే నేరుగా చింతగుప్పలోని విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌కు వైర్లు ఏర్పాటు చేసి అక్కడి నుంచి వంతెన నిర్మాణ ప్రాంతానికి సుమారు 600 మీటర్ల మేర సర్వీస్‌ వైరును ఏర్పాటు చేసి విద్యుత్తును చోరీ చేస్తున్నాడు. రెండు నెలల క్రితం ఆర్‌ కొత్తగూడెం– కుర్నపల్లి రహదారిలో చింతగుప్ప వద్దనున్న చింతవాగుపై వంతెన నిర్మాణ పనులు చేపట్టారు.

ఇందులో భాగంగా వెల్డింగ్, కటింగ్, రాడ్‌ బెండింగ్‌ వంటి పనులతోపాటు అక్కడ వర్కర్ల కోసం ఏర్పాటు చేసిన తాత్కాలిక నివాసాలకు విద్యుత్‌ అవసరమవ్వడంతో సంబందింత కాంట్రాక్టర్‌ విద్యుత్‌ చౌర్యానికి తెర లేపాడు. చింతగుప్పలో గ్రామస్తుల కోసం ఏర్పాటు చేసిన 6.6 కేవీఏ విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ ఫ్యూజ్‌ కటౌట్లకు వైరును తగిలించి 11 కేవీ విద్యుత్‌ లైన్‌కు స్తంభాల మీదుగా సుమారు 600 మీటర్ల సర్వీస్‌ వైరును వంతెన నిర్మాణ ప్రాంతం వరకు ఏర్పాటు చేశారు.

అక్రమంగా ఏర్పాటు చేసిన ఈ విద్యుత్‌ లైన్‌తో అక్కడ వెల్డింగ్, కటింగ్‌ వంటి పనులు చేయిస్తూ విద్యుత్‌ చౌర్యానికి పాల్పడుతున్నారు. ఈ వ్యవహారం బహిరంగంగానే కొనసాగుతున్నప్పటికీ సంబందిత శాఖాదికారులు పట్టించుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది.

నిరుపేదలు, గిరిజనులు, దళితులు కనీసం కరెంట్‌మీటరుకు గానీ కరెంట్‌బిల్లు గానీ కట్టలేని పరిస్థితిలో ఉండే వారు ఒకటో రెండో బల్బుల వాడకం కోసం విద్యుత్‌ సరఫరా తీసుకొని వాడుకుంటే కేసులు నమోదు చేసి, జరిమానాలు విధించే విద్యుత్‌ శాఖాదికారులు... ఈ బహిరంగ విద్యుత్‌ చౌర్యంపై మౌనంగా ఉండడం వెనుక ‘ఏదో మతలబు’ ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 
దీనిపై ట్రాన్స్‌కో ఏఈ మోహన్‌రెడ్డిని ‘సాక్షి’ వివరణ కోరింది. విద్యుత్‌ చౌర్యానికి పాల్పడే కాంట్రాక్టర్‌పై కేసులు నమోదు చేస్తామని ఆయన అన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top