గంజాయి.. గుప్పు!

Drug And Marijuana Smuggling In Krishna - Sakshi

గంజాయి రవాణా కేంద్రంగా బెజవాడ   

మన్యం ప్రాంతాల నుంచి కార్యకలాపాలు

నగరంలో పెరుగుతున్న విష సంస్కృతి     

మత్తు మనిషిని చిత్తు చేస్తుంది. ఒక్కసారి అలవాటుపడిన తర్వాత వదలనంటుంది. వేదనపెడుతుంది.బెజవాడ నగరం గంజాయి అక్రమ రవాణా కేంద్రంగామారుతున్న పరిణామాలు కలవరపెడుతున్నాయి.
చాపకిందనీరులా ఎంతమంది ఈ వ్యసనానికి బానిసలవుతున్నారనే విషయం ఆందోళన కలిగిస్తోంది.గంజాయి ముఠాలు గుట్టుచప్పుడు కాకుండా విజయవాడపైఉచ్చువేసి మత్తులోకి దించుతున్నట్లు తెలుస్తోంది.పోలీసుల ఉదాసీనత.. పాలకులకు పట్టని వైనం వెరసిబెజవాడ గంజాయికి అడ్డాగా మారుతోంది. మత్తువదలకుంటే తీవ్రపరిణామాలను చవిచూడాల్సివస్తుంది.

సాక్షి, అమరావతిబ్యూరో : సెప్పెంబరు 25న విశాఖపట్నం నుంచి చెన్నై వెళ్తున్న ఒక ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులో అక్రమంగా రవాణా చేస్తున్న 17.33 కిలోల గంజాయిని విజయవాడలో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు. నగరంలోని రామవరప్పాడు వద్ద సెప్టెంబరు 30వ తేదీ విశాఖపట్నం నుంచి చెన్నై వెళ్తున్న ఓ కారులో అక్రమంగా రవాణా చేస్తున్న గంజాయిని డైరెక్టర్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ అధికారులు పట్టుకున్నారు. 132 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రాజధాని ప్రాంతమైన విజయవాడ కేంద్రంగా గంజాయి రవాణా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. రైళ్లు, బస్సులు, ఇతర ప్రైవేటు వాహనాల ద్వారా నగరానికి తెచ్చే గంజాయి విక్రయాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దేశంలో ఎక్కడికైనా చేరుకునేందుకు విజయవాడ నుంచి ఎప్పుడైనా రైలు సదుపాయం అందుబాటులో ఉండడం.. నగర శివారు ప్రాంతాల్లో అత్యధికంగా పేద, మధ్య తరగతి ప్రజలు నివసిస్తుండడం వల్ల గంజాయి అక్రమ రవాణాతో పాటు వినియోగం కూడా పెరుగుతోంది. అక్రమ రవాణా, విక్రయదారుల పట్ల పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తుండటంతోఈ విష సంస్కృతి పెరిగిపోవడానికి ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి.   

నగరానికి చేరుస్తున్నారు ఇలా..  
పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం, విశాఖపట్నం జిల్లా మన్యం ప్రాంతాలతో పాటు తెలంగాణలోని ఇల్లందు ప్రాంతాల నుంచి పెద్ద మొత్తంలో గంజాయి నగరానికి వచ్చిచేరుతోంది. ఆయా ప్రాంతాలకు చెందిన కొందరు వ్యక్తులు సరుకును నగరానికి తీసుకొచ్చి దళారులకు అప్పగించి వెళ్లిపోతుంటారు. అత్యంత రహస్యంగా బలిష్టమైన ప్యాకింగ్‌ చేసి వాసన కూడా బయటకు రాకుండా మిర్చీ మధ్యలోనూ కొరియర్‌ బాక్సుల్లో దీన్ని తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఎక్కువ మొత్తంలో తేవాలంటే మాత్రం కార్లు, లారీలు, బస్సులు వంటి వాహనాలను వినియోగిస్తున్నారు. గంజాయిని సూట్‌ కేసుల్లో, స్టీలు సంచుల్లో, మెడికల్‌ కిట్లలో రవాణా చేస్తున్నారు. వాసన రాకుండా పౌడర్‌ చల్లడం వల్ల ఎవరికీ అనుమానం ఉండదు. నగర ప్రవేశ మార్గాల్లో ఎటువంటి తనిఖీ కేంద్రాలు లేకపోవడం.. ఉన్నా అక్కడి వారు పట్టించుకోకపోవడంతో అక్రమ రవాణా సాగిపోతోంది. ఇక్కడి నుంచి కృష్ణా జిల్లాతో పాటు దేశంలోని పలు ప్రాంతాలకు గంజాయి రవాణా యథేచ్ఛగా జరుగుతోంది. 

ఆడుతూపాడుతూ అక్రమ రవాణా..
విజయవాడ గంజాయి రవాణాకు అడ్డాగా మారింది. ఇక్కడి నుంచి రూ.లక్షల్లో విలువ చేసే వందల కిలోల గంజాయి రైళ్ల ద్వారా తరలిపోతోంది. ఒడిశాలోని బరంపురంతో పాటు విశాఖపట్నం, శ్రీకాకుళం, తూర్పుగోదావారి, ఖమ్మం జిల్లాలోని మన్యం ప్రాంతాల నుంచి నిత్యం రైళ్లతో పాటు బస్సులు, కార్లలో రవాణా జరుగుతోంది. అయితే పోలీసులు పట్టుకున్న ప్రతిసారి చిన్న చేపలు మాత్రమే దొరకడం, పెద్ద చేపలు తప్పించుకోవడం పోలీసులకు సవాలుగా మారుతోంది. పట్టుబడ్డ వారంతా సామాన్యులే కావడం గమనార్హం. శ్రీకాకుళం నుంచి బాపట్ల, గుంటూరు వరకు విస్తరించిన రైల్వే పోలీసు డివిజన్‌లో గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉంది.

పట్టుబడిన వారికి వెంటనే బెయిల్‌..
గంజాయి కేసుల్లో పట్టుబడ్డ వెంటనే లాయర్లను ఏర్పాటు చేసి బెయిల్‌ ఇప్పించే పనిని కూడా ముఠా సభ్యులే చూసుకుంటారు. సామాన్యులనే ఎంచుకుని రైళ్లలో ప్రయాణికులు మాదిరిగా బ్యాగులతో తరలించి ఎవరికీ అనుమానం రాకుండా ఈ వ్యాపారాన్ని సెల్‌ఫోన్లపైనే నడుపుతున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయిని రోజుల తరబడి పోలీసులు జాగ్రత్తగా ఉంచి న్యాయస్థానాల్లో హాజరుపరచాలి. ఎక్కువ సమయం వృథా అయ్యే కేసుగా గంజాయి కేసులు ఉంటాయని పోలీసులే చెబుతున్నారు. అందుకే ఈ కేసులపై అంతగా దృష్టి పెట్టలేమిని చెప్పేవారు లేకపోలేదు. గంజాయి అక్రమ రవాణా ముఠా సభ్యులు ఎక్కువగా మహిళలను ఎంచుకుంటున్నారు. పోలీసులు రైళ్లలో పరుషులను ఎక్కువగా తనిఖీ చేస్తుండడంతో మహిళల ద్వారా చేరవేస్తున్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top