దేశ రాజధానిలో దారుణం

Delhi Student Found Dead In Delhi School Toilet - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : గుర్గావ్‌ బాలుడు ప్రద్యుమన్‌ హత్య ఉదంతం మరిచిపోకముందే.. దేశ రాజధానిలో మరో దారుణం చోటు చేసుకుంది. ఢిల్లీలోని ఓ ప్రైవేట్‌ స్కూల్‌లో విద్యార్థి టాయ్‌లెట్‌లో శవమై కనిపించాడు. డయేరియాతోనే విద్యార్థి చనిపోయినట్లు స్కూల్‌ యాజమాన్యం చెబుతుండగా.. తోటి విద్యార్థుల దాడిలోనే ప్రాణాలు కోల్పోయాడని తల్లిదండ్రులు వాదిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.

పోలీసుల కథనం ప్రకారం... 
ఉత్తర ఢిల్లీ కారావల్‌ నగర్‌కు చెందిన తుషార్‌(16) స్థానికంగా ఉన్న ఓ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. గురువారం పాఠశాలకు వెళ్లిన తుషార్‌ అస్వస్థతకు గురికావటంతో స్కూల్‌ యాజమాన్యం జీటీబీ ఆస్పత్రిలో చేర్పించింది. ఆపై బాలుడి తల్లిదండ్రులకు సమాచారం అందించింది. వారు ఆస్పత్రికి వెళ్లాక బాలుడు మృతి చెందినట్లు తెలిపారు. అయితే వైద్యులు మాత్రం ఆస్పత్రికి తీసుకొచ్చేసరికి బాలుడు మృతి చెందినట్లు చెప్పారు.

ముమ్మాటికీ హత్యే...  
తల్లిదండ్రులు మాత్రం ఇది హత్యేనని వాదిస్తున్నారు. తోటి విద్యార్థులే అతన్ని కొట్టి చంపేసి.. టాయ్‌లెట్‌లో పడేశారని, కొందరు విద్యార్థులు ఈ విషయాన్ని తమకు తెలియజేశారని వారంటున్నారు. విషయాన్ని పక్కదోవ పట్టించేందుకు, నిందితులను తప్పించేందుకు స్కూల్‌ యాజమాన్యం ప్రయత్నిస్తుందని ఆరోపిస్తున్నారు. ఇక తుషార్‌ బందువులతోపాటు స్థానికులు కొందరు స్కూల్‌ వద్ద ఆందోళన చేపట్టారు. నినాదాలు చేస్తూ ఒక్కసారిగా స్కూల్‌లోకి దూసుకెళ్లేందుకు యత్నించారు. ఈ క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోగా.. స్థానిక ఎమ్మెల్యే కపిల్‌ మిశ్రా జోక్యం చేసుకోవటంతో వారు వెనక్కి తగ్గారు.

సీసీ ఫుటేజీ ఆధారంగా... 
తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజీ లను పరిశీలించారు. అందులో తరగతి గది బయట ముగ్గురు విద్యార్థులు తుషార్‌ను చితకబాదినట్లు ఉంది. ఆపై వారు అతన్ని పరిగెత్తిస్తూ కొడుతున్న దృశ్యాలు రికార్డు అయ్యాయి. వీడియోలో ఉన్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ప్రస్తుతం వారిని విచారిస్తున్నట్లు సమాచారం. ఒంటిపై గాయాలు లేకపోవటంతో పోస్టు మార్టంలో అసలు నిజాలు వెలుగుచూస్తాయని పోలీసులు చెబుతున్నారు. 

సంచలనం సృష్టించిన గుర్గావ్‌ బాలుడు ప్రద్యుమన్‌ ఠాకూర్‌ హత్య ఉదంతం మరిచిపోకముందే.. దేశరాజధానిలో మరో ఘటన చోటు చేసుకోవటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top