ప్రాణం తీసిన ఈత సరదా.. | Degree Student Dies In Godavari River khammam | Sakshi
Sakshi News home page

ప్రాణం తీసిన ఈత సరదా..

Feb 25 2019 7:07 AM | Updated on Feb 25 2019 7:07 AM

Degree Student Dies In Godavari River khammam - Sakshi

మణుగూరుటౌన్‌: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండల పరిధిలోని మల్లేపల్లి వద్ద గోదావరిలో స్నానానికి వెళ్లి నీటిలో మునిగి విద్యార్థి మృతి చెందిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి పోలీసులు, స్నేహితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.  బాపనకుంట గ్రామానికి చెందిన ఈసం రామ్‌చరణ్‌ (21) పట్టణంలోని శ్రీ విద్య డిగ్రీ కళాశాలలో ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్నాడు. ఆదివారం కావడంతో స్నేహితులతో సరదాగా ఈత కొట్టేందుకు గోదావరి నదికి  వెళ్లాడు. గోదావరిలో స్నానానికి దిగగా మునిగిపోయాడు. రక్షంచండి.. రక్షించండి.. అని కేకలు వేసినా ఒడ్డున ఉన్న తోటి మిత్రులకు ఈత రాకపోవడంతో ఏమీ చేయలేకపోయారు.

చుట్టు పక్కల వారు వచ్చేలోపే గోదావరిలో మునిగి గల్లంతయ్యాడు. స్నేహితులు పోలీసులు, కుటంబ సభ్యులకు సమాచారం అందిచారు. సంఘటనా స్థలాన్ని సీఐ రమేష్‌బాబు సిబ్బందితో పరిశీలించి గాలింపు చర్యలు చేపట్టారు. సుమారు 7 గంటల ప్రాంతంలో మునిగిపోయిన ప్రాంతానికి కొద్ది దూరంలో రామచరణ్‌ మృతదేహం లభ్యమైంది. రామ్‌చరణ్‌ ఈ మధ్యనే పోలీస్‌ కానిస్టేబుల్‌ ఈవెంట్స్‌ ఎంపికల్లో అర్హత సాధించాడు. తండ్రి ఈసం వెంకటస్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తండ్రి  కొంత కాలంగా పక్షవాతంతో బాధపడుతున్నాడు. చేతికందిన కొడుకు ఉద్యోగం సాధించి తమ కుటుంబ కష్టాలు తీరుస్తాడని ఎన్నో ఆశలతో ఎదురు చూసిన కుటుంబ సభ్యులు రామ్‌చరణ్‌ మరణవార్త విని గుండెలవిసేలా రోదించారు. అనుకోని సంఘటనతో బాపనకుంట గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement