బతికుండగానే చంపేశారు | Degree Certificate Loans Scam In Hyderabad | Sakshi
Sakshi News home page

బతికుండగానే చంపేశారు

Jan 4 2020 1:58 AM | Updated on Jan 4 2020 1:58 AM

Degree Certificate Loans Scam In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇటీవల ‘అర్జున్‌ సురవరం’ సినిమా వచ్చింది. నిరుద్యోగుల డిగ్రీ సర్టిఫికెట్లను వారికి తెలియకుండా సేకరించి, బ్యాంకుల్లో తనఖా పెట్టి రుణాలు తీసుకుంటారు. ఈలోగా లోన్‌ కట్టలేదంటూ బ్యాంకు అధికారుల ఫిర్యాదుతో పోలీసులొచ్చి అరెస్టు చేస్తారు. బాధితుడైన హీరో.. ఆ స్కాంను బయటపెట్టడంతో కథ సుఖాంతమవుతుంది. సరిగ్గా హైదరాబాద్‌లో ఇదే తరహాలో ఓ ఘటన జరిగింది. తమ తోటి వ్యాపార భాగస్వామి తండ్రిని బతికుండగానే చనిపోయినట్లు నకిలీ పత్రాలు సృష్టించి, వారి ఆస్తినే తాకట్టు పెట్టి రూ.16 కోట్లు రుణం తీసుకున్నారు. వ్యక్తిగత సమాచారానికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు, ఆస్తులకు సంబంధిం చిన డాక్యుమెంట్లు నేర స్వభావం ఉన్నవారి చేతిలో పడితే చిక్కులు ఎదురవుతాయనడానికి ఈ ఘటన నిదర్శనంగా నిలిచింది. 

సీన్‌ కట్‌ చేస్తే..: బంజారాహిల్స్‌ రోడ్‌నంబర్‌ 5లో రెన్‌లైఫ్‌ ల్యాబ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ప్రధాన కార్యాలయం ఉంది. ఇది రక్తం నుంచి తీసిన సీరమ్, అల్బుమిన్‌ తదితరాలను సేకరించి విక్రయిస్తుంది. 2017లో ఈ కంపెనీని ఆరుల్‌ ప్రకాశ్, మహమ్మద్‌ అబ్దుల్‌ అజీజ్‌లు స్థాపించారు. వీరిద్దరూ కూడా కంపెనీ డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్నారు. తర్వాత కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన విజయ్‌.. మైసూర్‌ రాఘవేంద్ర మూడో డైరెక్టర్‌గా చేరాడు. రాఘవేంద్ర కుటుంబం పేరు మీద దక్షిణ బెంగళూరులోని కెంగెరి గ్రామంలో 3.3 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిపై ఆరుల్, అజీజ్‌లు కన్నేశారు. రాఘవేంద్రకు తెలియకుండా ఈ భూమి నకిలీ సేల్‌ డీడ్‌ సంపాదించారు. జానకీ రమాశర్మ అనే ఫైనాన్సియల్‌ కన్సల్టెంట్‌ సాయంతో సదరు భూమిని తనఖాగా ఉంచి రుణం కోసం తొలుత ఎస్‌బీఐ సైఫాబాద్‌ శాఖలో రుణం కోసం యత్నించారు. అక్కడ యత్నం బెడిసికొట్టింది. ఈసారి మరింత పకడ్బందీగా మహబూబ్‌గంజ్‌ ఎస్‌బీఐ బ్రాంచ్‌లో రాఘవేంద్ర పేరిట రుణానికి దరఖాస్తు చేసుకున్నారు.

నకిలీ డెత్‌ సర్టిఫికెట్‌..
డైరెక్టర్‌ రాఘవేంద్ర తండ్రి బతికుండగానే చనిపోయినట్లు, నకిలీ డెత్‌ సర్టిఫికెట్, నకిలీ ఫొటోలు, పవర్‌ ఆఫ్‌ అటార్నీ పత్రాలు సంపాదించారు. రుణం కోసం దరఖాస్తు పత్రాలకు జతచేసిన వివరాలు, ఆధార్‌ కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌లోని వివరాలతో పొంతనలేదు. అయినా వాటిని అలాగే సమర్పించారు. ఈ పత్రాలను సరిగ్గా పరిశీలించకుండానే.. మహబూబ్‌గంజ్‌ బ్రాంచ్‌ ఆర్‌ఎంఎంఈ పవన్‌కుమార్, చీఫ్‌ మేనేజర్‌ జే.నాగేశ్వరశర్మ, బ్యాంకు మేనేజర్‌ శశిశంకర్‌లు రూ.16 కోట్ల రుణాన్ని మంజూరు చేశారు. ఈ విషయం తెలుసుకున్న రాఘవేంద్ర అవాక్కయ్యాడు. తన తండ్రి చనిపోయాడంటూ పత్రాలు సృష్టించారని తెలుసుకుని కంగుతిన్నాడు. ఈ విషయంపైతానే స్వయంగా దర్యాప్తు చేశాడు.

బ్యాంకుకు వచ్చి లోను మంజూరు చేసినఫైళ్లలో ఫొటో, సంతకం తనవి కావని నిరూపించాడు. దీంతో నాలుక్కరుచుకున్న ఎస్‌బీఐ ఉన్నతాధికారులు లోను ఖాతాను నిరర్ధక ఆస్తి (నాన్‌పెర్ఫామింగ్‌ అసెట్‌)గా గతేడాది మార్చి 8న ప్రకటించారు. బ్యాంకు అంతర్గత విచారణలో విభాగాధిపతి ధనార్జనరావు సహా పలువురు అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని గుర్తించారు. అనంతరం సీబీఐకి ఫిర్యాదు చేశారు. తమ అధికారుల పాత్రపైనా విచారణ జరపాలని కోరారు. దీంతో ఐపీసీలోని పలు సెక్షన్ల ప్రకారం ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. గురువారం రాత్రి నిందితులుగా ఉన్న ఎస్‌బీఐ అధికారులు, రెన్‌లైఫ్‌ నిందితుల ఇళ్లపై సీబీఐ దాడులు నిర్వహించి పలు కీలకపత్రాలు స్వాధీనం చేసుకుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement