విషాదం : కన్న తండ్రి కళ్లెదుటే..

Daughter Dies In Front Of Father In Road Accident - Sakshi

అల్లారుముద్దుగా పెంచుతున్న తన కుమార్తెలను విద్యాలయాల్లో చేర్పించేందుకు బయలుదేరిన ఆ తండ్రిని విధి వెక్కిరించింది. తన కుమార్తెలిద్దరినీ ఆయా విద్యాలయాల్లో చేర్పించి సంతోషంతో ఇంటి ముఖం పట్టిన ఆ తండ్రికి తీరని వేదనే మిగిల్చింది. తనతోనే బైక్‌పై ప్రయాణిస్తున్న ఓ కుమార్తెను రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు మింగేసింది. కళ్ల ముందే కన్నబిడ్డ మృత్యు ఒడిలోకి వెళ్లిపోవడంతో గుండెలవిసేలా ఆ తండ్రి, తోబుట్టువులైన చెల్లి, తమ్ముడు కన్నీరుమున్నీరయ్యారు. అంతవరకు కలిసి తమతోనే ప్రయాణించిన రమ్యను మృత్యువు తీసుకుపోవడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.

సాక్షి, విజయనగరం : రోడ్డు ప్రమాదంలో ఓ బాలిక దుర్మరణం పాలైంది. మెంటాడ మండలం రాబంద గ్రామానికి చెందిన 12 సంవత్సరాల బాలిక కూనిశెట్టి రమ్య శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. వివరాల్లోకి వెళ్తే...మెంటాడ మండలం రాబంద గ్రామానికి చెందిన కూనిశెట్టి అప్పలరాజు తన ఇద్దరు కుమార్తెలను మరుపల్లిలో ఉన్న ఆదర్శ పాఠశాల, కస్తూర్బా పాఠశాలలో చేర్పించేందుకు తన ద్విచక్ర వాహనంపై శుక్రవారం బయలుదేరాడు. పనులు ముగించుకొని తిరిగి తన స్వగ్రామం రాబందకు తిరుగు పయనమయ్యాడు. ఇద్దరు కుమార్తెలతో పాటు కుమారుడు చైతన్యను కూడా తన వాహనంపై తీసుకొని బయలుదేరాడు. మార్గంలో మరుపల్లి వోలమ్‌ కంపెనీ మలుపు వద్ద వారి వెనుక నుంచి వస్తున్న గుర్తు తెలియని వాహనం వాహనాన్ని బలంగా ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో పెద్దమ్మాయి రమ్య అక్కడికక్కడే మృతి చెందింది. బైక్‌ను ఢీకొన్నది ఒడిశా లారీ అయి ఉండవచ్చని భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన తరువాత లారీ ఆగకుండా వెళ్లిపోవడంతో ఏ వాహనం అన్నది చెప్పలేకపోతున్నారు. తండ్రి అప్పలరాజు, రెండో కుమార్తె రేష్మ, కుమారుడు చైతన్యకు గాయాలయ్యాయి. రమ్య మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. సంఘటనా స్థలానికి గజపతినగరం, మానాపురం ఎస్‌ఐలు సన్యాసినాయుడు, రమేష్‌ చేరుకొని వివరాలు సేకరించారు. వోలం కంపెనీ వద్ద ఉన్న సీసీ కెమెరాల్లో ఉన్న సీసీ పుటేజీలను పరిశీలిస్తున్నారు. అయినా వాహనం వివరాలు తెలియరాలేదు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గజపతినగరం సీహెచ్‌సీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top