వీడియో గేములతోనూ గాలం! | Sakshi
Sakshi News home page

వీడియో గేములతోనూ గాలం!

Published Tue, Jul 14 2020 3:04 AM

CyberCrime: Hackers Focus Online Video Games - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: శతకోటి దరిద్రాలకు.. అనంతకోటి ఉపాయాలు అన్న సామెత సైబర్‌ నేరగాళ్ల విషయంలో సరిగ్గా సరిపోతుంది. టిక్‌టాక్‌ ప్రో, చాక్లెట్‌ బాక్సులు, ప్రేమపెళ్లి అంటూ రకరకాల కారణాలతో బ్యాంకు ఖాతాలు ఖాళీ చేసే సైబర్‌ నేరగాళ్లు మరో కొత్త ఎత్తుగడ ఎంచుకున్నారు. చిన్నారులు అమి తంగా ఇష్టపడే ఆన్‌లైన్‌ వీడియో గేముల్లోనూ తమ చాతుర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. 

ఉచితం పేరుతో మాల్‌వేర్‌ లింకులు..
సాధారణంగా పిల్లలు షూటింగ్‌ గేమ్‌లను ఇష్టపడతారు. అందులో రకరకాల స్టేజీలు ఉంటాయి. తరువాత స్టేజ్‌లోకి వెళ్లాలంటే.. నిర్దేశిత పాయింట్లు సాధించాలి లేదా ఆయుధాలు పొందాల్సి ఉంటుంది. ఒకవేళ సరైనన్ని పాయింట్లు, ఆయుధాలు లేకపోతే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ఆన్‌లైన్‌లో డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ లోసుగునే సైబర్‌ నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. అలా గేమ్‌లు ఆడే చిన్నారులకు సైబర్‌ నేరగాళ్లు మాల్‌వేర్‌ను ఉంచిన లింకులను పంపుతున్నారు. సదరు లింకులను క్లిక్‌ చేస్తే.. ఉచితంగా పాయింట్లు, ఆయుధాలు పొందవచ్చని ఎరవేస్తున్నారు. ఇవేమీ తెలియని చిన్నారులు, విద్యార్థులు వాటిని క్లిక్‌ చేసి గేమ్‌లో ముందుకు పోతున్నారు. 

కానీ, మొత్తం మొబైల్‌ను వారి చేతికి ఇచ్చేశాం అన్న విషయాన్ని గుర్తించలేకపోతున్నారు. ఆ తర్వాత స్మార్ట్‌ఫోన్‌లో జొరబడిన మాల్‌వేర్‌ పనిచేయడం మొదలుపెడుతుంది. బ్యాంకు ఖాతాల వివరాలతోపాటు, వ్యక్తిగత వివరాలు క్షణాల్లో సైబర్‌ నేరగాళ్ల చేతికి చేరుతాయి. వారు అంతేవేగంగా స్మార్ట్‌ఫోన్‌కు లింక్‌ అయి ఉన్న ఖాతాల్లోని మొత్తం నగదును మాయం చేస్తారు. ఈ సమయంలో నగదును కొట్టేసినట్లు మన మొబైళ్లకు ఎలాంటి సందేశాలు రావు. దీంతో ఈ విషయం తెలిసే సరికి పుణ్యకాలం కాస్తా గడిచిపోతుంది. అందుకే, వీడియోగేమ్‌లు ఆడుకునేందుకు పిల్లలకు స్మార్ట్‌ఫోన్లు ఇచ్చే తల్లిదండ్రులు ఈ విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. 
 

Advertisement
 
Advertisement
 
Advertisement