జేబులన్నీ ఖాళీ చేయ్‌..!

Cricket Bettings In Kamareddy - Sakshi

బెట్టింగ్‌ రాయుళ్లకు ఐపీఎల్‌ పండుగ

ఉమ్మడి జిల్లాలో జోరుగా క్రికెట్‌ బెట్టింగ్‌లు  

చిత్తవుతున్న యువత అప్పులపాలవుతున్నా వదలని తీరు

కరువైన పోలీసుల నిఘా

కామారెడ్డి క్రైం: ప్రపంచ క్రీడా పటంలో అత్యధిక ఆదరణ పొందింది క్రికెటే. ఇక ఐపీఎల్‌ వచ్చిందంటే క్రికెట్‌ ప్రేమికులకు పండు గే. అంతవరకైతే మంచిదే. అయితే నేటి కాలంలో ఆటమీదుండే మోజు రూటుమార్చుకుంది. ఆటను ఆస్వాదించడం పోయి బెట్టింగ్‌లు కాస్తున్నారు. ఒకరిని చూసి మరొకరు బెట్టింగ్‌లకు పాల్పడుతూ జేబులు గుల్ల చేసుకుంటున్నారు. క్రికెట్‌ బెట్టింగ్‌ మూలంగా ఎందరో యువత రూ.లక్షల్లో అప్పుల పాలవుతుండటం అనర్థాలకు దారితీస్తోంది. ఇలాంటి పరిస్థితులు కొన్నిసార్లు యువతను ఆత్మహత్యలవైపు పోతుండడం ఆందోళన కలిగిస్తున్న అంశం. ఉమ్మడి జిల్లాలో ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా క్రికెట్‌ బెట్టింగ్‌ జరుగుతున్నా పోలీసులు నిఘా పెట్టడంలేదనే ఆరోపణలు చోటుచేసుకుంటున్నాయి. 

ప్రధానంగా యువతపైనే ప్రభావం..  
బెట్టింగ్‌ ప్రభావం నూటికి 90 శాతం యువతపైనే పడుతోంది. ముక్కుపచ్చలారని వయసులో బెట్టింగ్‌వైపు ఆకర్శితులవుతున్నారు. వేసవి సెలవులు కావడంతో ఇంటర్, డిగ్రీ విద్యార్ధులు తమ ఇళ్ల వద్దే ఉంటూ స్నేహితులతో కలిసి సరదాగా గడపాలనుకుంటారు. ఇదే సమయంలో ఐపీఎల్‌ క్రికెట్‌ మ్యాచ్‌లు ఉండటంలో చాలా మంది కళాశాల స్ధాయి యువకులు సైతం బెట్టింగ్‌లో పాల్గొంటూ కష్టాల బారిన పడుతున్నారు. పొద్దంతా పనిచేసి కుటుంబాలను పోషించుకునే మధ్యతరగతి ప్రజలు, నిరుద్యోగులు క్రికెట్‌ బెట్టింగ్‌ల కారణంగా జేబులు గుల్ల చేసుకుంటున్నారు. కొన్ని కుటుంబాల్లో తలిదండ్రులు, పిల్లలకు మధ్య డబ్బుల విషయంలో విభేదాలకు క్రికెట్‌ బెట్టింగే పరోక్షంగా కారణమవుతోంది.

ప్రత్యేకంగా అడ్డాలు..
తమ కార్యకలాపాలను కొనసాగించేందుకు బెట్టిం గ్‌ నిర్వహించే వ్యక్తులు ప్రత్యేకంగా అడ్డాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇదివరకు హోటళ్లు, లాడ్జిల్లో నడిపేవారు. నిఘా ఉందనే కా రణంగా ఎక్కువగా ఖాళీ ప్రదేశాలను ఎంచుకుంటున్నారు. మరికొందరు శివా రు ప్రాంతాల్లోని ఖాళీగా ఉన్న ఇండ్లను ఎంచుకుంటున్నట్లు తెలుస్తోంది. కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లా కేంద్రాలతోపాటు బాన్సువాడ, ఎల్లారెడ్డి, బోధన్, ఆర్మూర్‌ వంటి పట్టణాలు, మండల కేంద్రాలే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా బెట్టింగ్‌ ఊపందుకుంది. సాయంత్రం మ్యాచ్‌ సమయమైందంటే చాలు నిర్వాహకులు చెప్పే అడ్డాకు బెట్టింగ్‌ రాయుళ్లంతా చేరుకుంటారు. రెండు జిల్లా కేంద్రాల్లో బెట్టింగ్‌ అడ్డాలు వందకుపైగా ఉన్నాయంటే నమ్మశక్యం కాదు. కామారెడ్డిలోని రైల్వేప్టేషన్, హైదరాబాద్‌ రోడ్, సిరిసిల్లా రోడ్, దేవునిపల్లి కల్లు దుకాణానికి, నిజామాబాద్‌లోని ప్రధాన కూడళ్లు, కొత్తగా రియల్‌ వెంచర్లు వెలుస్తున్న ప్రాంతాలు, శివారు ప్రాంతాలు, పోలీసులు సంచరించని ప్రాంతాల్లో బెట్టింగ్‌ ముఠాలు తమ కార్యకలాపాలను జోరుగా సాగిస్తున్నాయనే ఫిర్యాదులున్నాయి. కామారెడ్డిలోని ఒక్క దేవునిపల్లిలోనే రోజుకు రూ.లక్షల్లో బెట్టింగ్‌ జరుగుతుంది.

పోలీసుల చర్యలు శూన్యం..
ఎక్కడపడితే అక్కడ బెట్టింగ్‌ జరుగుతున్నా పోలీసుశాఖ చర్యలు మాత్రం కనిపించడం లేదు. అన్ని గ్రామాలు, పట్టణాల్లో బెట్టింగ్‌ సాగుతోంది. జిల్లాకేంద్రంలో గతేడాది బెట్టింగ్‌ నిర్వహిస్తున్న ఓ ముఠాను పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. వారిలో ఓ ప్రధాన నిందితుడిని కావాలనే కేసు నుంచి తప్పించారనే ఆరోపణలు వచ్చాయి. పాత నేరస్తులతో పాటు మరికొంతమంది బెట్టింగ్‌ నిర్వహణలో ఆరితేరిన వారు ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌ను టార్గెట్‌ చేసి జోరుగా వ్యాపారం చేస్తున్నారు. ఈ క్రికెట్‌ బెట్టింగ్‌పై కఠినంగా వ్యవహరించాలని పలువురు కోరుతున్నారు. బెట్టింగ్‌ నిర్వాహకులపై నిఘా వేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

రూ.లక్షల్లో బెట్టింగ్‌లు..
సరదాగా మొదలైన బెట్టింగ్‌ సంస్కృతి కాస్త చీకటి వ్యాపారంలా మారింది. నిర్వాహకులు అమాయక యువతను ఆకర్శిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఉదయం 10 గంటలకు బ్యాంకులు తెరుస్తారు డబ్బులు సర్దుకుని ప్రతిరోజూ ఉదయం 11 గంటల సమయంలో బెట్టింగ్‌లో పాల్గోనేవారంతా నిరాహకులు చెప్పిన చోటుకు చేరాల్సి ఉంటుంది. అంతకు ముందు రోజు రాత్రి జరిగిన మ్యాచ్‌ ఫలితానికి సంబంధించిన లావాదేవీలు, వసూళ్లు చేపడుతారు. ఆ వెంటనే తరువాతి మ్యాచ్‌పై పందాలు కాస్తారు. ఆ తరువాత వ్యవహారం మొత్తం ఫోన్‌లలోనే సాగిస్తారు. ఏ జట్టుపై ఎవరు ఎంత పందెం కాస్తున్నారనే విషయాలు నిర్వాహకులు చూస్తారు. ఇందుకోసం లావాదేవీలపై 10 శాతం ఫీజు తీసుకుంటారు. ఇరువైపుల నుంచి వాటాలు తీసుకుంటూ రూ.లక్షల్లో దండుకుంటారు. వారి వద్ద ఒక్కొక్కరు రోజుకు రూ. 500 నుంచి మొదలుకుని రూ.50 వేల వరకు పందాలు కాస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా ఒక్కో నిర్వాహకుడికి 50 నుంచి వంద మంది కస్టమర్లు ఉంటారు. బలహీనంగా ఉన్న జట్టు బలమైన జట్టుతో ఆడుతున్నపుడు బెట్టింగ్‌ విధానం మరొలా ఉంటుంది. ఒకటికి రెండింతలు, మూడింతల చొప్పున బేరాలు చేస్తారు. ఇలా వందల మంది యువత నిత్యం తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు పెడదారిన పడుతున్నారు. మ్యాచ్‌ జరిగే పమయంలో స్మార్ట్‌ఫోన్‌లలో క్రికెట్‌ పెట్టుకుని ఒకేచోట గుమిగూడి కనిపిస్తుంటారు. జిల్లాలో ఇదివరకు ఇలా బెట్టింగ్‌లో డబ్బులు కోల్పోయి అప్పులు కావడంతో కొందరు మువకులు ఆత్మహత్యల వరకు వెళ్లిన ఘటనలు చూశాం.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top