అత్యాచారం కేసులో బావ, బావమరిది అరెస్టు | Cousins Arrest In Rape Case In Guntur | Sakshi
Sakshi News home page

అత్యాచారం కేసులో బావ, బావమరిది అరెస్టు

Jul 4 2018 1:02 PM | Updated on Aug 24 2018 2:36 PM

Cousins Arrest In Rape Case In Guntur - Sakshi

గుంటూరు:  ఉచ్చులు వేసి పక్షుల వేట కొనసాగిస్తూ జీవితాన్ని కొనసాగిస్తున్న బావ, బావమరిదులు ఇద్దరూ ప్రేమికుల జంటను బెదిరించి యువతిని అత్యాచారం చేసి ఆపై పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు మంగళగిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రోజుల వ్యవధిలోనే నిందితులను గుర్తించి అరెస్టు చేసిన సిబ్బందిని అర్బన్‌ ఎస్పీ సి.హెచ్‌.విజయారావు అభినందించారు. ఈసందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. తాడేపల్లి మండలం పూలకంపాడు గ్రామానికి చెందిన అవివాహిత గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో స్టాఫ్‌నర్సుగా పనిచేస్తోంది. మేడికొండూరు మండలం మందపాడు కు చెందిన జోసఫ్‌తంబి అనే యువకుడితో పరిచయం ప్రేమకు దారితీసింది. ఈక్రమంలో గతనెల 29వ తేదీ రాత్రి విధులు ముగించుకున్న అవివాహిత జోసఫ్‌తంబితో ద్విచక్రవాహనంపై వెళుతూ ఏకాంతంగా గడిపేందుకు  ఆత్మకూరు డొంకరోడ్డులోకి వెళ్లారు.

ఆ సమయంలో ఆత్మకూరుకు చెందిన బావ, బావమరిదులు అయిన రాసగిరి రాఘవయ్య, ఇండ్ల శ్రీనివాస్‌ ముందు రోజు పొలాల్లో పెట్టిన ఉచ్చుల్లో ఏవైనా పక్షులు పడ్డాయా అని వెతుకుతూ అటువైపు వెళ్లారు. జోసఫ్‌తంబిని బెదిరించి  పంపించివేసి అవివాహితను మరికొంత దూరం తీసుకువెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె చెవి కమ్మలను తీసుకుని వదిలివేశారు. ఇంటికి చేరుకున్న బాధితురాలు జరిగిన విషయం గురించి తల్లిదండ్రులకు తెలిపి చికిత్స నిమిత్తం గుంటూరు జీజీహెచ్‌లో చేరింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు మంగళగిరి రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేయడంతోపాటు ఆమె ఇచ్చిన ఆనవాళ్ల ప్రకారం నిందితులను గుర్తించారు.  ఆత్మకూరు జంక్షన్‌ వద్ద మంగళవారం సాయంత్రం 3 గంటల సమయంలో  బావ, బావమరిదిని అదుపులోకి తీసుకుని విచారించగా, సామూహిక అత్యాచారానికి పాల్పడినట్టు అంగీకరించారని వివరించారు. నిందితులపై సస్పెక్టెడ్‌ షీట్‌లను కూడా ప్రారంభిస్తున్నామని తెలిపారు. సమావేశంలో నార్త్‌ డీఎస్పీ జి.రామకృష్ణ, సీఐలు ఎం.సుబ్బారావు, బి.హరికృష్ణ, ఎస్‌ఐ వినోద్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement