అద్దెకు వచ్చి అంతమొందించారు

Couple Assassinated House Owner Rohini in East Godavari - Sakshi

ధవళేశ్వరంలో మహిళ హత్య

దారుణానికి పాల్పడిన భార్యాభర్తలు

బంగారంతో పరారీ మతిస్థిమితం కోల్పోయిన మృతురాలి తల్లి

తూర్పుగోదావరి , ధవళేశ్వరం: గ్రామంలో తూరుబిల్లి రేఖా రోహిణి (పవిత్ర) (30) దారుణ హత్యకు గురైంది. ఆమె ఇంట్లో అద్దెకుంటున్న భార్యాభర్తలు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. తూరుబిల్లి రేఖారోహిణి ధవళేశ్వరం క్వారీరోడ్డులో తల్లి వెంకటలక్ష్మితో కలిసి నివాసం ఉంటుంది. శుక్రవారం మధ్యాహ్నం వెంకటలక్ష్మి చర్చికి వెళ్లడంతో రోహిణి మాత్రమే ఇంట్లో ఉంది. ఆ సమయంలో ఆమెను పక్క పోర్షన్‌లో అద్దెకుంటున్న భార్యాభర్తలు చెక్కా పవన్‌ కుమార్‌ యాదవ్, లక్ష్మి హత్య చేశారు. అనంతరం బంగారంతో పరారయ్యారు.(ఇన్‌స్టాలో ప్రేమ పేరుతో మైనర్‌కు వల )

16 రోజుల క్రితం అద్దెకు వచ్చి..
అనంతపురానికి చెందిన చెక్కా పవన్‌ కుమార్‌ యాదవ్, లక్ష్మి ఈ నెల పదో తేదీన రోహిణి ఇంట్లోకి అద్దెకు వచ్చారు. కేవలం రెండు బ్యాగులతో మాత్రమే ఇంట్లోకి దిగారు. టీవీ చూడడానికి తరచూ రోహిణి ఇంట్లోకి వెళుతూ ఉండేవారు. శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో రోహిణి ఇంట్లోకి వెళ్లి కూరగాయల చాకుతో ఆమెను హత్య చేశారు. ఆమె మెడలోని బంగారపు గొలుసు, ఉంగరం లాక్కు న్నారు. అంతలో ఇంటికి వచ్చిన వెంకటలక్ష్మి (రోహిణి తల్లి)పై చాకుతో దాడి చేసి ఆమె మెడలోని గొలుసు దోచుకున్నారు. వెంకటలక్ష్మి పెనుగులాడుతూ ఇంటి వెనుక గోడ దూకి పెద్దగా కేకలు వేసింది. పవన్‌ కుమార్‌ యాదవ్‌ దంపతులు అక్కడి నుంచి పరారయ్యారు. ఏఎస్పీ లతామాధురి, డీఎస్పీ వెంకటేశ్వర్లు, ధవళేశ్వరం సీఐ అడబాల శ్రీను తదితరులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. మృతదేహన్ని పోస్టుమార్టం కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కుమార్తె హత్యకు గురి కావడంతో మతిస్థిమితం కోల్పోయిన తల్లి వెంకటలక్ష్మిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలంలో డాగ్స్‌ స్క్వాడ్, క్లూస్‌ టీమ్‌తో వివరాలు సేకరించారు. మృతురాలి అమ్మమ్మ సింహాచలం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు.  (వీడియో: పైలట్‌ మొగుడి పైశాచికం!)

రోహిణి మృతదేహాన్ని పరిశీలిస్తున్న ఏఎస్పీ లతామాధురి
పోలీసుల అదుపులో నిందితులు?
పోలీసులు అరగంట వ్యవధిలోనే నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. హత్య చేసిన అనంతరం పవన్‌ కుమార్‌ యాదవ్, లక్ష్మి స్థానిక బ్యారేజ్‌ వద్ద స్నానం చేస్తుండగా ధవళేశ్వరం ఎస్సై గణేష్‌ చాకచక్యంగా వారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.   

పలు అనుమానాలు
హత్యకు పాల్పడిన భార్యాభర్తలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనంతపురానికి చెందిన వీరు ధవళేశ్వరం ఎందుకు వచ్చారన్న కోణంలో పోలీసులు  విచారిస్తున్నారు. బంగారం కోసమే అయితే దారుణంగా హత్య చేయాల్సిన అవసరం ఏముందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిందితులు గత రెండేళ్లలో రాష్ట్రంలో అనేక ప్రాంతాలతో పాటు హైదరాబాద్‌లో నివాసం ఉన్నట్లు సమాచారం.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top