మ్యాన్‌హోల్‌ మింగేసింది..

Contract Worker Missing In Underground Drainage Missing - Sakshi

డమ్మీ తీయడానికి వెళ్లిన ప్లంబర్‌ గల్లంతు

సింగ్‌నగర్‌ ఎక్సెల్‌ప్లాంట్‌ వద్ద ఘటన

గాలిస్తున్న అగ్నిమాపక, ఎన్డీఆర్‌ఎఫ్‌ దళం

మృతదేహం లభ్యం

బతుకుదెరువు చావు కోరుతోంది.. నిర్లక్ష్యం ప్రాణంతో ఆడుకుంటోంది.. డ్రెయినేజీ డేంజర్‌ అయింది.. పనులకు కోసం దిగితే మింగేస్తోంది.. ప్రతిసారి ఇదే తంతు.. నగరంలో మురుగుకాలువ పనులు ప్రమాదకంగా మారాయి.. అండర్‌గ్రౌండ్‌ డ్రెయినేజీలో దిగితే  అడ్రస్‌ గల్లంతు అన్నట్లుతయారైంది.. బతుకుపోరాటంలోకష్టమని తెలిసిన పనికి వెళ్లిన అభాగ్యుడు కనిపించడం లేదు.. ఈ ఘటన సింగ్‌నగర్‌ ఎక్సెల్‌ప్లాంట్‌ వద్ద
మంగళవారం  చోటుచేసుకుంది.

అజిత్‌సింగ్‌నగర్‌(విజయవాడ సెంట్రల్‌): అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ మ్యాన్‌హోల్‌ ఓ కార్మికుడు గల్లంతయ్యాడు. సింగ్‌నగర్‌ వడ్డెర కాలనీకి చెందిన గుంజా గంగరాజు(37) ఫ్లంబర్‌ లైసెన్స్‌తో డ్రెయినేజీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. సింగ్‌నగర్‌ పరిసర ప్రాంతాలలో యూజీడీ ఇంటర్‌ కనెక్షన్లు ఇస్తున్నారు. వాంబేకాలనీ వైపునకు వెళ్లే ప్రధాన లైన్‌లో మురుగు నిలిచిపోయింది. దీంతో ఎక్సెల్‌ప్లాంట్‌ వెంబడి ఉన్న మ్యాన్‌హోల్‌ వద్ద డమ్మీ తొలగించాల్సి వచ్చింది.

కష్టమైన పనికి ఒప్పుకుని..
కార్పొరేషన్‌ అధికారులు కాంట్రాక్టు కార్మికులను పిలిచి చూపగా అందులోకి దిగడానికి ఎవరూ సాహసం చేయలేదు. గంగరాజు తనతో పాటు మరో నలుగురు కార్మికులతో కలసి పనికి ఒప్పకున్నాడు. మధ్యాహ్నం మ్యాన్‌హోల్‌లో  దిగి డమ్మీ తీసేందుకు ప్రయత్నించాడు. డమ్మీ మూత ఎంతసేపటికి రాకపోవడంతో గంగరాజు మూతను గట్టిగా లాగిపట్టుకున్నాడు. డమ్మీ ఊడిపోవడంతో మురుగునీరు ఒక్కసారిగా ముందుకు నెట్టింది. దీంతో వాటిని తప్పించుకుని నిచ్చెన సాయంతో పైకి ఎక్కేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు కాలు జారిపడి,  ప్రవాహంలో  కొట్టుకుపోయినట్లు అతడితో పాటు వెళ్లిన కార్మికులు చెబుతున్నారు.

ముమ్మరంగా గాలింపు చర్యలు..
మ్యాన్‌హోల్‌లో పనులకు దిగిన   గంగరాజు ఆచూకీ కోసం అగ్నిమాపకశాఖ, పోలీసు, ఎన్డీఆర్‌ఎఫ్‌ బలగాలు తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టాయి. ప్రధానంగా ఎక్స్‌ల్‌ప్లాంట్‌ వద్ద చుట్టు పక్కల ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి సమయంలో కూడా గాలింపు చర్యలు కొనసాగించారు.

ఏడాది కిందట ఇలాగే..
గత ఏడాది మార్చి 14వ తేదీ భవానీపురం పోలీస్‌స్టేషన్‌ సమీపంలో ఇదే విధంగా ఇద్దరు కార్మికులు డ్రెయినేజీలో పడి మృత్యువాతపడ్డారు. మళ్లీ ఏడాదికి ఈ ఘటన జరగడంతో ప్లంబర్‌ కార్మికులు ఆందోళన చెందుతున్నారు.

మూడు వేలు వస్తాయని వెళ్లాడు..
ఇల్లు జరగడం కష్టంగా ఉంది.. ఈ పనికి వెళ్లొస్తే రూ.3 వేలు వస్తాయని చెప్పి వెళ్లిన నా భర్త ఇలా ఆపదలో చిక్కుకుంటాడని ఊహించలేదంటూ గంగరాజు భార్య భధ్రమ్మ రోదిస్తోంది. గంగరాజు దంపతులకు కుమారుడు, ఇద్దరు కుమార్తెలున్నారు. పిల్లలు ముగ్గురు స్థానిక వివేకానంద స్కూల్‌లో విద్యనభ్యసిస్తున్నారు. పెద్ద కూతురు దేవి 8వ తరగతి, కొడుకు జ్యోతిప్రసాద్‌ 6వ తరగతి, రెండో కూతురు మీనాక్షి 5వ తరగతి చదువుతున్నారు.

ప్రాణాలు పోతున్నా పట్టించుకోని ప్రభుత్వం
ప్లంబర్‌ కార్మికుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతుందని పలు పార్టీల నాయకులు ఆరోపించారు. నిబంధనల ప్రకారం డ్రెయినేజీ మ్యాన్‌హోల్స్‌లోకి కార్మికులను పంపకూడదని, కనీస భద్రత సౌకర్యాలు కూడా కల్పించకుండా ఇలా కార్మికుల జీవితాలను బలికొంటూ వారి కుటుంబాలను అంధకారంలోకి ప్రభుత్వమే నిర్లక్ష్యంతో నెట్టివేస్తోందని ఆరోపించారు.

మృతదేహం లభ్యం
మ్యాన్‌హోల్‌లో గల్లంతు అయిన గంగరాజు కోసం రాత్రి సమయంలో కూడా గాలింపు చర్యలు చేపట్టారు. డ్రెయినేజీ పెద్దదిగా ఉండడంతో ప్రాణాలతో ఉండి ఉండవచ్చునని ఆశతో చర్యలు చేపట్టారు. కాని చివరికి మృతదేహం లభ్య కావడంతో బంధువులు కన్నీరుమున్నీరు అయ్యారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top