ఇంజినీర్‌పై బురద పోసిన ఎమ్మెల్యే

Congress mla Nitesh Rane Arrested For Leading Mud Attack On Engineer - Sakshi

సాక్షి, ముంబై: మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వాధికారిని బీజేపీ ఎమ్మెల్యే ఆకాశ్‌ విజయ్‌వర్గీయా బ్యాటుతో కొట్టిన ఘటన జరిగి పక్షం రోజులైనా గడవక ముందే మహారాష్ట్రలోనూ దాదాపు అలాంటి ఘటనే గురువారం జరిగింది. గుంతలమయంగా మారిన హైవేపై మరమ్మత్తులు చేపట్టాలని వినతిపత్రాలు సమర్పించినా లాభంలేకపోవడంతో కోపంతో కాంగ్రెస్‌కు చెందిన నితేశ్‌ రాణే అనే ఎమ్మెల్యే ఓ ఇంజినీర్‌ను వంతెన కమ్మీకి కట్టేసి, ఆయనపై బక్కెట్లతో బురదపోశారు. నితేశ్‌  మహారాష్ట్ర మాజీ సీఎం నారాయణ్‌ రాణే కొడుకు. ముంబై–గోవా రహదారిపై, సింధుదుర్గ్‌ జిల్లాలోని కనకవ్లీ పరిసరాల్లో ఈ ఘటన గురువారం జరిగింది. ఇంజినీర్‌ ప్రకాశ్‌ ఖేడేకర్‌పై  ఎమ్మెల్యే నితేశ్, కనకవ్లీ పురపాలక మండలి అధ్యక్షుడు సమీర్‌ నలవాడేలు బకెట్లతో బురద పోశారు. ‘గుంతల్లోంచి వెళ్లే వాహనాల కారణంగా పాదచారులపై బురద పడుతోందని, ఈ రోజు మీ మీదా బురద పడనీయండి’ అని నితేశ్‌ వ్యాఖ్యానించారు. ఈ కేసులో పోలీసులు నితేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు.
 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top