ఇండోనేషియా టు..హైదరాబాద్‌ వయా దుబాయ్‌

Cigarettes Smuggling From Dubai - Sakshi

నగరానికి భారీగా విదేశీ సిగరెట్ల అక్రమ రవాణా

ఒకప్పుడు కంటైనర్లు.. ఆపై ఎయిర్‌కార్గోలో ఏటా రూ.వందల కోట్లఅక్రమ వ్యాపారం

మూడేళ్లల్లో 52.94 లక్షల సిగరెట్లు స్వాధీనం

సాక్షి, సిటీబ్యూరో: బంగారం, ఎలక్ట్రానిక్‌ వస్తువులు, మాదకద్రవ్యాలు మాత్రమే కాదు... సిగరెట్లు కూడా భారీ స్థాయిలోనే నగరానికి అక్రమంగా రవాణా అవుతున్నాయి.  నగరానికి చెందిన కొన్ని ముఠాలు వ్యవస్థీకృతంగా పని చేస్తూ ఈ దందా సాగిస్తున్నాయి. హైదరాబాద్‌ కస్టమ్స్‌ అధికారులు గత వారం ఏకంగా రూ.6.5 కోట్ల విలువైన సిగరెట్లను ధ్వంసం చేశారు. ఇవన్నీ విదేశాల నుంచి అక్రమంగా దిగుమతి చేసుకున్నవే.ఏటా రూ.వందల కోట్ల విలువైన సిగరెట్లను అక్రమంగా రవాణా చేసుకుంటూ ప్రభుత్వ ఖజానాకు భారీగా గండికొడుతున్నాయి. ఇటు కస్టమ్స్, అటు డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) అధికారులు వరుస దాడులు చేస్తూ ఈ అక్రమ రవాణా గుట్టురట్టు చేస్తున్నాయి. గడిచిన మూడేళ్లల్లో (2015–18 మధ్య ఆర్థిక సంవత్సరాల్లో) కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్న సిగరెట్ల సంఖ్య 52.94 లక్షలు కావడం గమనార్హం.

ఇండోనేషియా నుంచి దుబాయ్‌ మీదుగా
హైదరాబాద్‌ నగరానికి అక్రమ రవాణా అవుతున్న సిగరెట్లలో రెండు బ్రాండ్లే ఎక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. డజరమ్‌ బ్లాక్, గుడాన్‌ గరమ్‌ బ్రాండ్లకు చెందిన సిగరెట్లు వివిధ రూపాల్లో వస్తున్నాయని, కొన్ని సందర్భాల్లో బెల్సన్‌ అండ్‌ హెడ్జెస్‌ వంటివీ అక్రమ రవాణా అవుతున్నట్లు పేర్కొంటున్నారు. మొదటి రెండు రకాలు ఇండోనేషియాలో తయారవుతున్నాయి. అవి అక్కడి నుంచి దుబాయ్‌ మీదుగానే సిటీకి వస్తున్నాయి. అధికారుల కళ్లు గప్పేందుకు ఈ అక్రమ రవాణా సిగరెట్ల పేరుతో కాకుండా వివిధ వస్తువులంటూ జరుగుతోంది. ఈ ముఠాలు గతంలో సిగరెట్లను సముద్ర మార్గంలో కంటైనర్ల ద్వారా తీసుకువచ్చేవి. పిల్లలకు వినియోగించే డైపర్లుగా పేర్కొంటూ కంటైనర్‌ ముందు వరుస ల్లో వాటినే పెట్టి, వెనుక సిగరెట్లను నింపి తీసుకువచేవారు. మూసాపేటలోని ఇన్‌ల్యాండ్‌ కంటైనర్‌ డిపోకు (ఐసీడీ) ఇవి చేరుకున్నట్లు సమాచారం అందడంతో అధికారులు దాడి చేసి వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఆపై పంథా మార్చిన అదే గ్యాంగ్‌లు ఇంజినీరింగ్‌ వస్తువులు, కంప్యూటర్‌ స్పేర్‌ పార్ట్స్‌ పేరుతో విమాన మార్గంలో తీసుకువచ్చాయి. ఇప్పటికీ ఈ పంథా కొనసాగుతున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. 

ఒకటికి ఒకటిన్నర డ్యూటీ...
ఆరోగ్యానికి హానికరమైన, స్థానిక వ్యాపారులను నష్టాన్ని చేకూర్చే సిగరెట్ల దిగుమతిని ప్రభుత్వం ప్రోత్సహించట్లేదు. ఈ నేపథ్యంలోనే వీటిపై దిగుమతి సుంకం (కస్టమ్స్‌ డ్యూటీ) భారీగా విధిస్తోంది. 69 నుంచి 90 మిల్లీమీటర్ల పొడవుల్లో ఉండే సిగరెట్లలో ఒక్కో దానికి ఒక్కో రకమైన డ్యూటీ ఉంటుంది. మొత్తమ్మీద ఒకటికి ఒకటిన్నర శాతం పన్ను విధిస్తారు. అంటే... రూ.10 ఖరీదైన సిగరెట్‌ను దిగుమతి చేసుకుంటే దానిపై డ్యూటీనే రూ.15 ఉంటుంది. ఈ రకంగా దాని ఖరీదు రూ.25కు చేరుతుంది. ఈ డ్యూటీని ఎగ్గొట్టడానికే నగరానికి చెందిన ముఠాలు భారీగా అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లు డీఆర్‌ఐ దర్యాప్తులో తేలింది. సిటీలోని హోల్‌సేలర్లతో సంబంధాలు పెట్టుకున్న ఈ గ్యాంగ్‌ వారి ద్వారా మార్కెట్‌లోకి సరఫరా చేస్తున్నారు. సిగరెట్ల స్మగ్లింగ్‌లో ఒక్కోసారి ఒక్కో పంథాను అనుసరిస్తున్న ఈ ముఠా వ్యవహారాన్ని గుర్తించడానికి అధికారులకు కొంత సమయం పడుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రతిసారీ భారీగా సిగరెట్లు మార్కెట్‌లోకి వెళ్లిపోయిన తరవాతే గుర్తించగలుగుతున్నారు. 

అన్ని పత్రాలు సృష్టించేస్తున్నారు...
విదేశాల నుంచి దిగుమతి అయ్యే వస్తువులను ఇన్‌ల్యాండ్‌ కంటైనర్‌ డిపో, ఎయిర్‌ కార్గో కార్యాలయాల నుంచి తీసుకోవడానికి అనేక క్లియరెన్స్‌లు అవసరం. కస్టమ్స్‌ డ్యూటీ నుంచి వివిధ రకాలైన నిరభ్యంతర పత్రాలు దాఖలు చేస్తేనే గూడ్స్‌ బయటకు వస్తాయి. ఈ నేపథ్యంలోనే సిగరెట్ల అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముఠాలు కస్టమ్స్‌ తరఫున పని చేసే కస్టమ్స్‌ హోమ్‌ ఏజెంట్లు (సీహెచ్‌ఏ)లతో పాటు అనేక మందితో జట్టు కడుతున్నాయి. బోగస్‌ కంపెనీల పేర్లతో లెటర్‌ హెడ్స్‌ నుంచి కస్టమ్స్‌ క్లియరెన్స్‌ పత్రాల వరకు అన్నీ బోగస్‌వి సృష్టించేస్తున్నారు. వీటిని చూపిస్తూనే సరుకును బయటికి తీసుకువస్తూ భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. ఇలా ఏటా రూ.వందల కోట్ల అక్రమ వ్యాపారం సాగుతున్నట్లు అనుమానిస్తున్న అధికారులు ఆ కోణంపై దృష్టి పెట్టారు. ఈ రకంగా అక్రమ రవాణా ద్వారా నగరంలోకి వస్తున్న సిగరెట్ల కారణ ంగా ప్రజల ఆరోగ్యానికీ హానికరమన్నారు. ఇండోనేషియా సహా మరికొన్ని దేశాల్లో తయారవుతున్న ఈ సిగరెట్లలో ఏ తరహా పొగాకు వాడుతున్నారనేది స్పష్టంగా వెలుగులోకి రాలేదు. ఆ ప్యాక్‌ల మీద ‘హానికరం బొమ్మలు’ కూడా ఉండట్లేదు. అక్కడి పొగాకు ఇక్కడి పరిస్థితులకు ఎంత అనుకూలమో చెప్పలేమన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top