అద్దె ఇల్లే శాపమైంది!

Children Died By House Wall Collapse In Nizamabad - Sakshi

సాక్షి, నందిపేట్‌(నిజామాబాద్‌) : బతుకు దెరువు కోసం వచ్చిన ఆ కుటుంబంలో విధి విషాధం నింపింది. తమ పిల్లల భవిష్యత్‌ కోసం పొట్ట చేతపట్టుకుని వచ్చిన ఆ దంపతుల ఆనందాన్ని గోడ కూలి ఆవిరి చేసింది. కొత్తగా దిగిన అద్దె ఇంట్లో సామగ్రి సర్దుకోక ముందే చిన్న కూతరును గోడ రూపంలో మృత్యువు కబలించింది.  కొత్తగా అద్దె ఇంట్లో దిగిన గంటల వ్యవధిలోనే గోడకూలి చిన్నారి మృతి చెందిన ఘటన నందిపేట మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో మరో ఇద్దరు చిన్నారులు గాయపడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి.. ప్రకాశం జిల్లా లింగసముందర్‌ మండలం ఎర్రేటిపాలెం గ్రామానికి చెందిన రావూరి అంజయ్య తన కుటుంబ సభ్యులతో కలిసి ఉపాధి నిమిత్తం మేస్త్రీ పనిచేసేందుకు నందిపేట మండలానికి వచ్చాడు. శనివారం ఉదయం 8 గంటల ప్రాంతంలో మండల కేంద్రంలోని రామ్‌నగర్‌ దుబ్బ ప్రాంతంలో గల ఒక ఇంటిలో భార్యతో పాటు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడితో కలిసి అద్దెకు దిగాడు.

ఉదయం 8 గంటలకు వచ్చిన వారు సామన్లు సర్దుకున్నారు. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో భార్యభర్తలు అంజయ్య, చెంచమ్మ ఆరుబయట మెట్ల వద్ద కూర్చుని ఉండగా ముగ్గురు పిల్లలు ఆర్‌సీసీ బిల్డింగ్‌ను ఆనుకుని ఉన్న రేకులషెడ్డు వంట గదిలో ఆడుకుంటున్నారు. ఇటీవల కురిసిన వర్షానికి తడిసిన వంటగది రేకుల షెడ్డు గోడ ఒక్కసారిగా ముగ్గురి చిన్నారులపై కూలింది. తీవ్రంగా గాయపడిన వారి చిన్న కూతురు రేణుక(8) సంఘటన స్థలంలో మృతి చెందింది. అలాగే పెద్ద కుమార్తె శాంకుమారి(12), కొడుకు కొండయ్య(10) తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇంటిలో చేరిన మొదటి రోజే కూతురును పోగొట్టుకున్న తల్లిదండ్రుల రోదనలు, అక్కడ ఉన్న వారిని కంటతడి పెట్టించాయి. చిన్నారి తల్లి చెంచమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాఘవేందర్‌ తెలిపారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top