మీడియా ముందుకు జయరాం హత్య కేసు నిందితులు | Chigurupati Jayaram Murder Case Accused Produced Before Media | Sakshi
Sakshi News home page

బదులులేని ప్రశ్నలు.. పోలీసుల రుసరుసలు

Feb 5 2019 6:14 PM | Updated on Feb 5 2019 6:36 PM

Chigurupati Jayaram Murder Case Accused Produced Before Media - Sakshi

పోలీసుల దర్యాప్తు లోపభూయిష్టంగా జరిగిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

సాక్షి, నందిగామ: కోస్టల్‌ బ్యాంకు డైరెక్టర్, ఎన్నారై చిగురుపాటి జయరాం హత్య కేసులో ప్రధాన నిందితుడు రాకేష్‌రెడ్డి అని కృష్ణా జిల్లా పోలీసులు ధ్రువీకరించారు. డబ్బు కోసమే జయరాంను హింసించి చంపినట్టు  దర్యాప్తులో వెల్లడైంది. రాకేష్‌రెడ్డితో పాటు అతడికి సహకరించిన వాచ్‌మన్‌ శ్రీనివాస్‌ను మంగళవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఎస్పీ సర్వశ్రేష్ట త్రిపాఠి మాట్లాడుతూ... ప్రధాన నిందితుడు రాకేష్‌రెడ్డి నేరం అంగీకరించాడని తెలిపారు. జయరాం హత్య కేసులో శిఖా చౌదరి పాత్ర లేదని చెప్పారు. ఆమె వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు దొరకలేదన్నారు.  

నిందితుడి వాంగ్మూలానికే పోలీసులు పరిమితం అయ్యారు. ఇప్పటివరకు బయటకు వచ్చిన వివరాలనే పోలీసులు వెల్లడించారు. తాను అప్పుగా ఇచ్చిన డబ్బును రాబట్టుకునేందుకే జయరాంను రాకేష్‌రెడ్డి హత్య చేసినట్టు తెలిపారు. తనకు రావాల్సిన డబ్బు రాబట్టుకునేందుకు రీనా అమ్మాయి పేరుతో జయరాంను ఇంటికి పిలిపించుకుని హింసించడంతో ఆయన చనిపోయినట్టు వెల్లడించారు. రాకేష్‌రెడ్డితో శిఖా చౌదరికి ప్రస్తుతం ఎటువంటి సంబంధాలు లేవన్నారు. శిఖా చౌదరి, రాకేష్‌రెడ్డి కలిసి దుబాయ్‌ ఎందుకు వెళ్లారన్న దానిపై సమాధానం లేదు. సాంకేతిక ఆధారాలు సంపాదించలేదని చెప్పి తుస్‌మనిపించారు. కేసు ఇంకా ప్రాథమిక దశలోనే ఉందని దర్యాప్తు కొనసాగుతోందని ముక్తాయించారు. ఈ కేసును హైదరాబాద్‌ పోలీసులకు అప్పగిస్తారా అని ప్రశ్నించగా.. న్యాయ సలహా తీసుకున్న తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఎస్పీ జవాబిచ్చారు.


పోలీసుల దర్యాప్తు లోపభూయిష్టంగా జరిగిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సూత్రధారులను కాపాడటానికి పోలీసులపై పెద్ద ఎత్తున ఒత్తిడులు వచ్చినట్టు తెలుస్తోంది. శిఖా చౌదరిని కాపాడటానికి పోలీసులు ప్రయత్నించినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తమ దర్యాప్తులో శిఖా చౌదరి ఏం చెప్పిందనేది పోలీసులు వెల్లడించలేదు. ఆమె పేరు ఎత్తితేనే పోలీసు ఉన్నతాధికారులు మీడియాపై ఎదురు దాడి చేశారు. ఎప్పుడు ఏం చెప్పాలో తమకు తెలుసు అంటూ హుంకరించారు. హైదరాబాద్‌లో హత్య చేస్తే నందిగామ వరకు మృతదేహాన్ని ఎందుకు తీసుకొచ్చారన్న దానిపై స్పష్టత ఇవ్వలేదు. నిందితుడు చెప్పిన విషయాన్నే బయటపెట్టారు తప్పా, తామేమి విచారించారో వెల్లడించలేదు. తెలంగాణకు చెందిన ఇబ్రహీంపట్నం ఏసీపీ మల్లారెడ్డి, నల్లకుంట సీఐ శ్రీనివాస్‌లతో రాకేష్‌రెడ్డి మాట్లాడినట్టు గుర్తించామని.. వీరిద్దరిపై న్యాయసలహా తీసుకుని ముందుకు వెళతామని కృష్ణా జిల్లా పోలీసులు తెలిపారు. ఈరోజు జరిగిన మీడియా సమావేశం చూస్తే పోలీసులు ఈ కేసులో చాలా బాధ్యతరహితంగా వ్యహరించినట్టు కనబడుతోందన్న వాదనలు విన్పిస్తున్నాయి.

ఈ ప్రశ్నలకు బదులేది?
జయరాంను రాకేష్‌రెడ్డి ఒక్కడే ఎలా బంధించగలిగాడు?
జయరాంను నిర్బంధించినప్పుడు రాకేష్‌ పాటు ఎవరున్నారు?
శిఖా చౌదరి పాత్ర లేదనడానికి రుజువులు ఎందుకు చూపలేదు?
శిఖా చౌదరి, రాకేష్‌రెడ్డి మధ్య ఉన్న సంబంధం ఏంటి?
జయరాం విజయవాడ వెళ్లాలనుకున్నట్టు రాకేష్‌కు ఎలా తెలిసింది?
శిఖా చౌదరిపై జయరాం భార్య చేసిన ఆరోపణల మాటేంటి?
వందల కోట్ల వ్యాపారాలు చేసే జయరాం రూ. 4 కోట్ల అప్పు తీర్చలేకపోయారా?
పోస్టుమార్టం రిపోర్ట్‌లో ఏముంది?
జయరాం మృతదేహాన్ని హైదరాబాద్‌ నుంచి నందిగామకు రాకేష్‌ ఒక్కడే ఎలా తీసుకురాగలిగాడు?
మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు ఎస్పీ, డీఎస్పీ ఎందుకు జవాబివ్వలేదు?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement