బండారు తనయుడి బరితెగింపు   | Sakshi
Sakshi News home page

బండారు తనయుడి బరితెగింపు  

Published Mon, Dec 16 2019 8:13 AM

Car Of Former Minister Bandaru Satyanarayana Murthy Son Hits Motorist - Sakshi

సాక్షి, విశాఖపట్నం: విశాఖ బీచ్‌రోడ్డులో మాజీ మంత్రి బండారు సత్యనారాయణ కుమారుడు అప్పలనాయుడు తాగిన మత్తులో రెచ్చిపోయాడు. మితిమీరిన వేగంతో ఇష్టారాజ్యంగా కారు నడుపుతూ మెడికో విద్యార్థుల బైక్‌ని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న ఆంధ్రా మెడికల్‌ కళాశాల విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీ సులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... శనివారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఆంధ్ర మెడికల్‌ కళాశాల(ఏఎంసీ)లో మొదటి సంవత్సరం చదువుతున్న చంద్రకిరణ్‌ తన స్నేహితుడు గౌతమ్‌తో కలిసి బైక్‌పై బీచ్‌రోడ్డులో వెళ్తున్నారు.

గౌతమ్‌ బైక్‌ నడుపుతుండగా, వెనక చంద్రకిరణ్‌ కుర్చొన్నాడు. బీచ్‌రోడ్డులో ఓ ప్రైవేట్‌ హోటల్‌లో రాత్రి ఒంటి గంట సమయం వరకు మాజీ మంత్రి బండారు సత్యనారాయణ తనయుడు అప్పలనాయుడు తప్పతాగాడు. ఆ మత్తులోనే తన స్నేహితులిద్దరితో కలిసి కారులో బయలుదేరాడు. బీచ్‌రోడ్డులో మితిమీరిన వేగంతో వెళ్తూ చంద్రకిరణ్‌ బైక్‌ని ఢీకొట్టి.. సమీపంలోని అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద డివైడర్‌పైకి దూసుకుపోయాడు. దీంతో కారు ముందు భాగం ధ్వంసమైంది. బైక్‌ మీద నుంచి పడిపోయిన చంద్రకిరణ్‌ తలకు తీవ్ర గాయాలవడంతో స్థానికులు హుటాహుటిన కేజీహెచ్‌కి తరలించారు. తలకు బలమైన గాయంకాగా ముక్కు నుంచి తీవ్రంగా రక్తం కారుతుందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం కేజీహెచ్‌లో వైద్యం పొందుతున్నాడు.

నెంబరు ప్లేటు మార్చేందుకు యత్నం..  
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు వెళ్లి ప్రశ్నించగా అప్పలనాయుడు దురుసుగా సమాధానం చెప్పడంతో వారంతా కలిసి దేహశుద్ధి చేశారు. విషయం తెలుసుకుని పోలీసులు ఘటనా స్థలికి చేరుకునే సమయానికి అక్కడి నుంచి స్నేహితులతో కలిసి అప్పలనాయుడు పరారయ్యాడు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న అప్పలనాయుడి కోసం గాలిస్తున్నారు. మరోవైపు తన కారు నెంబర్‌ బోర్డుని తొలగించేందుకు అప్పలనాయుడు ప్రయతి్నంచాడని స్థానికులు తెలుపుతున్నారు. ప్రమాద సమయంలో ఆ కారుకి ఏపీ 31డీపీ 6666 నంబరు ప్లేటు ఉండగా దాన్ని తొలగించేశారు. దాని స్థానంలో ఏపీ 37 సీవీ 0780 నంబరు ప్లేటు అమర్చేందుకు యతి్నంచగా సాధ్యం కాకపోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే ఆదివారం పోలీసులు వాహనాన్ని తరలించే సమయానికి మళ్లీ ఏపీ 31డీపీ 6666 నంబరు ప్లేటు దర్శనమిచ్చింది. మరోవైపు కారు ముందుసీటులో బండరాయి కనిపించడంతోపాటు అస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు చంద్రకిరణ్‌ ఎవరితోనూ మాట్లాడకపోవడం... అతని స్నేహితుడు గౌతమ్‌ అనే యువకుడు అక్కడ లేకపోవడం మరిన్ని అనుమానాలకు తావిస్తోందని పోలీసులు అంటున్నారు. 

తప్పు చేస్తే చర్యలు తప్పవు 
తప్పు చేస్తే ఎలాంటి వారిపైనైనా చర్యలు తప్పవని ఎంపీ, ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధి వి.విజయసాయిరెడ్డి అన్నారు. బీచ్‌రోడ్డులో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. శనివారం అర్ధరాత్రి మాజీ మంత్రి బండారు సత్యానారాయణ కుమారుడు అప్పలనాయుడు తప్పతాగి చేసిన రోడ్డు ప్రమాద ఘటనపై ఆయన స్పందించారు. బీచ్‌రోడ్డులో అర్ధరాత్రి దాటిన తర్వాత మద్యం విక్రయాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు. గత టీడీపీ ప్రభుత్వంలో రేవ్‌ పారీ్టలు, డ్రగ్స్‌ విక్రయాలు ఎక్కువగా జరిగేవని... ప్రస్తుతం వాటన్నింటినీ పోలీసులు పూర్తిగా నిలిపివేసేలా చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు.  

దర్యాప్తు చేస్తున్నాం 
మాకు సమాచారం రావడంతో అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో ప్రమాదం జరిగిన ప్రాంతానికి వెళ్లాం. మేము వెళ్లే సరికే ప్రమాదానికి కారణమైన వారు పరారయ్యారు. వారిపై ఐపీసీ సెక్షన్‌ 337 ప్రకారం బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాం. దర్యాప్తులో భాగంగా నిందితుల కోసం గాలిస్తున్నాం.  
– కోరాడ రామారావు, త్రీ టౌన్‌ సీఐ

Advertisement

తప్పక చదవండి

Advertisement