మహిళ దారుణ హత్య | Sakshi
Sakshi News home page

మహిళ దారుణ హత్య

Published Fri, Apr 27 2018 11:57 AM

The brutal murder of woman - Sakshi

బషీరాబాద్‌(తాండూరు) : కట్టుకున్నవాడు కాలం చేయడంతో పదిహేనేళ్లుగా ఒంటరిగా నివసిస్తున్న ఓ ఒంటరి మహిళ దారుణ హత్యకు గురైంది. హత్యకు ఒక రోజు ముందు బంధువుల ఇంట్లో జరిగిన శుభకార్యానికి హాజరైన ఆమె.. అక్కా, చెళ్లెళ్లు బంధుమిత్రులతో సరదాగా గడిపారు. మర్నాడు సొంతూరికి రాగా.. అదే రోజు రాత్రి హత్యకు గురికావడం కలకలం రేపింది. ఈ ఘటన బషీరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని జీవన్గీ గ్రామంలో గురువారం చోటుచేసుకుంది.

బషీరాబాద్‌ మండలంలో సంచలనం సృస్టించిన ఈ హత్యకు సంబంధించి తాండూరు గ్రామీణ సీఐ సైదిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. జీవన్గీ గ్రామానికి చెందిన కుర్వ లక్ష్మీ(35)కి 2000 సంవత్సరంలో యాలాల మండలం కిష్టపూర్‌ గ్రామానికి చెందిన బీరప్పతో వివాహం జరిగింది. అయితే అన్నదమ్ముల గొడవలో 2004లో బీరప్ప హత్యకు గురయ్యాడు. దీంతో లక్ష్మీ కొడుకు మహేష్‌తో కలిసి పుట్టింటికి వచ్చింది.

జీవన్గీ గ్రామంలోని బర్కాల్‌ కాలనీలో ఓ చిన్న ఇంట్లో ఉంటూ కూలీ పని చేస్తూ జీవనం సాగిస్తుంది. కొడుకు మహేష్‌ స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. అయితే రెండు రోజుల కిందట కొడంగల్‌ మండలం రేగడి మైలారం గ్రామంలో జరిగిన బంధువుల శుభకార్యానికి కొడుకుతో కలిసి వెళ్లింది. బంధువులు, అక్కాచెల్లెళ్లతో సరదాగా గడిపింది. తిరిగి ఈ నెల 25న(బుధవారం)కొడుకును బంధువుల దగ్గర పెట్టి జీవన్గీకి ఒంటరిగా వచ్చింది.

అయితే తెల్లవారి చూసేసరికి లక్ష్మీ శవమై కనిపించింది. తల వెనుక భాగంలో గాయమై పడిఉంది. ఒంటిపైనున్న ఆభరణాలు, ఇంట్లో ఉన్న ఇనుప పెట్టె తీసి వస్తువులు, బట్టలు చిందరవందరగా పడి ఉన్నాయి.  

రంగంలోకి దిగిన క్లూస్‌టీం, డాగ్‌ స్క్వాడ్‌ 

హత్య విషయం తెలుసుకున్న బషీరాబాద్‌ ఎస్సై లక్ష్మయ్య తన సిబ్బందితో కలిసి హుటాహుటిన జీవన్గీ చేరుకున్నాడు. సమాచారం అందుకున్న తాండూరు డీఎస్పీ రామచంద్రుడు, గ్రామీణ సీఐ సైదిరెడ్డి సంఘటన స్థలానికి చేరుకున్నారు. హత్య మిస్టరీగా మారడంతో పోలీసులు వికారాబాద్‌ నుంచి క్లూస్‌టీం, డాగ్‌ స్క్వాడ్‌లను రప్పించారు. ఇంట్లో వస్తువులపై ఉన్న వేలిముద్రలను సేకరించారు. డాగ్‌ స్క్వాడ్‌ గ్రామంలోని హతురాలి ఇంటి ముందు, ఓ హోటల్లోకి వెళ్లింది. కానీ ఎలాంటి క్లూ ఇవ్వలేకపోయింది. 

హత్యపై అనుమానాలు.. 

భర్త మరణానంతరం ఒంటరిగా జీవిస్తున్న లక్ష్మీ హత్య అనేక అనుమానాలకు తావిస్తోంది. జీవన్గీ బర్కాల్‌లో నివసించే ఆమె.. అదే కాలనీలో నివసించే సేవ్యానాయక్‌ అనే వ్యక్తితో సన్నిహితంగా ఉంటోంది. చాలా కాలంగా వీరిద్దరూ సహజీవనం సాగిస్తున్నారు. అయితే ప్రియురాలు లక్ష్మీ ప్రవర్తన పట్ల అనుమానం పెంచుకున్న సేవ్యానాయక్‌ ఆమెను తరచూ కొట్టేవాడని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.

ఇదిలా ఉంటే లక్ష్మీ హత్య జరిగిన విషయాన్ని మొదట సేవ్యానాయక్‌ చూసి గ్రామస్తులకు తెలిపాడు. ప్రియుడు హత్య చేస్తే గ్రామస్తులకు ఎందుకు  సమాచారం ఇస్తాడన్న ప్రశ్నలు తలెత్తాయి. దీంతోపాటు మృతురాలి శరీరంపై ఉన్న ఆభరణాలు దొంగిలించబడ్డాయి. ఇది దోపిడీ దొంగల పనా లేక తెలిసిన వారెవరైనా చేసిన హత్యా.. అనే కోణంలోను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  

ప్రియుడే హంతకుడు? 

మృతురాలి తండ్రి బాలప్ప ఇచ్చిన ఫిర్యాదు మేరకు లక్ష్మీ ప్రియుడు సేవ్యానాయక్‌కు సీఐ సైదిరెడ్డి అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. ప్రియుడే హత్యచేసి ఉంటాడని పోలీసులు బలంగా అనుమానిస్తున్నారు.

ప్రియురాలిపై అనుమానంతో తరచూ ఆమెను హింసిస్తూ కొట్టేవాడని ఈ క్రమంలోనే బుధవారం రాత్రి గొడవ పడ్డారని, తోపులాటలో తలకు గాయమై చనిపోయి ఉండవచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఫిర్యాదులో సేవ్యానాయక్‌ భార్య తిప్పి భాయి పేరును కూడా చేర్చారు. ఒకట్రెండు రోజుల్లో కేసును ఛేదించి పూర్తి వివరాలు మీడియాకు వెల్లడిస్తామని సీఐ పైదిరెడ్డి  తెలిపారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement