విషాదం నింపిన విహారం | Brothers Died In The Project Adilabad | Sakshi
Sakshi News home page

విషాదం నింపిన విహారం

Oct 14 2018 7:43 AM | Updated on Oct 14 2018 7:43 AM

Brothers Died In The Project Adilabad - Sakshi

జాదవ్‌ అరుణ్, తరుణ్‌ మృతదేహాలు సంఘటన స్థలం వద్ద జనాలు

ఉట్నూర్‌రూరల్‌: సెలవులు కావడంతో కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా పిక్‌నిక్‌ వెళ్లారు. మత్తడి ప్రాజెక్టు వద్ద ఇద్దరు అన్నదమ్ములు ఎంతో ఎంజాయ్‌ చేశారు. ఇంటికి వెళ్లే సమయంలో ఫొటోలు దిగేందుకు ప్రాజెక్టులోకి దిగడంతో ప్రమాదవశాత్తు తమ్ముడు నీట మునిగాడు. కాపాడబోయిన అన్న కూడా నీటి మునిగి ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూర్‌ మండల కేంద్రంలో శనివారం జరిగిన ఈ హృదయ విదారక సంఘటన ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. ఇద్దరే సంతానం కావడంతో ఆ తల్లిదండ్రులకు కడుపుకోతను మిగిల్చింది. కుటుంబ సభ్యులు, ఎస్సై జగన్‌మోహన్‌ రెడ్డి తెలిపిన వివరాలివీ..

ఇంద్రవెల్లి మండలం హర్కాపూర్‌ గ్రామానికి చెం దిన జాదవ్‌ ప్రహ్లద్‌–బిజ్జుబాయిలకు అరుణ్‌(14), తరుణ్‌ (16) ఇద్దరు సంతానం. సెలవులు కావడంతో ఉట్నూర్‌లో ఉంటున్న పెద్దమ్మ కూతు రు శిల్ప ఇంటికి వచ్చారు. వారి పిల్లలతో కలిసి ఉట్నూర్‌ మండలం లక్కారం గ్రామపంచాయతీ పరిధిలోని మత్తడిగూడ చెరువు వద్దకు పిక్‌నిక్‌కు వచ్చారు. దినమంతా సరదాగా గడిపారు. అన్ని కార్యక్రమాలు ముగించుకున్నాక మధ్యాహ్నం ఇంటికి వెళ్దామనుకునే  సమయంలో కాసేపు నీళ్లతో ఆడుకుంటూ ఫొటోలు దిగుదామని ప్రాజెక్టులో దిగారు. లోతు తెలియక..ఈతరాక ఒక్కసారిగా అన్నదమ్ముళ్లలో అరుణ్‌ మునిగి పోతుండగా తమ్ముని కాపాడబోయి తరుణ్‌ కూడా నీట మునిగాడు.

కుటుంబ సభ్యులు అరుపులు.. కేకలు వేయడంతో మత్తడిగూడ గ్రామస్తులు అక్కడికి చేరుకునేలోపే ఇద్దరూ ప్రాణాలు వదిలారు. ప్రాజెక్టు లోతు ఉండటంతో మృతదేహాల కోసం గజ ఈతగాళ్లు దాదాపు గంటసేపు గాలించి బయటకు తీశారు. కాగా అరుణ్‌ మండల కేంద్రంలోని సన్‌షైన్‌ ప్రైవేటు పాఠశాలలో 8వ తరగతి చదువుతుండగా, తరుణ్‌ స్థానిక పూలాజీ కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈ హృదయ విదారక సంఘటన పలువురిని కలిచివేసింది. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్సైలు ఎల్‌వీ రమణ, జగన్‌మోహన్‌ రెడ్డి సంఘటన స్థలాన్ని సందర్శించారు. ఘటనపై కుటుంబ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉట్నూర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తండ్రి ప్రçహ్లద్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై జగన్‌మోహన్‌ తెలిపారు.

ప్రాజెక్టు వద్ద రక్షణ కరువు 
మండల కేంద్రంలోనే పేరుగాంచిన ఈ ప్రాజెక్టు వద్ద రక్షణ కరువైంది. దీంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రాజెక్టు అభివృద్ధిలో భాగంగా తవ్వకాలు జరపడంతో చెరువు లోతు తెలియక ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ప్రమాదకర ప్రాంతాల్లో కనీసం కం చెలు కూడా ఏర్పాటు చేయలేదు. దీంతో ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రమాదాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement