రాలిపోయిన క్రీడా కుసుమం

Boy Died In East Godavari - Sakshi

సాక్షి, తాళ్లరేవు (ముమ్మిడివరం): క్రీడా కుసుమం రాలిపోయింది. నాలుగు రోజులపాటు మృత్యువుతో పోరాడిన నాగబాబు కన్నుమూశాడు. ఉజ్వల భవిష్యత్తు కలిగిన యువకుడిని బాణసంచా పేలుడు పొట్టను పెట్టుకుంది. ఈ నెల 18న తాళ్లరేవు మండలం జి.వేమవరం గ్రామంలోని బాణసంచా తయారీ కేంద్రంలో సంభవించిన పేలుడు ఘటనలో పదిమందికి తీవ్ర గాయాలైన విషయం తెలిసిందే. ఈ పేలుడులో తీవ్రంగా గాయపడిన యర్రంనీడి నాగశివ లక్ష్మీనారాయణ(18) నాలుగు రోజులపాటు  నరకయాతన అనుభవించి మంగళవారం తనువు చాలించాడు. నాగబాబు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని జి.వేమవరం తీసుకువెళ్లారు. 

కన్నీటి వీడ్కోలు..
చేతికందివచ్చిన కొడుకు అర్ధాంతరంగా చనిపోవడంతో తల్లి అనంతలక్ష్మి, సోదరుడు పవన్‌ కృష్ణమూర్తిలు బోరున విలపించడం గ్రామస్తులను తీవ్రంగా కలచివేసింది. నాగబాబుతో కలసి చదువుకున్న స్నేహితులు, చదువు చెప్పిన ఉపాధ్యాయులు సైతం నాగబాబు మృతదేహం వద్ద బోరున విలపించారు. పేలుడు ఘటనలో గాయపడి కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న తండ్రి సత్యనారాయణకు కుమారుడి మరణవార్త తెలియనివ్వలేదు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, గ్రామస్తులు విషణ్ణవదనాలతో నాగబాబుకు కన్నీటి వీడ్కోలు పలికారు. 

వాలీబాల్, సాఫ్ట్‌బాల్, త్రోబాల్‌ క్రీడల్లో విశేష ప్రతిభ 
నాగబాబు చిన్నతనం నుంచి చదువుతో పాటు ఆటలకు అధిక ప్రాధాన్యం ఇచ్చేవాడు. ఆరో తరగతి నుంచి క్రీడల్లో సత్తా చాటుతున్నాడు. అండర్‌–14, అండర్‌–19 విభాగాల్లో త్రోబాల్, సాఫ్ట్‌బాల్, వాలీబాల్‌ క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరచి జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. కురుక్షేత్రలో జరిగిన త్రోబాల్‌ చాంపియన్‌షిప్, హర్యానాలో జరిగిన వాలీబాల్‌ అండర్‌ 14 ఎస్‌జీఎఫ్‌ఐ క్రీడల్లో ప్రతిభ కనబరిచాడు. రెండుసార్లు వాలీబాల్, నాలుగుసార్లు సాఫ్ట్‌బాల్‌ జాతీయస్థాయి క్రీడల్లో పాల్గొని పతకాలు సాధించినట్టు జి.వేమవరం హైసూ్కల్‌ పీడీ స్వామి తెలిపారు. నాగబాబు ఐడియల్‌ కళాశాలలో ఇంటర్‌ ప్రథమ సంవత్సరం చదువుతూ ఈ నెల 15, 16, 17 తేదీల్లో పశ్చిమగోదావరి జిల్లా ఆచంటలో జరిగిన వైఎస్సార్‌ ఎస్‌జీఎఫ్‌ క్రీడల్లో పాల్గొన్నాడు. క్రీడల నుంచి 17వతేదీన తిరిగి స్వగ్రామానికి వచ్చాడు. అయితే 18వ తేదీన తండ్రితోపాటు బాణసంచా తయారీకి వెళ్లి పేలుడు ఘటనలో బలయ్యాడు.

రూ.10 లక్షల నష్ట పరిహారం 
జి.వేమవరం బాణసంచా పేలుడు ఘటనలో ప్రాణాలు కోల్పోయిన యర్రంనీడి నాగశివ లక్ష్మీనారాయణకు రూ.10 లక్షల నష్ట పరిహారాన్ని ప్రకటించినట్టు ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్‌కుమార్‌ పేర్కొన్నారు. బాణసంచా బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. ఈ ఘటనలో మంచి క్రీడాకారున్ని కల్పోవడం బాధాకరమన్నారు. 

బంగారంలాంటి క్రీడాకారున్ని కోల్పోయాం
మంచి క్రమశిక్షణ, నైపుణ్యం కలిగిన క్రీడాకారున్ని కోల్పోయాం. సాధారణంగా క్రీడాకారులు ఏదో ఒక్క క్రీడలో రాణించడం జరుగుతుంటుంది. అయితే నాగబాబు అనేక క్రీడలలో రాణించడంతోపాటు అతిచిన్న వయస్సులోనే జాతీయస్థాయి పోటీలలో పాల్గొన్నాడు. అథ్లెటిక్స్‌లో సైతం 185 సెంమీ హైజంప్‌ను నాగబాబు అవలీలగా చేసేవాడు. ఇటువంటి క్రీడాకారున్ని కోల్పోవడం దురదృష్టకరం. 
ఎస్‌ఆర్‌కేయూ స్వామి, ఫిజికల్‌ డైరెక్టర్, జెడ్పీ హైసూ్కల్, జి.వేమవరం  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top