దొంగల ముఠా అరెస్ట్‌

Bike Robbery Gang Arrest in PSR Nellore - Sakshi

నాలుగు బైక్‌లు, రెండు సెల్‌ఫోన్ల స్వాధీనం

వివరాలు వెల్లడించిన నెల్లూరు నగర డీఎస్పీ

నెల్లూరు(క్రైమ్‌): వారు జల్సాలు, విలాసవంతమైన జీవనానికి అలవాటుపడ్డారు. దీంతో దొంగలుగా అవతారమెత్తారు. రోడ్లపై ఒంటరిగా వెళ్లే వారిని బెదిరించి నగదు, సెల్‌ఫోన్లు దోచుకోవడం, మారుతాళాలతో ద్విచక్ర వాహనాలను అపహరించడం ప్రారంభించారు. గతంలో పలుమార్లు పోలీసులకు చిక్కి జైలుపాలైనా వారిలో మార్పురాలేదు. తిరిగి దొంగతనాలు చేస్తుండగా శుక్రవారం నెల్లూరులోని నవాబుపేట పోలీసులు నిందితులను అరెస్ట్‌ చేశారు. స్థానిక పోలీసుస్టేషన్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో నగర డీఎస్పీ జె.శ్రీనివాసులురెడ్డి నిందితుల వివరాలను వెల్లడించారు. నగరంలోని శెట్టిగుంటరోడ్డు జయప్రకాష్‌వీధికి చెందిన సీహెచ్‌ డింపు అలియాస్‌ రాహుల్, నవాబుపేట చాకలివీధికి చెందిన వి.దిలీప్, కిసాన్‌నగర్‌ పార్క్‌ సెంటర్‌కు చెందిన టి.దేవసునీల్, విజయనగరం జిల్లా సీతానగరం మండలం బొబ్బిలి గ్రామానికి (ప్రస్తుతం నాలుగోమైలు) చెందిన ఎం.సురేష్‌లు, మరో ఇద్దరు మైనర్లు జల్సాలకు అలవాటుపడ్డారు. 

మారుతాళాలతో ద్విచక్రవాహనాలను దొంగలించి వాటిపై సంచరిస్తూ ఒంటరిగా వెళ్లేవారిని బెదిరించి నగదు, సెల్‌ఫోన్లు దోచుకోసాగారు. ఈ ఏడాది నిందితులు చిన్నబజారు, బాలాజీనగర్, నెల్లూరు రూరల్‌ పోలీసుస్టేషన్ల పరిధిలో నాలుగు ద్విచక్రవాహనాలు, నవాబుపేట పరిధిలో రెండు సెల్‌ఫోన్లను దొంగలించి వాటిని అమ్మి సొమ్ము చేసుకున్నారు. వరుస దొంగతనాలపై నవాబుపేట ఇన్‌స్పెక్టర్‌ కె.వేమారెడ్డి ఆధ్వర్యంలో ఎస్సైలు రమేష్‌బాబు, మరిడినాయుడు, ఏఎస్సై రాజేశ్వరరావు, హెడ్‌ కానిస్టేబుల్‌ తురకా శ్రీనివాసులు, కానిస్టేబుల్స్‌ మోహన్, జితేంద్రలు బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో శుక్రవారం నిందితులు ప్రశాంతినగర్‌ హైవే వద్ద ఉన్నారనే పక్కా సమాచారం పోలీసులకు అందింది. దీంతో వారు వెళ్లి నలుగురు నిందితులతోపాటు ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకుని పోలీసుస్టేషన్‌కు తరలించారు. అనంతరం వారిని విచారించగా ద్విచక్ర వాహనాలు, సెల్‌ఫోన్లు అపహరించినట్లు నేరం అంగీకరించడంతో అరెస్ట్‌ చేశారు. నిందితుల నుంచి రూ.2.10 లక్షలు విలువచేసే నాలుగు ద్విచక్ర వాహనాలు, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్‌ చేసి చోరీ సొత్తు రాబట్టేందుకు కృషి చేసిన ఎస్సైలు, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. ఎస్పీ చేతుల మీదుగా రివార్డులు అందించనున్నట్లు ఆయన వెల్లడించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top