బెట్టింగ్‌ గుట్టు రట్టు

Betting Gang Arrest in PSR Nellore - Sakshi

ముగ్గురిని అరెస్ట్‌ చేసిన పోలీసులు

మరో నిందితుడు పరారీ

రూ.1.50 లక్షల సొత్తు స్వాధీనం  

నెల్లూరు(క్రైమ్‌): ఓ ఫైనాన్షియర్‌ కొంతకాలంగా క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్నాడు. అతని కదలికలపై నిఘా ఉంచిన వేదాయపాళెం పోలీసులు బెట్టింగ్‌ స్థావరంపై దాడిచేసి బుకీతోపాటు మరో ఇద్దరిని అరెస్ట్‌ చేశారు. గురువారం సాయంత్రం వేదాయపాళెం పోలీసు స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో స్థానిక ఇన్‌స్పెక్టర్‌ కె.నరసింహారావు నిందితుల వివరాలను వెల్లడించారు. చంద్రమౌళినగర్‌కు చెందిన బి.సురేంద్ర ఫైనాన్స్‌ వ్యాపారి. అతను తన స్నేహితులైన భక్తవత్సనగర్‌లో నివాసం ఉంటున్న కారు డ్రైవర్‌ పి.శ్రీకాంత్, చంద్రమౌళినగర్‌లో ఉంటున్న కిరాణా వ్యాపారి రాజేష్, వేదాయపాళెంకు చెందిన కిరణ్‌లతో కలిసి కొంతకాలంగా క్రికెట్‌ బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నాడు.

వేదాయపాళెంలోని ఓ ఫ్యాన్సీ షాపు మిద్దెపైన గదిలో ఈ వ్యవహారం గుట్టుచప్పుడు కాకుండా సాగిస్తున్నారు. వీరు మొబైల్‌ ఫోన్‌లో ప్లే 365 యాప్‌ను వినియోగించి బెట్టింగ్‌ నిర్వహిస్తున్నారు. ఈ విషయంపై సమాచారం తెలియడంతో వేదాయపాళెం పోలీసులు కొంతకాలంగా నిఘా ఉంచారు. గురువారం న్యూజిలాండ్‌ – ఇండియా వన్డే మ్యాచ్‌కు బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారనే సమాచారం పోలీసులకు అందింది. దీంతో ఇ¯Œన్‌స్పెక్టర్‌ కె.నరసింహారావు తన సిబ్బందితో కలిసి కేంద్రంపై దాడిచేశారు. పోలీసుల రాకను గమనించిన కిరణ్‌ అక్కడినుంచి పరారవగా సురేంద్ర, శ్రీకాంత్, రాజేష్‌లను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.1.50 లక్షలు నగదు, మూడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకుని పోలీసు స్టేషన్‌కు తరలించారు. అనంతరం పోలీసులు నిందితులను తమదైన శైలిలో విచారించగా బెట్టింగ్‌ నిర్వహిస్తున్నట్లు వెల్లడించడంతో నిందితులను అరెస్ట్‌ చేశారు. పరారీలో ఉన్న కిరణ్‌ కోసం గాలిస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు.   

సమాచారం అందించండి
బెట్టింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఇన్‌స్పెక్టర్‌ కె.నరసింహారావు వెల్లడించారు. ప్రజలు తమ ప్రాంతాల్లో బెట్టింగ్‌ కార్యకలాపాలు సాగుతున్నట్లు గుర్తిస్తే వెంటనే డయల్‌ 100 లేదా పోలీసులకు సమాచారం అందిస్తే తగిన చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో ఎస్సైలు సీహెచ్‌ కొండయ్య, మస్తానయ్య, క్రైమ్‌ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top