‘బెల్టు’ అండగా.. గల్లా నిండగా

Belt Shops Increasing In Adilabad District - Sakshi

సరిహద్దులో ‘బెల్టు’ దందా..

వైన్స్‌ల నుంచి నేరుగా బెల్టు దుకాణాలకే

అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులున్నా.. అడ్డుకట్ట పడని వైనం

సాక్షి, ఆసిఫాబాద్‌ : సరిహద్దు మండలాల్లో మద్యం దుకాణాలు దక్కించుకున్న వ్యాపారులకు బెల్టు షాప్‌లు అండగా నిలుస్తున్నాయి. బెల్టు షాప్‌ల మాటున అధిక ధరలకు మద్యం విక్రయాలు చేపడుతూ వ్యాపారులు దండుకుంటున్నారు. దీనికి తోడు పొ రుగు రాష్ట్రానికి మద్యం అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. ధనార్జనే ధ్యేయంగా మద్యం దుకాణదారులు బెల్టు షాపులతో ఒప్పందం చేసుకుని దందాను సాగిస్తున్నారు. ముఖ్యంగా జిల్లాకు సరిహద్దుగా ఉన్న మహారాష్ట్ర గ్రామాలకు విచ్చలవిడిగా మద్యం అక్రమ రవాణా సాగుతోంది. సరిహద్దు జిల్లా అయిన చంద్రాపూర్, గడ్చిరోలిలో సంపూర్ణ మద్యపాన నిషేధం అమలులో ఉండడంతో మహారాష్ట్రకు ఆనుకుని ఉన్న వైన్స్‌లకు కాసుల వర్షం కురిపిస్తోంది. 

సరిహద్దుల్లో నిత్యం దందా..
మహారాష్ట్రలోని చంద్రాపూర్, గడ్చిరోల్లి జిల్లాలో ప్రస్తుతం సంపూర్ణ మద్యపాన నిషేధం అమలులో ఉంది. దీంతో బార్డర్‌లో వైన్సులను దక్కించుకునేందుకు వ్యాపారులు కొత్త దుకాణాల లైసెన్సు పొందే సమయంలో పోటాపోటీగా టెండర్లు వేశారు. ఈక్రమంలో వాంకిడి, సిర్పూర్‌(టి), కౌటాల, రవీంద్రనగర్, బెజ్జూరు వైన్సులకు ‘మహా’క్రేజీ ఏర్పడింది. అయితే కొంత మంది టెండర్లలో లక్షల రూపాయలు పోగొట్టుకుని మద్యం షాపులు దక్కని వారు లక్కీ లాటరీలో షాపు దక్కించుకున్న వారికి గుడ్‌విల్‌ కింద లక్షల రూపాయలు ముట్టజెప్పి తిరిగి మద్యం వ్యాపారంలో కొనసాగుతున్నారు. ఇక కొందరు పెట్టుబడి భరిస్తామని వాటాలు మార్చుకుని దందా సాగిస్తున్నారు. ఈ దందా మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న వైన్సుల్లో అధికంగా జరిగుతోంది. వాంకిడిలో ఇదే తరహాలో లక్కీడీప్‌లో పొందిన వ్యక్తికి పెద్ద మొత్తంలో గుడ్‌ విల్‌ ఇచ్చి ఓ షాపును సొంతం చేసుకుని అడ్డగోలుగా మద్యాన్ని బెల్టుషాపులకు తరలిస్తూ ఆక్రమ సంపాదనకు తెరలేపారు.

వైన్స్‌లను తలపిస్తున్న వైనం..
సరిహద్దుల్లో ఉన్న వైన్సుల నుంచి యథేచ్ఛగా నిత్యం మద్యం సరఫరా సాగుతూనే ఉంది. ఇందుకు గ్రామీణ ప్రాంతాల్లో కిరాణా దుకాణాలు, బెల్టుషాపుల కేంద్రంగానే దందా సాగుతోంది. వాంకిడిలో ఉన్న ఓ వైన్‌ షాపు నేరుగా బెల్టుషాపులను గంప గుత్తగా అడ్వాన్సుగా మద్యం సరఫరా చేస్తూ అక్రమంగా నిల్వలు చేస్తూ సరఫరా చేస్తున్నారు. ఏకచత్రాధిపత్యంగా వాంకిడి మండలం గోయగాంలో ఓ బెల్టుషాపునకు నేరుగా డంప్‌ చేస్తూ మహా రాష్ట్రకు తరలిస్తున్నారు. వాస్తవానికి మద్యం స్టాక్‌ ఊట్నూర్‌ డిపో నుంచి ఎక్సైజ్‌ అధికారులు సూచించిన గోదాంల్లో నిల్వ ఉంచుకుని అవసర మేర సరఫరా చేస్తూ వైన్సుల్లో విక్రయించాలి. అలా కాకుండా నేరుగా సరిహద్దు గ్రామాల్లో బెల్టుషాపులుకే, అక్కడి నుంచి పొరుగు రాష్ట్రానికి తరలిస్తూ దండుకుంటున్నారు. 

ఎమ్మార్పీకి కంటే డబుల్‌..
పక్క రాష్ట్రంలో నిషేధం అమలులో ఉండడంతో ఇక్కడితో పోల్చితే రెట్టింపు ధరలతో విక్రయాలు సాగిస్తున్నారు. సాధారణంగా వైన్సుల్లో కౌంటర్‌ విక్రయాలు కంటే బెల్టుషాపులకే నిత్యం పెద్ద మొత్తంలో సరకు రవాణా అవుతుంది. ఈ బలహీనతతో మహారాష్ట్ర నుంచి వచ్చే బెల్టుషాపు నిర్వహకులకు ఎమ్మార్పీ కంటే అధికంగా విక్రయాలు చేస్తున్నారు. చీప్‌ లిక్కర్‌ క్వాటర్‌ సీసా రూ.65 ఉంటే మహారాష్ట్ర బెల్టు షాపుల్లో రూ.150 వరకూ విక్రయిస్తున్నారు. ఓసీ క్వాటర్‌కు ఎమ్మార్పీ రూ.120 ఉంటే స్థానిక బెల్టుషాపుల్లో రూ.150 వరకూ ఉంటే మహారాష్ట్రలో రూ.300 వరకూ అమ్ముతున్నారు. ఇలా ఒక్కో బ్రాండ్‌కు ఒక్కొ తీరుగా రేటు ఫిక్స్‌ చేసి అమ్ముతున్నారు. అయితే కొంత మంది మరో అడుగు ముందుకేసి సరిహద్దులో అక్రమంగా మద్యం నిల్వ చేసి రూ.20 నుంచి రూ.30 వరకూ అధికంగా ధరలు నిర్ణయించి అమ్ముతున్నారు. 

వైన్సుల నుంచే..
బెల్టు దుకాణదారులను వైన్సు షాపుల వరకూ రానివ్వకుండా వైన్సుల నుంచి వారి చెంతకు సరఫరా చేస్తున్నారు. మహారాష్ట్ర నుంచి లకడికోట్, రాజురా చుట్టు పక్కల గ్రామాల నుంచి వచ్చే మద్యం ప్రియులను ఆకర్షిస్తున్నారు. దీంతో సరిహద్దుల్లో ఉన్న గోయగాం లాంటి బెల్టుషాపుల్లోనే అధికంగా కొనుగోళ్లు చేస్తున్నారు. ఇక సిర్పూర్‌(టి)సరిహద్దులో ఉన్న పొడ్సా, వెంకట్రావుపేట్, కౌటాల, బెజ్జూరు, చింతలమానెపల్లి మండలం గూడెం గుండా నిత్యం మద్యం తరలిపోతోంది. మహారాష్ట్రలోని ఐరి, ఆల్లపల్లి తదితర ప్రాంతాలకు ప్రాణహిత నదిని దాటించి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఈ అక్రమ దందా నిలవరించేందుకు వాంకిడిలో ఎక్సైజ్‌ చెక్‌పోస్టు ఉన్నప్పటికీ అటు పోలీసులు, ఇటు అబ్కారీ శాఖ నిలువరించలేకపోతున్నారనేది బహిరంగ సత్యం.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top