వసూల్‌ రాజా.!

Balanagar SHO Corruption Special Story - Sakshi

బాలానగర్‌ డీసీపీ పరిధిలో ఎస్‌హెచ్‌ఓ అవినీతి బాగోతం

ఇంటి నిర్మాణం కోసం అక్రమ వసూళ్లు

కుత్బుల్లాపూర్‌: ఫ్రెండ్లీ పోలీసింగ్‌ పేరుతో ప్రచారం చేసుకుంటూ బాధితుడు నేరు గా స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేస్తే తప్పకుండా న్యాయం చేస్తామని హామీలిస్తూ ప్రజలకు దగ్గరయ్యేందుకు ఓ వైపు సైబరాబాద్‌ పోలీసులు కసరత్తు చేస్తుండగా మరో వైపు కొందరు అవినీతి పోలీసు అధికారులు చేతులు తడపనిదే పని కాదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే బాలానగర్‌ పరిధిలో పని చేసిన ఇద్దరు అధికారులు అవినీతి ఆరోపణలపై బదిలీపై వెళ్లగా, కొత్తగా వచ్చిన మూడో అధికారి కూడా లంచాలకు ఒత్తిడి చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది. ఓ హెడ్‌ కానిస్టేబుల్‌ ఫోన్‌లో బెదిరిస్తూ సీఐ రమ్మన్నాడని హుకుం చేస్తే.. తీరా స్టేషన్‌కు వెళ్లి తామేమీ కేసుల్లో లేమని వివరణ ఇచ్చుకునే అవకాశం ఇవ్వకుండా మీ జాతకాలు నా దగ్గర ఉన్నాయి.. మీ సంగతి చూస్తా.. రేపు రండి అంటూ ఆదేశాలు. ఇంతలో సదరు సీఐకి  వత్తాసు పలికే ఓ నేతవారి వద్దకు వెళ్లి ఎంతో కొంత ఇచ్చి సెటిల్‌ చేసుకోండి లేకుంటే కేసులు తప్పవంటూ మధ్యవరి ్తత్వం చేస్తూఅందిన కాడికి  దోచుకుంటున్నా డు. బాలానగర్‌ డీసీపీ పరిదిలోని ఓ పోలీస్‌స్టేషన్‌ ఎస్‌హెచ్‌ఓ దీపం ఉండగానే‘ఇళ్లు’ చక్కదిద్దుకుంటూ తాను నిర్మిస్తున్న భవనానికి పక్కా ఏర్పాట్లు చేసుకుంటున్నాడు.

నెల రోజులుగా స్థానికులకు చుక్కలు  
కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గ పరిధిలో అత్యధిక శాతం నిర్మాణాలు ప్రభుత్వ స్థలాల్లో నిర్మించినవే ఉన్నాయి. వీటికి ప్రభుత్వం పట్టాలు జారీ చేయగా మిగిలిన స్థలాలను పలువురు కబ్జా చేశారు. ఇటీవల తహసీల్దార్‌గా బాధ్యతలు చేపట్టిన గౌతమ్‌కుమార్‌ వారికి అడ్డుకట్ట వేశారు. పలువురిపై ఇటీవల కేసులు నమోదు చేయగా వీటిని ఆసరాగా చేసుకుని సదరు ఎస్‌హెచ్‌ఓ నెల రోజులుగా ఆయా ప్రాంతాల్లో కబ్జాదారులుగా ముద్ర పడిన వారిని స్టేషన్‌కు పిలిపించి తనదైన శైలిలో క్లాస్‌లు తీసుకుంటూ అందినకాడికి దండుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.సదరు అధికారి బాలాపూర్‌లో కొత్తగా నిర్మిస్తున్న భవనానికి కుత్బుల్లాపూర్‌ నుంచే ఇసుక, కంకర, సిమెంట్, స్టీల్‌ తరలిస్తుండటం గమనార్హం. స్టేషన్‌కు వెళ్లిన వారంతా ఏదో ఒకటి సమర్పించుకుని తిరిగి వెళ్లాల్సి వస్తోంది.  

హెడ్‌కానిస్టేబుల్‌ నుంచి ఫోన్లు..
మధ్యాహ్న సమయంలో స్టేషన్‌లో పనిచేసే హెడ్‌ కానిస్టేబుల్‌ పలువురికి ఫోన్లు చేసి సాయంత్రం సీఐ రమ్మన్నాడని కబురు పెడతాడు. తీరా వచ్చిన తరువాత గుంపులో ఉన్న ఒకరు లేక ఇద్దరికి బెల్టు దెబ్బలు రుచి చూపిస్తాడు. దీంతో పక్కనే ఉన్నవారు భయంతో అతడికి సరెండర్‌ అవుతారు. కేవలం ఆరోపణలు ఉన్నాయి కాబట్టే తీసుకు వచ్చి వార్నింగ్‌ ఇచ్చామని.. రేపు వస్తే మీపై ఉన్న కేసులను పరిశీలిస్తామంటూ పంపిస్తారు. ఇంతలో సీఐకి మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న ఓ నేత వచ్చి వీరితో రాయభారం నడిపి కేసులు నమోదు కాకుండా బేరసారాలకు దిగుతాడు. ఈ తతంగం నెల రోజులుగా కొనసాగుతోంది. సదరు అధికారి దేవేందర్‌నగర్, రావినారాయణరెడ్డి నగర్, కైసర్‌నగర్, బాలయ్యనగర్, మహదేవపురం, జగద్గిరిగుట్ట తదితర ప్రాంతాలకు చెందిన  నాయకులను రోజుకు ఐదు నుంచి పది మంది చొప్పున స్టేషన్‌కు పిలిపించి, బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే పలువురి నుంచి డబ్బులు, భవన నిర్మాణ సామాగ్రి తరలించిన అతను రెండు రోజుల క్రితం  దేవేందర్‌నగర్‌ ప్రాంతానికి చెందిన పలువురిని  స్టేషన్‌కు రప్పించి రూ.6 వేల చొప్పున రూ. 48 వేలు వసూలు చేయడమేగాక బాలానగర్‌లో లారీలు ఆర్డర్‌ ఇచ్చి ఒక లోడు ఇసుకను బాలాపూర్‌కు తరలించడం విశేషం.మరో వ్యక్తిని పిలిచి నీపై ఆరోపణలున్నాయంటూ రూ. 30 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేయగా రూ. 10వేలు ఇచ్చేందుకు అతను అంగీకరించాడు. ఇలా ప్రతి ఒక్కరూ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి మామూళ్లు సమర్పించుకోవడం పరిపాటిగా మారింది. 

భారీగా వసూళ్లు..
దేవేందర్‌నగర్‌కు చెందిన ముగ్గురు వ్యక్తులపై ఇటీవల ల్యాండ్‌ గ్రాబింగ్‌ కేసులు నమోదయ్యాయి. వీరి వద్ద నుంచి సదరు అధికారి రూ. లక్షల్లో వసూలు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. బాలయ్యనగర్‌కు చెందిన ఓ నేత ఇదే తరహాలో ముడుపులు సమర్పించుకోగా, దేవేందర్‌నగర్‌కు చెందిన ముగ్గురు పెద్ద మొత్తంలో డబ్బులు ముట్ట జెప్పినట్లు తెలిసింది. ఏది ఏమైనా సదరు అధికారి వ్యవహార శైలి స్థానికంగా చర్చానీయాంశంగా మారింది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top