అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌పై వ్యభిచార నిరోధక కేసు

Bail petition Rejection On Asst Professor Nirmala devi Case Tamil Nadu - Sakshi

130 రోజులుగా జైల్లోనే మగ్గుతున్న నిర్మలాదేవి

ఏడుసార్లు నిరాకరణకు గురైన బెయిల్‌ పిటిషన్‌

సాక్షి ప్రతినిధి, చెన్నై: లైంగిక అవసరాలు తీర్చేలా కళాశాల విద్యార్థినులను తప్పుడు మార్గాల వైపు మళ్లించే ప్రయత్నాలు చేసిన కళాశాల అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ నిర్మలాదేవిపై వ్యభిచార నిరోధక చట్టం, ఉమ్మడిగా కుట్ర కేసులను పెట్టారు. విద్యార్థినులను లైంగికంగా ప్రలోభాలకు గురిచేసిన మాట వాస్తవమేనని నిర్మలాదేవి సైతం అంగీకరించినట్లు సీబీసీఐడీ అధికారులు చెప్పారు. నిర్మలాదేవి నోటి ద్వారానే వాంగ్మూలాన్ని నమోదుచేసి కోర్టులో బదులు పిటిషన్‌ దాఖలు చేసినట్లు సీబీసీఐడీ అధికారులు శనివారం తెలిపారు. సుమారు నాలుగు నెలల క్రితం జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

విరుదునగర్‌ జిల్లా అరుప్పుకోట్టైలోని ఒక ప్రయివేటు కళాశాల అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ నిర్మలాదేవి తన కళాశాలకు చెందిన నలుగురు విద్యార్థినులను పలురకాలుగా మభ్యపెట్టి ఉన్నతాధికారుల లైంగిక వాంఛలు తీర్చాల్సిందిగా ఒత్తిడి చేశారు. సెల్‌ఫోన్‌ ద్వారా పదేపదే వారిని సంప్రదిస్తూ ఒప్పించే ప్రయత్నం చేయడంతో ఈ విషయాన్ని సదరు విద్యార్థినులు తమ సెల్‌ఫోన్లలో రికార్డుచేశారు. నిర్మలాదేవి మాటల ఆధారంతో ఫిర్యాదు చేయగా పోలీసులు ఆమెను అరెస్ట్‌ చేశారు. నిర్మలాదేవికి వ్యతిరేకంగా సీబీసీఐడీ కేసు నమోదుచేసి విచారిస్తోంది. అలాగే మహిళా డీఐజీ నేతృత్వంలో ప్రత్యేక విజిలెన్స్‌ బృందాన్ని ఏర్పాటుచేసి విచారణ జరిగేలా ఆదేశించాలని కోరుతూ పురట్చికర మానవర్‌ ఇలైంజర్‌ మున్నని రాష్ట్ర కన్వీనర్‌ గణేశన్‌ గతంలో మద్రాసు హైకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై æకోర్టు జారీచేసిన ఉత్తర్వుల ప్రకారం సీబీసీఐడీ అదనపు ఎస్పీ లావణ్య తరఫున శుక్రవారం ఒక నివేదిక దాఖలైంది. అందులోని వివరాలు ఇలా ఉన్నాయి.

‘విద్యార్థినులను వక్ర మార్గాలకు నెట్టివేసే ప్రయత్నాలు చేసిన నేరానికి అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ నిర్మలాదేవి, వర్సిటీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు మురుగన్, పీహెచ్‌డీ విద్యార్థి కరుప్పుస్వామిలను అరెస్ట్‌ చేసి జైల్లో పెట్టాం. ఈ కేసు విచారణలో భాగంగా వారిని పోలీస్‌ కస్టడీకి తీసుకుని వాంగ్మూలం నమోదు చేశాం. అలాగే బాధిత విద్యార్థినుల సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకుని, విద్యార్థినులతో నిర్మలాదేవి జరిపిన సంభాషణలను సీడీల్లో రికార్డు చేశాం. ఈ కేసులో ఇంతవరకు 160 మంది నుంచి సాక్ష్యాలు సేకరించాం. మురుగన్, కుప్పుస్వామి కోసమే విద్యార్థినులపై లైంగిక ఒత్తిళ్లకు పాల్పడినట్లుగా నిర్మలాదేవి తన వాంగ్మూలంలో అంగీకరించారు.  నిందితులు ముగ్గురి ఇళ్లలో సోదాలు నిర్వహించి సిమ్‌కార్డులు, మెమొరీ కార్డులు, ల్యాప్‌టాప్‌ తదితర 123 ముఖ్యమైన ఆధారాలను సేకరించి ఫోరెన్సిక్‌ విభాగానికి పంపాం.

అంతేగాక హైకోర్టు మదురై శాఖ ఆదేశాల ప్రకారం నిర్మలాదేవిమాటలను చెన్నై మైలాపూరులో ఫోరెన్సిక్‌ కార్యాలయానికి పంపాం’ అని బదులు పిటిషన్‌లో పేర్కొన్నారు. నిర్మలాదేవి తదితరులు నేరాన్ని అంగీకరించడం, తగిన ఆధారాలు లభించినందున వ్యభిచార నిరోధక చట్టం కింద కేసులు పెట్టినట్లు తెలిపారు. ఈ బదులు పిటిషన్‌ను మద్రాసు హైకోర్టు న్యాయమూర్తులు కులువాడి జీ రమేష్, కల్యాణ సుందరంలతో కూడిన డివిజన్‌ బెంచ్‌ ముందుకు శుక్రవారం విచారణకు వచ్చింది. మహిళలకు వ్యతిరేకంగా, హక్కులకు భంగకరమైన కేసులను ప్రధాన న్యాయమూర్తి వీకే తహీల్‌ రమణి, న్యాయమూర్తి ఎమ్‌ దురైస్వామిలతో కూడిన మొదటి శ్రేణి డివిజన్‌ బెంచ్‌ విచారిస్తోందని రమేష్, కల్యాణ సుందరం తెలిపారు. కాబట్టి ఈ కేసును ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని డివిజన్‌ బెంచ్‌కు బదలాయిస్తున్నట్లు వారు చెప్పారు.

బెయిల్‌కు నోచుకోని నిర్మలాదేవి
లైంగిక ఒత్తిడి కేసులో ఈ ఏడాది ఏప్రిల్‌ 16వ తేదీన నిర్మలాదేవి అరెస్టయ్యారు. ఆనాటి నుంచి బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేస్తూనే ఉన్నారు. ఇప్పటివరకు 7 సార్లు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేసినా కోర్టు మంజూరు చేయలేదు. బెయిల్‌ మంజూరు కాకపోవడంతో 130 రోజులుగా నిర్మలాదేవి జైలు జీవితాన్ని గడుపుతున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top