మలుపులు తిరుగుతున్న శిశువు కథ

The Baby Story Turning In jagtial - Sakshi

సాక్షి, జగిత్యాల(కరీంనగర్‌) :  జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలంలో పసికందు విక్రయానికి సిద్ధపడ్డ ఘటన రోజుకో మలుపు తిరుగుతుంది. నిర్మల్‌ జిల్లా కడెంకు చెందిన పుట్ట గంగజ్యోతి మహారాష్ట్రకు చెందిన నవీన్‌ దంపతులు. ఇద్దరు ఆర్మూర్‌ బస్టాండ్‌ ప్రాంతంలో నివసిస్తున్నారు. వీరికి కూతురు నక్షత్ర ఉంది. నవీన్‌ విడిచిపెట్టి పోవడంతో జ్యోతి భిక్షాటన చేస్తూ జీవనం గడుపుతోంది. కాగా నెల రోజులు నిండని పసికందును రూ.20 వేలకు అమ్మడానికి సిద్ధపడుతుండగా స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఐసీడీఎస్, ఐసీపీఎస్‌ అధికారులకు అప్పగించారు. జ్యోతి పొంతనలేని సమాధానం చెప్పడంతో అనుమానం వచ్చి విచారణ చేపట్టారు. శిశువును కరీంనగర్‌లోని శిశుగృహకు తరలించారు.

గంగ జ్యోతి, నక్షత్రను స్వధార్‌హోమ్‌కు తరలించారు. అప్పటి నుంచి విచారణ కొనసాగుతుంది. ఈక్రమంలో నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ మండలం పెర్కిట్‌ గ్రామానికి చెందిన గందం సుమలత పాప కనిపించడం లేదని ఆర్మూర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలోనే మెట్‌పల్లిలో అమ్మకానికి పెట్టిన పాప కిడ్నాప్‌నకు గురైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. విచారణలో భాగంగా ఆర్మూర్‌ పోలీసులు డీఎన్‌ఏ పరీక్షల కోసం శిశువును తరలించారు.  

పరారీలో గంగజ్యోతి.?
ఒకవైపు ఆర్మూర్‌ పోలీసులు శిశువును డీఎన్‌ఏ పరీక్షలకు పంపగా.. ఇంతలోనే గంగజ్యోతి కరీంనగర్‌లోని స్వధార్‌హోమ్‌ నుంచి ఐదు రోజుల క్రితం పరారైనట్లు తెలిసింది. దీంతో గంగజ్యోతి పాపను కిడ్నాప్‌ చేసి అమ్మకానికి పెట్టినట్లు అనుమానాలు కలుగుతున్నాయి. తన కూతురు నక్షత్రను  స్వధార్‌హోమ్‌లోనే ఉంచి పారిపోయింది. ఆ మె కోసం వెతుకుతున్నారు. ఒకవేళ డీఎన్‌ఏ రిపో ర్ట్‌ వచ్చినా గంగజ్యోతి దొరికితే గానీ విషయం బ యటకు పొక్కదు. పరారీ సంఘటనపై సైతం వి చారణ కొనసాగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top