
ఆస్పత్రిలో కల్యాణి
సాక్షి, అనకాపల్లిటౌన్(విజయనగరం) : ఎన్టీఆర్ వైద్యాలయంలో వైద్యుల నిర్లక్ష్యానికి తల్లి గర్భంలో శిశువు మృతి చెందింది. ఈ సంఘటన గురువారం చోటుచేసుకుంది. గర్భిణి భర్త గెంజి కొండాజీ వివరాలు ఇలా ఉన్నాయి. మాడుగుల మండలం బాధం వీధికి చెందిన గెంజి కల్యాణి పురిటి నొప్పులతో మాడుగుల కమ్యూనిటీ హెల్త్‌సెంటర్‌లో గత నెల 30న చేరింది. ఉమ్మనీరు తక్కువగా ఉందని, తక్షణం ఆపరేషన్ చేసి శిశువును బయటకు తీయాలని అక్కడి వైద్యులు సూచించారు. మత్తు వైద్యుడు సెలవులో ఉన్నందున అనకాపల్లి ఎన్టీఆర్ వైద్యాలయానికి తీసుకెళ్లాలని సూచించారు. ఆమేరకు 108లో మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు అనకాపల్లి ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఇక్కడి వైద్యులు ఏ మాత్రం పట్టించుకోకుండా వదిలేశారని కొండాజీ ఆరోపించాడు. సుఖప్రసవం అవుతుందంటూ గైనకాలజిస్ట్ చెప్పుకొచ్చారని తెలిపాడు. చి
వరకు గురువారం ఉదయం ఆపరేషన్‌కు ఏర్పాట్లు కూడా చేశారు. ఇంతలో ఇన్‌చార్జి గైనకాలజిస్ట్ వచ్చి సుఖప్రవసం అవుతుందంటే ఆపరేషన్‌కు ఏర్పాట్లు చేస్తున్నారెందుకంటూ ఇతర డాక్టర్లను ప్రశ్నించారని కొండాజీ తెలిపాడు. గురువారం మధ్యాహ్నం ఒంటిగంట సమయానికి కల్యాణి కడుపులో శిశువు కదలిక లేకుండా పోయింది. అప్పుడు వైద్యులు అందుబాటులో లేకుండా పోయారు. 3.30 గంటలకు విధుల్లో ఉన్న గైనకాలజిస్ట్‌కు చెప్పగా స్కానింగ్ చేసి చూశారు. శిశువు మృతి చెందినట్లు నిర్ధారించారు. ఇది తెలుసుకున్న కుటుంబసభ్యులు ఎకాయెకిన వైద్యాలయానికి చేరుకుని శిశువు మృతికి వైద్యులే కారణమంటూ ఘర్షణకు దిగారు. సమాచారంమేరకు వైఎస్సార్‌సీపీ నాయకుడు దాడి జయవీర్, కొణతాల మురళీ, బొడ్డేడ శివలు ఆస్పత్రికి వచ్చి ఆర్‌ఎంవో సింహాచలంనాయుడుతో చర్చలు జరిపారు. అనంతరం గర్భిణిని విశాఖ కేజీహెచ్‌కు తరలించారు.