ఖాకీ.. ఇదేం పని..?

AP Police Demand Bribery Women in Lodge Room - Sakshi

పోలీసుశాఖకే తలవంపులు

లాడ్జిలో కనిపించిన మహిళలతో కానిస్టేబుళ్ల బేరసారాలు

బంగారు గాజులు లాక్కుని వదిలేసిన వైనం

నగరంలోని ఓ ప్రముఖ లాడ్జిలో ఘటన

అనంతపురం సెంట్రల్‌: అసాంఘిక కార్యకలాపాలను అరికట్టాల్సిన పోలీసుల్లో కొందరు సొమ్ములకు ఆశపడి దిగజారుడుగా వ్యవహరిస్తూ పోలీసు శాఖకు తలవంపులు తీసుకొస్తున్నారు. ఓ లాడ్జిలో కనిపించిన ఇద్దరు మహిళలను కేసుల పేరుతో బెదిరించి, నగదు డిమాండ్‌ చేసి.. చివరికి వారి చేతుల్లో ఉన్న బంగారు గాజులు లాక్కుని వదిలేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. నగరంలోని సరోజినీ రోడ్డులో గల ప్రముఖ లాడ్జిలోకి సోమవారం ఇద్దరు మహిళా ఉద్యోగులు వెళ్లారు. వీరు గౌరవప్రదమైన వృత్తుల్లో కొనసాగుతున్నారు. సదరు మహిళలు లాడ్జిలోకి ప్రవేశించి లిఫ్ట్‌ గది వద్ద వేచి చూస్తున్నారు. అంతలోగా మరో ఇద్దరు వ్యక్తులు అక్కడికి చేరుకున్నారు. అందరూ కలిసి లిఫ్ట్‌లో వెళ్లడానికి సిద్ధమయ్యారు. అప్పటికే అక్కడ నిఘా వేసి ఉన్న టూటౌన్‌ పోలీసుస్టేషన్‌కు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లు గమనించారు. కానిస్టేబుళ్లను చూడగానే ఇద్దరు వ్యక్తులు లాడ్జి నుంచి పారిపోయారు. కానీ మహిళలు పారిపోయేందుకు వీలు కాకపోవడంతో లాడ్జిలోంచి బయటకు వచ్చి వెనుక వైపు ఓ షాపింగ్‌మాల్‌కు చెందిన వాహనాల పార్కింగ్‌ స్థలంలోకి వెళ్లారు. కానిస్టేబుళ్లు కూడా వారి వద్దకు చేరుకున్నారు.

బెదిరించి.. గాజులు లాక్కుని..
మీరు స్టేషన్‌కు రావాల్సి ఉంటుందని సదరు మహిళలను కానిస్టేబుళ్లు బెదిరించారు. సమాజంలో గౌరవప్రదమైన వృత్తిలో కొనసాగుతున్న ప్రభుత్వ ఉద్యోగినులు బెంబేలెత్తిపోయారు. స్టేషన్‌ వరకు వెళ్తే జీవితాలు నాశనం అవుతాయని, కుటుంబాలు వీధిన పడతాయని ప్రాధేయపడ్డారు. ఇదే అదనుగా భావించిన కానిస్టేబుళ్లు వారి నుంచి డబ్బు డిమాండ్‌ చేశారు. ఆ క్షణంలో వారి వద్ద నగదు లేకపోవడంతో చేతుల్లోని బంగారు గాజులను కానిస్టేబుళ్లు లాగేసుకుని వదిలేశారు. 

చర్చనీయాంశమైన కానిస్టేబుళ్ల తీరు
మహిళా ఉద్యోగులు లాడ్జిలో తప్పు చేస్తూ రెడ్‌హ్యాండ్‌గా ఏమీ పట్టుబడలేదు. కేవలం లిఫ్ట్‌లో మాత్రమే ప్రయాణించారు. ఒకవేళ వారికి వివాహేతర సంబంధాలున్నట్లు అనుమానం ఉంటే స్టేషన్‌కు తీసుకెళ్లి విచారణ చేయాలి. తప్పు చేసి ఉంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. కానీ కానిస్టేబుళ్లు బంగారు గాజులు లాక్కుని వారిని వదిలేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారుతోంది. దీనిపై సమగ్ర విచారణ జరిపితే అసలు నిందుతులు బయటపడే అవకాశాలు ఉన్నాయి. దిగజారుడుగా వ్యవహరించిన కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకుంటారా? లేదా అన్నది కూడా వేచి చూడాలి.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top