పా‘పాల’ భైరవుల ఆటకట్టు!

Adultry Milk Distributer Arrest in Hyderabad - Sakshi

అధిక పాల ఉత్పత్తికి ఆక్సిటోసిన్‌ ఇంజెక్షన్లు

బీదర్‌ నుంచి అక్రమ రవాణా  

పాల డెయిరీలకు విక్రయం నిందితుడి అరెస్టు  

ఈ పాలతో ఆనర్థాలు: నిపుణులు

సాక్షి, సిటీబ్యూరో: వెటర్నరీ వినియోగంలో నిషేధించిన ఆక్సిటోసిన్‌ ఇంజెక్షన్లను కర్ణాటకలోని బీదర్‌ నుంచి అక్రమ రవాణా చేసి, నగరంలోని డెయిరీ ఫామ్స్‌కు విక్రయిస్తున్న ముఠా గుట్టును సౌత్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు రట్టు చేశారు. ఓ నిందితుడిని పట్టుకుని 100 ఎంఎల్‌ పరిమాణం కలిగిన 1920 లేబుల్స్‌ లేని ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకున్నట్లు అదనపు డీసీపీ ఎస్‌.చైతన్యకుమార్‌ ఆదివారం వెల్లడించారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నామన్నారు. ప్రసూతి సమయంలో మహిళలకు వినియోగించే ఈ ఇంజెక్షన్లను గతంలో పశువులకు వాడేవారు. అయితే వీటి దుష్పరిణామాలను పరిగణలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం వీటి వినియోగాన్ని నిషేధించింది. దీంతో అధికారికంగా వాటి ఉత్పత్తి పూర్తిగా ఆగిపోయింది. దీనిని సొమ్ము చేసుకునేందుకు కొన్ని అంతర్రాష్ట్ర ముఠాలు పుట్టుకొచ్చాయి. బీదర్‌కు చెందిన మహ్మద్‌ ఇస్మాయిల్‌ అనే వ్యక్తి ప్రసూతి మహిళలకు వాడే వాటినే పశువులకు వినియోగించేందుకు అనువుగా తయారు చేసి నగరంలోని బాబానగర్‌కు చెందిన ఇంతియాజ్‌ ద్వారా వాటిని మార్కెటింగ్‌ చేస్తున్నాడు. ఇంతియాజ్‌ ఆర్డర్‌ మేరకు ఈ ఇంజెక్షన్లు తయారు చేసే ఇస్మాయిల్‌ వాటిని తీసుకుని సిటీకి వచ్చేవాడు. ఇంతియాజ్‌ సూచన మేరకు డెయిరీ యజమానులకు అప్పగించి వెళ్లేవాడు. ఆర్థిక లావాదేవీలన్నీ ఇద్దరూ కలిసి పర్యవేక్షిస్తుంటారు. గేదెలు అధికంగా పాలు ఇవ్వడానికి ఈ ఇంజెక్షన్లు ఇస్తున్నారని, నగరంతో పాటు శివార్లలోని డెయిరీ ఫామ్స్‌లో దాదాపు 70 శాతం వీటిని వినియోగిస్తున్నట్లు అనుమానిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు. గేదెలకు ఈ ఇంజెక్షన్లు ఇవ్వడం ద్వారా తీసిన పాలు, ఆ పాల ఉత్పత్తులు తీసుకుంటే అనేక అనర్థాలు కలుగుతాయన్నారు. ఈ దందాపై దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్‌కు సమాచారం అందడంతో ఇన్‌స్పెక్టర్‌ కె.మధుమోహన్‌రెడ్డి నేతృత్వంలో ఎస్సైలు నరేందర్‌ తదితరులతో కూడిన బృందం రంగంలోకి దిగింది. పాతబస్తీలో మాటువేసి ఇస్మాయిల్‌ను పట్టుకుని ఇంజెక్షన్లు స్వాధీనం చేసుకుంది. పరారీలో ఉన్న మరో నిందితుడు ఇంతియాజ్‌ కోసం గాలిస్తోంది.  

అనర్థాలూ ఎన్నో...
ఆక్సిటోసిన్‌ ఇంజెక్షన్ల వాడకంతో అనేక అనర్థాలు ఉన్నాయని పశు వైద్యులు చెబుతున్నారు. వీటిని వినియోగిస్తే గేదెలకే కాకుండా ఆ పాలను వినియోగించే మనుషులకూ ఎన్నో ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయని వారు స్పష్టం చేస్తున్నారు. ఈ ఇంజెక్షన్లను అత్యధికంగా గేదెలకే ఇస్తుంటారు. సాధారణంగా గేదెలు పాలు ఇవ్వాలంటే వాటి పొదుగును దూడలు తాకి పాలు తాగాల్సిందే. అప్పుడే ఆ గేదెల మెదడులో ఉండే పిట్యుటరీ గ్రంథి ప్రేరేపితమై హార్మోన్స్‌ను విడుదల చేస్తుంది. వీటి కారణంగానే గేదె పాలు ఇవ్వడం జరుగుతుంది. దూడలు లేని  పశువు నుంచి సామర్థ్యానికి మించి పాలను పిండాలని భావించే యజమానులే ఈ ఆక్సిటోసిన్‌ ఇంజెక్షన్లను వాడతారు. ప్రస్తుతం వీటిపై నిషేధం ఉండటంతో ప్రసూతి సమయంలో మనుషులకు వాడే వాటినే గేదెలకూ వినియోగిస్తున్నారు. ఒక్కో గేదెకు రోజుకు 8 ఎంఎల్‌ నుంచి 20 ఎమ్‌ఎల్‌ వరకు ఇంజెక్ట్‌ చేస్తుంటారు. ఆ తర్వాత గేదె ఇచ్చే పాలలోనూ ఆక్సిటోసిన్‌ ఆనవాళ్ళు  ఉంటాయి. ఈ పాలు తాగిన మనుషులూ అనేక రుగ్మతలకు లోనవటంతో పాటు రోగాల బారినపడతారు. చిన్నారులకు ఈ పాలను కొన్నాళ్ళ పాటు తాగిస్తే వారికి ఫిట్స్‌ వంటి నరాల సంబంధ వ్యాధులు వస్తాయి. మహిళలకు బ్రెస్ట్‌ క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఉంది. ఈ పాలు వాడిన వారిలో అసహజమైన ఎదుగుదల కనిపిస్తుంది. వీరు త్వరగా వృద్ధులుగా మారతారు. నెలలకు నిండక ముందే ప్రసవాలు, చిన్నారులకు బుద్ధిమాంద్యం, ఇమ్యూనిటీ తగ్గిపోవడం తదితర ఇబ్బందులు ఎదురవుతాయి. పాలల్లో ఉన్న ఆక్సిటోసిన్‌ ఆనవాళ్లను కేవలం ప్రయోగశాలల్లో మాత్రమే గుర్తించగలుగుతామని  నిపుణులు పేర్కొన్నారు.  

‘కుటీర పరిశ్రమగా’ తయారీ
ఒకప్పుడు పశువులకు వినియోగించే ఆక్సిటోసిన్‌ ఇంజెక్షన్లను ప్రభుత్వం 2003లో నిషేధించింది. అప్పటి నుంచి పలువురు అక్రమంగా వీటిని సేకరించి విక్రయిస్తున్నారు. ఈ ముఠాలు ప్రసూతి సమయంలో మహిళలకు వాడే ఆక్సిటోసిన్‌ ఇంజెక్షన్లు కొనుగోలు చేసి 300 ఎంఎల్‌ ఆక్సిటోసిన్‌లో 1200 ఎంఎల్‌ ఫినాయిల్, కేజీ గళ్ల ఉప్పు, 160 లీటర్ల నీరు కలిసి కృత్రిమ ఆక్సిటోసిన్‌ ద్రావణం తయారు చేస్తున్నారు. దీనిని 140, 180, 200 ఎంఎల్‌ బాటిల్స్‌లో ప్యాక్‌ చేసి ఇంజెక్షన్ల రూపంలో విక్రయిస్తున్నారు. 160 లీటర్ల ద్రావణం తయారీకి రూ.4 వేల వరకు ఖర్చవుతుండగా.. దానిని ఇంజెక్షన్లుగా  మార్చి ఏకంగా రూ.90 వేలకు విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నగరంలోని డెయిరీ ఫామ్స్‌ హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్‌ల నుంచి గేదెల్ని ఖరీదు చేసుకుని వస్తున్నాయి. అక్కడి ఫామ్స్‌లో ఏళ్ల పాటు వినియోగించి, అవసానదశకు చేరిన వాటిని తక్కువ ధరకు తీసుకువస్తున్నారు. వీటికి దూడలు కూడా ఉండకపోవడంతో పాల ఉత్పత్తి తక్కువగా ఉంటుంది. వీటి నుంచి పాలు తీసేముందు 4 ఎంఎల్‌ చొప్పున ఆక్సిటోసిన్‌ ఇంజెక్షన్లు ఇస్తూ భారీగా పాలు పిండుతున్నారు. ఈ పంథాలో పాలిచ్చిన గేదెలు గరిష్టంగా ఏడాదికే వట్టిపోయి స్లాటర్‌ హౌస్‌లకు చేరాల్సి వస్తోంది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top