కేరళలో ఎస్కేప్‌... శంషాబాద్‌లో అరెస్టు!  | Sakshi
Sakshi News home page

కేరళలో ఎస్కేప్‌... శంషాబాద్‌లో అరెస్టు! 

Published Tue, Jun 18 2019 2:23 AM

Accused Escape from Kerala and arrested in Shamshabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: విథుర సెక్స్‌రాకెట్‌ కేసులో అతడు 18 ఏళ్లపాటు తప్పించుకుతిరిగాడు. ఎట్టకేలకు కేరళ కోర్టు ముందు లొంగిపోయి బెయిల్‌ పొందాడు. మళ్లీ అజ్ఞాతంలోకి పారిపోయి ఐదేళ్ల తర్వాత శంషాబాద్‌లో పట్టుబడ్డాడు. అతడే విథుర సెక్స్‌ స్కాండల్‌లో ప్రధాన నిందితుడు సురేష్‌. ఈ సెక్స్‌ స్కాండల్‌ అప్పట్లో కేరళలో సంచలనం సృష్టించింది. పోలీసులు సోమవారం అతడిని జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించారు. కేరళలోని కడక్కల్‌ ప్రాంతానికి చెందిన సురేష్‌ అలియాస్‌ షాజహాన్‌ ప్రేమ పేరుతోనో, మరో రకంగానో మహిళలను వశపరుచుకుని వ్యభిచారగృహాలకు అమ్మేవాడు.

కేరళవ్యాప్తంగా ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని ఈ దందా నడిపాడు. అక్కడి విథుర ప్రాంతానికి చెందిన అజిత బేగం అనే ఏజెంట్‌ ద్వారా 1995లో ఓ బాలికను సంపన్నుల ఇంట్లో పని ఇప్పిస్తానంటూ ఎర్నాకుళం తీసుకువచ్చాడు. ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడి అదే ఏడాది అక్టోబర్‌ 21న ఓ వ్యభిచారగృహానికి అమ్మేశాడు. అనేక ప్రాంతాల్లోని వ్యభిచారకూపాల్లో మగ్గిన ఆ బాలికను పోలీసులు 1996 జూలై 16న వ్యభిచార కేసులో అరెస్టు చేశారు. బెయిల్‌ మీద బయటకు వచ్చిన ఆ బాలిక కొట్టాయం పోలీసులకు సురేష్‌పై ఫిర్యాదు చేసింది. అప్పట్లో ఈ బాలిక వెల్లడించిన విషయాలు రాష్ట్రవ్యాప్తంగా కలకలంరేపాయి.
 
20 కేసులు నమోదు... 
ఆ బాలిక స్ఫూర్తితో బయటకు వచ్చిన మరికొందరు మహిళలు అతడిపై ఫిర్యాదులు చేయడంతో మొత్తం 20 కేసులు నమోదయ్యాయి. విథుర సెక్స్‌ స్కాండల్‌గా సంచలనం సృష్టించిన ఈ కేసులో ఇతర నిందితులు అప్పట్లోనే అరెస్టు అయినా, ప్రధాన నిందితుడు సురేష్‌ దాదాపు 18 ఏళ్లు పోలీసుల్ని ముప్పుతిప్పలు పెట్టి చివరకు 2014లో కొట్టాయం కోర్టు ముందు లొంగిపోయాడు. ఇతడిపై పోలీసులు అభియోగపత్రాలు సైతం దాఖలు చేశారు. బెయిల్‌ పొందిన అనంతరం అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఐదేళ్లుగా అనేక ప్రాంతాల్లో వేర్వేరు పేర్లు, వృత్తుల ముసుగులో తలదాచుకుంటూ తప్పించుకుతిరుగుతున్నాడు. డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌ బైజూ పౌలోస్‌ నేతృత్వంలో బృందం సాంకేతిక పరిజ్ఞానంతో సురేష్‌ సైబరాబాద్‌ పరిధిలోని శంషాబాద్‌లో తలదాచుకున్నట్లు గుర్తించి శుక్రవారం అరెస్టు చేసి తీసుకువెళ్లింది. సురేష్‌ ముంబైలోనూ తన దందా కొనసాగించాడని పోలీసులు అనుమానిస్తున్నారు. అతడి గురించిన సమాచారం ముంబై పోలీసులకు ఇవ్వాలని కేరళ పోలీసులు భావిస్తున్నారు.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement