సబ్‌ రిజస్ట్రార్‌ కార్యాలయంపై.. ఏసీబీ దాడి

ACB Raids On Sub Registrar Office In Srikakulam - Sakshi

సాక్షి, రణస్థలం(శ్రీకాకుళం) : స్థానిక సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంపై వచ్చిన అవినితీ ఆరోపణల నేపథ్యంలో ఆకస్మికంగా దాడి చేశామని ఏసీబీ డీఎస్పీ బి.వి.ఎస్‌.ఎస్‌.రమణమూర్తి తెలిపారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించారు. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రోజువారి వేతనానికి పనిచేస్తున్న ఉద్దగిరి శ్రీనివాసరావు అనే వ్యక్తి వద్ద రూ.70 వేలు ఉన్నట్లు డీఎస్పీ  గుర్తించారు. రిజస్ట్రార్‌ కార్యాలయంలోని క్రయ, విక్రయ దస్త్రాలను పరిశీలించారు. సబ్‌ రిజిస్ట్రార్‌ రాజేశ్వరరావుతో పలు విషయాలపై డీఎస్పీ విచారించారు. తనిఖీలు రాత్రి 9 గంటల వరకు కొనసాగాయి. ఈ తనిఖీల్లో అవినీతి నిరోధక శాఖ సీఐలు భాస్కరరావు, హరి, ఇతర సిబ్బంది ఉన్నారు. 

ఉలిక్కిపడిన సిబ్బంది
ఆగస్టు 1వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్‌ విలువలు పెరుగుతున్నాయని తెలియడంతో సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి బుధవారం క్రయ, విక్రయధారుల తాకిడి ఒక్కసారిగా పెరిగింది. ఈ సమయంలో ఏసీబీ అధికారుల ప్రవేశంతో సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయ సిబ్బంది ఉలిక్కిపడ్డారు. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం సిబ్బందితోపాటు కార్యాలయం సమీపంలోనే క్రయ, విక్రయాల లావాదేవీలపై డాక్యుమెంటేషన్‌ చేసే మధ్యవర్తులను అదుపులోనికి తీసుకుని కార్యాలయంలో జరిగే కార్యక్రమాలపై ప్రశ్నల వర్షం కురిపించారు. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం ఏర్పాటైన తరువాత ఏసీబీ దాడులు జరగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

ప్రైవేటు వ్యక్తుల అడ్డా్డగా..
సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం ప్రైవేటు వ్యక్తుల అడ్డగా మారింది. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ కార్యకలాపాలు సాగిస్తున్నారు. వీరి చెప్పినదానికే సిబ్బంది కూడా తల ఉపడంతో చేసేది ఏమిలేక క్రయ, విక్రయాలకు కూడా వీరినే సంప్రదించడం పరిపాటిగా మారింది. ఈ తతంగం కొన్నేళ్లుగా జరుగుతున్నా.. రిజిస్ట్రార్‌ కార్యాలయం సిబ్బంది అడ్డుకట్ట వేయడంలేదు. ఈ కార్యాలయంలో ప్రతి పని కాసులపైనే నడుస్తుంది. ఆస్తుల క్రయ, విక్రయాల లావాదేవీలు ప్రైవేటు వ్యక్తుల కనుసైగల్లోనే జరుగుతున్నాయి. రిజిస్ట్రేన్‌కు సంబంధించిన వ్యవహారాలన్ని వీరు చూడడంతో ఒక్కో పనికి ఒక రేటు పెట్టారు. ప్రభుత్వ నిబంధనలతో పనిలేకుండా నేరుగా వీరి సమక్షంలోనే లావాదేవీలు జరపడంతో అటు కార్యాలయంలోని దిగువ స్థాయి సిబ్బంది, ఇటు క్రయవిక్రయాదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

కార్యాలయంలో దస్తావేజులు తదితర వ్యవహారమంతా ప్రైవేటు వ్యక్తులే చూడడం పరిపాటిగా మారింది. ఎవరికైనా దస్తావేజు పత్రాలు అవసరమైతే వారి వద్ద నుంచి భారీ మొత్తాన్ని తీసుకుని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయ సిబ్బందికి తెలియకుండానే పనులు చక్కబెడుతున్నారు. భూముల ధరలు ప్రైవేటు వ్యక్తులకు బయటకు తెలియపర్చడంతో కొన్నిసార్లు క్రయ, విక్రయాదారుల మధ్య వివాదాలు చోటుచేసుకునే సందర్భాలు కూడా ఉన్నాయి. ఇటీవల సబ్‌ రిజిస్ట్రార్‌ ఝాన్సీ రాణి బదిలీ అయ్యారు. 15 రోజుల క్రితమే రాజేశ్వరరావు రిజిస్ట్రార్‌గా వచ్చారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top