గోడ కూలి 15 మంది మృతి

4 kids among 15 killed in Kondhwa wall collapse - Sakshi

పుణేలో ఘటన   బాధితులంతా బిహారీలే

సాయం ప్రకటించిన బిహార్, మహారాష్ట్ర

సాక్షి, ముంబై: మహారాష్ట్రలోని పుణేలో శుక్రవారం అర్థరాత్రి ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. పుణేలోని కోండవా ప్రాంతంలో ప్రహరీ గోడ కూలి 15 మంది దుర్మరణం చెందారు. భవన నిర్మాణ పనులు చేపట్టేందుకు గాను అల్కాన్‌ ల్యాండ్‌మార్క్స్, కంచన్‌ రాయల్‌ ఎక్సోటికా ప్రాజెక్టు సంస్థలు భారీగా తవ్వకాలు చేపట్టాయి. ఈ పనుల్లో పాల్గొంటున్న బిహార్‌లోని కటిహార్‌ ప్రాంతానికి చెందిన కూలీలు దాదాపు 20 మంది అక్కడే గుడిసెలు వేసుకుని కుటుంబాలతోపాటు ఉంటున్నారు.

ఆ పక్కనే దాదాపు 22 అడుగుల ఎత్తైన ప్రహరీ ఉంది. శుక్రవారం నాటి భారీ వర్షానికి ప్రహరీ బాగా నాని, అర్థరాత్రి సమయంలో కూలీల గుడిసెలపై కూలి పడింది. గోడతోపాటుఅవతలి వైపు పార్కు చేసిన పదుల సంఖ్యలో కార్లు కూడా వారిపై పడిపోయాయి. దీంతో వాటికింద నలిగి 15 మంది కూలీలు అక్కడికక్కడే చనిపోగా ముగ్గురు మాత్రం క్షేమంగా బయటపడ్డారు. వారిలో ఇద్దరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మృతుల్లో ఏడేళ్లలోపు నలుగురు చిన్నారులు కూడా ఉన్నారు. కాగా, అల్కాన్‌ ల్యాండ్‌మార్క్స్, కంచన్‌ రాయల్‌ ఎక్సోటికా ప్రాజెక్టు సంస్థలు నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రహరీ వరకు తవ్వకాలు చేపట్టడం వల్లనే ఈ ఘటన జరిగిందని మున్సిపల్‌ కమిషనర్‌ సౌరభ్‌రావు తెలిపారు.

అల్కాన్‌ ల్యాండ్‌మార్క్స్, కంచన్‌ రాయల్‌ ఎక్సోటికా ప్రాజెక్టు సంస్థలకు చెందిన 8మందిపై ఐపీసీ–304 సెక్షన్‌ కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మృతుల కుటుంబాలకు మహారాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షలు, బిహార్‌ ప్రభుత్వం రూ.2 లక్షల చొప్పున సాయం ప్రకటించాయి. ఈ విషయమై మంత్రి తానాజీ సావంత్‌ మాట్లాడుతూ మహారాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.4 లక్షలు, శివసేన పార్టీ తరఫున రూ.లక్ష కలిపి మొత్తం రూ.5 లక్షల ఆర్థిక సాయం    బాధిత కుటుంబాలకు అందజేయనున్నట్లు మీడియాకు తెలిపారు. ఈ దుర్ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలని ఆదేశిస్తూ ముఖ్యమంత్రి ఫడ్నవిస్‌ ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. వారంలోగా నివేదిక అందజేయాలని కోరారు. ఘటన ప్రాంతంలో భవన నిర్మాణ పనులను నిలిపివేయాలని పుణే మేయర్‌ ఆదేశించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top