ఔరా.. ఆమె ఎంత పని చేసింది! | 30 lakhs chit scam filed in badvel | Sakshi
Sakshi News home page

రూ.30లక్షలతో ఉడాయించిన మహిళ

Jan 31 2018 7:38 PM | Updated on Jan 31 2018 7:38 PM

30 lakhs chit scam filed in badvel - Sakshi

చీటీల పేరుతో మోసపోయి స్టేషన్‌ వద్దకు వచ్చిన బాధిత మహిళలు

సాక్షి, బద్వేలు అర్బన్‌ : చీటీల పేరుతో ఓ మహిళ రూ.30లక్షలతో ఉడాయించిన ఘటన బుధవారం పట్టణంలో వెలుగుచూసింది. వారం రోజులుగా సదరు మహిళ కనిపించకపోవడంతో మోసపోయామని గుర్తించిన బాధితులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. వివరాల్లోకి వెళితే పట్టణంలోని మదీనా సమీపంలో గల బెస్తకాలనీలో నివసిస్తుండే దస్తగిరమ్మ అనే మహిళ గత కొన్నేళ్లుగా శివానగర్, పూసలవాడ, సుందరయ్యకాలనీ, మదీనామసీదు వీధి, మేదరకాలనీలకు చెందిన సుమారు 60 మంది మహిళలతో చీటీలు నిర్వహిస్తుండేది.

పరిసర ప్రాంతాలకు చెందిన చాలామంది ఆమె దగ్గర  సుమారు రూ.50 వేల నుండి రూ.4 లక్షల వరకు చీటీలు వేశారు. కొన్నేళ్ల పాటు చీటీలు పాడుకున్న వారికి సక్రమంగా చెల్లిస్తూ బాగా నమ్మకం పెంచుకుంది. ఆ తర్వాత 6 నెలలుగా చీటీలు పాడుకున్న వారికి డబ్బులు చెల్లించకుండా కాలయాపన చేస్తూ వచ్చింది. గట్టిగా అడిగిన వారికి వడ్డీ చెల్లిస్తానని ప్రామిసరీనోట్లు సైతం రాయించి నమ్మపలికించింది. అయితే గత వారం రోజులుగా ఇంటికి తాళం వేసి కనిపించడకుండా పోయింది. ఫోన్‌ను సైతం స్విచ్‌ ఆఫ్‌ చేసుకొని ఉంది. దీంతో బాధితులు మోసపోయినట్లు గుర్తించారు.

లబోదిబోమంటున్న బాధితులు :
కాయాకష్టం చేసుకుని సంపాదించకున్న సొమ్ముతో చీటీలు వేసుకుంటే, ఆపద సమయంలో ఉపయోగపడుతుందని భావించి చీటీలు వేసుకున్న మహిళలు మోసపోయినట్లు తెలుసుకుని లబోదిబోమంటున్నారు. వీరిలో కొందరు పిల్లల చదువుల కోసం, మరికొందరు పెళ్ళిళ్ళ కోసం, గల్ఫ్‌ దేశాలకు వెళ్లే నిమిత్తము, ఆసుపత్రి అవసరాల కోసం చీటీలు వేసిన వారు ఉండడంతో కన్నీటి పర్యంతమవుతున్నారు. నమ్మకంగా ఉంటూ అందరి వద్ద డబ్బులు వసూలు చేసుకుని ఉడాయించడంపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు చీటీ నిర్వాహకురాలిపై కఠిన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement