ఎర్రకోట వద్ద ఇద్దరు ఉగ్రవాదుల అరెస్ట్‌

2 Suspected ISIS Terrorists Arrested Near Delhi's Red Fort, Says Police - Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఎర్రకోట వద్ద ఇద్దరు ఇస్లామిక్‌ స్టేట్‌ ఇన్‌ జమ్మూకశ్మీర్‌(ఐఎస్‌జేకే) ఉగ్రవాదులను ఢిల్లీ స్పెషల్‌ సెల్‌ పోలీసులు గురువారం రాత్రి అరెస్ట్‌చేశారు. ఎర్రకోట సమీపంలోని జామా మసీదు బస్టాండ్‌ వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న పర్వేజ్‌(24), జంషీద్‌(19)లను అరెస్ట్‌ చేసినట్లు స్పెషల్‌ సెల్‌ డీసీపీ  కుష్వాహా తెలిపారు. కశ్మీర్‌లోని షోపియాన్‌ జిల్లాకు చెందిన వీరిద్దరి నుంచి రెండు .32 పిస్టల్స్, 4 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. 

వీరు తమ రాకపోకలకు ఢిల్లీని కేంద్రంగా మాత్రమే వాడుతున్నారనీ, ఇక్కడ దాడులకు ఎలాంటి ప్రణాళికలు రచించలేదని కుష్వాహా తెలిపారు. పర్వేజ్‌ యూపీలోని గజ్‌రోలా పట్టణంలో ఉన్న ఓ కళాశాలలో ఎంటెక్‌ చదువుతుండగా, జంషిద్‌ డిప్లొమా చివరి సంవత్సరం చదువుతున్నాడు. పర్వేజ్‌ సోదరుడిని భద్రతాబలగాలు ఈ ఏడాది జనవరిలో షోపియాన్‌ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమార్చాయన్నారు. 2016, జూలైలో తన తమ్ముడు, హిజ్బుల్‌ ఉగ్రవాది ఫిర్దౌస్‌ను భద్రతాబలగాలు కాల్చిచంపడంతో పర్వేజ్‌ ఉగ్రబాట పట్టాడని పోలీసులు వెల్లడించారు. జంషిద్‌ ఆయుధాలను యూపీ నుంచి ఢిల్లీకి తరలిస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారి వెల్లడించారు.
 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top