విషాదం: మామ, అల్లుడి మృతి | 2 Men Died As Electrocution In Srikakulam | Sakshi
Sakshi News home page

మగ దిక్కు కొల్పోయిన కుటుంబం

Oct 21 2019 8:30 AM | Updated on Oct 21 2019 8:30 AM

2 Men Died As Electrocution In Srikakulam - Sakshi

బాషా, సైదా మృతదేహాలు

సాక్షి, చీపురుపల్లి(శ్రీకాకుళం): అప్పుడే తెల్లవారింది. అసలే ఆదివారం. సాధారణంగా మాంసాహార ప్రియుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అదే ఆశతో చికెన్‌ సెంటర్‌ నడుపుతున్న ఆ ఇద్దరు మామా అల్లుళ్లు ఉదయాన్నే దుకాణం తెరిచారు. బేరం బాగుంటుందనీ... సాయంత్రం కాస్తంత కాసులతో ఇంటికెళ్తామని ఆశించారు. కానీ వారు ఇంటి నుంచి వెళ్లిన కొద్ది గంటల్లోనే తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారన్న వార్త ఆ రెండు కుటుంబాలను హతాశులను చేసింది. పట్టణంలోని మెయిన్‌రోడ్‌లో గల మండల పరిషత్‌ కార్యాలయం ఎదురుగా దశాబ్దాల క్రితం నుంచి షేక్‌ బాషా చికెన్‌ సెంటర్‌ ఉంది. దాని యజమాని షేక్‌ బాషా(45), ఆయన అల్లుడు షేక్‌ సైదు(28) ఉదయం 5 గంటలకే చికెన్‌ సెంటర్‌కు వచ్చి వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించారు. 7 గంటల సమయంలో షేక్‌ సైదు కోళ్లను డ్రసింగ్‌ చేసేందుకు సంబంధిత మెషీన్‌లో వేశాడు. ఇంతలోనే విద్యుత్‌ షాక్‌ తగలడంతో ఆ మెషిన్‌కు చెందిన డ్రమ్‌తో బాటు సైదు ఎగిరిపడ్డాడు. ఆ శబ్దం విన్న మామ బాషా అల్లుడిని పట్టుకున్నాడు. అప్పటికే విద్యుత్‌ షాక్‌ తగిలి ఉన్న సైదుతో బాటు బాషా కూడా అక్కడికక్కడే క్షణాల్లో మృతి చెందారు.  

పట్టణంలో కలకలం 
పట్టణంలో పేరు మోసిన చికెన్‌ సెంటర్‌ కావడంతో ఎప్పటి మాదిరిగానే దుకాణంలో ఎక్కువ రద్దీ ఉంది. ఉదయాన్నే కొనుగోలుదారులతో సందడిగా ఉంది. ఇంతలో జరిగిన ఈ హఠాత్పరిణామంతో అక్కడున్నవారంతా దిగ్భ్రాంతి చెందారు. కలలా జరిగిన ఈ సంఘటనతో వారంతా కలవరపడ్డారు. దాదాపు పాతికేళ్లుగా ఆ మార్కెట్‌తో బాషాకు అనుబంధం ఉంది. ఇన్నేళ్లుగా అందరి ఆదరణ చూరగొన్న ఆయన తన అల్లుడితో సహా కన్నుమూయడంతో పట్టణంలో విషాదం అలముకుంది. సమాచారం అందుకున్న ఎస్‌ఐ దుర్గాప్రసాద్‌ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

అనాథలైన రెండు కుటుంబాలు 
హడ్కోకాలనీకి చెందిన షేక్‌ బాషా పట్టణంలోని మండల పరిషత్‌ కార్యాలయం ఎదురుగా చికెన్‌ సెంటర్‌ నడుపుతున్నాడు. ఆయనకు భార్య అమ్మాజీతో బాటు గోరీ, పీరు, మహీదా అనే ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కూతురు గోరీకి శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటకు చెందిన షేక్‌ సైదాతో నాలుగేళ్ల క్రితం వివాహం చేశాడు. బాషాకు మగ పిల్లలు లేకపోవడంతో అల్లుడు సైదాను నరసన్నపేట నుంచి చీపురుపల్లి తీసుకొచ్చాడు. తన వ్యాపారంతో బాటు కుటుంబాలను చూసుకునేందుకు తోడుగా ఉంటాడని భావించాడు. తానుంటున్న వీధిలోనే వేరే ఇంట్లో కూతురితో కాపురం పెట్టించారు. తన కుటుంబానికి ఎప్పటికైనా ఆసరాగా నిలుస్తాడని భావించాడు. కానీ విధి వక్రీకరించింది. విద్యుత్‌షాక్‌ రూపంలో వారి కలలను కల్లలు చేసింది. ఈ సంఘటనతో మగదిక్కు కోల్పోయిన ఆ కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. 

బాసటగా నిలిచిన వైఎస్సార్‌సీపీ నాయకులు.... 
చికెన్‌ సెంటర్‌లో విద్యుత్‌ షాక్‌తో ఇద్దరు మృతి చెందిన సంఘటన తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ నాయకులు ఆ కుటుంబాలకు బాసటగా నిలిచారు. మృతుడు షేక్‌ బాషాకూడా పార్టీ సానుభూతిపరుడు కావడం... ముస్లిం వర్గానికి నాయకత్వం వహిస్తుండటంతో పార్టీ జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావుతో బాటు ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. పార్టీ మండల నాయకులు ఇప్పిలి అనంతం, వలిరెడ్డి శ్రీనివాసనాయుడు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను ప్రభుత్వాస్పత్రికి తరలించే ఏర్పాటు చేశారు. ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌ ప్రభుత్వాస్పత్రి వద్ద మృతదేహాలను సందర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

1
1/1

మృతదేహాల వద్ద ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement