ఈ ఏడాది బడ్జెట్‌ లోటు పెరుగుతుంది

This year's budget deficit will increase - Sakshi

ప్రభుత్వ చర్యలతో తదుపరి సంవత్సరాల్లో తగ్గుముఖం: మూడీస్‌

న్యూఢిల్లీ: తక్కువ పన్ను రేట్లు, అధిక వ్యయాలతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2017–18)లో బడ్జెట్‌లోటు పెరుగుతుందని రేటింగ్‌ సంస్థ మూడీస్‌ స్పష్టం చేసింది. అయితే, పన్ను పరిధిని విస్తరించేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలతోపాటు నిధులను సమర్థవంతంగా వినియోగించడం వల్ల రానున్న సంవత్సరాల్లో లోటు తగ్గుతుందని అభిప్రాయపడింది. ద్రవ్య స్థిరీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని తాము భావిస్తున్నట్టు మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సర్వీసెస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ విలియం ఫోస్టర్‌ చెప్పారు. దీనికితోడు వృద్ధి రేటు రుణ భారం తగ్గించేందుకు తోడ్పడతాయని పేర్కొన్నారు.

దేశ సార్వభౌమ రేటింగ్‌ను బీఏఏ3 నుంచి బీఏఏ2కు పెంచుతూ రెండు రోజుల క్రితమే మూడీస్‌ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఒకవేళ బ్యాంకింగ్‌ వ్యవస్థ ఆరోగ్యం మరింత క్షీణిస్తే రేటింగ్‌ తగ్గించే ఒత్తిడి ఎదుర్కోవాల్సి వస్తుందని ఫోస్టర్‌ అన్నారు. అయితే, భారత్‌ పట్ల స్థిరమైన దృక్పథం ప్రకటించడంతో కనుచూపు మేరలో రేటింగ్‌లో మార్పు ఉండదనే సంకేతంగా పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంస్కరణలు వృద్ధి అవకాశాలను మెరుగుపరుస్తుందని, రుణ భారం మధ్యకాలానికి దిగొస్తుందన్న అంచనాలతోనే రేటింగ్‌ను పెంచడం జరిగిందని ఫోస్టర్‌ చెప్పారు.

eదేశ జీడీపీలో రుణ రేషియో 68.6%గా ఉండగా, 2023 నాటికి దీన్ని 60%కి తగ్గించుకోవాలని ప్రభుత్వం నియమించిన ఓ ప్యానెల్‌ సూచించిన విషయం గమనార్హం. ‘ప్రభుత్వ బడ్జెట్‌ లోటు గత రెండు సంవత్సరాల్లో ఉన్నట్టుగానే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీలో 6.5 శాతంగా ఉంటుందని మా అంచనా. బడ్జెట్లో ప్రభుత్వం పేర్కొన్న ఆదాయ అంచనాలు తగ్గి, అదే సమయంలో ప్రభుత్వ వ్యయాలు అధికమైతే అది లోటును ఇంకా పెంచుతుంది. అయితే, పన్ను పరిధి పెంచేందుకు, వ్యయాల్లో సమర్థతకు తీసుకున్న చర్యలు లోటును తగ్గించేందుకు తోడ్పడతాయి’ అని ఫోస్టర్‌ తెలిపారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top