మొండిబకాయిలతోనే ముప్పు! | With the threat of bad loans! | Sakshi
Sakshi News home page

మొండిబకాయిలతోనే ముప్పు!

Jun 26 2015 1:41 AM | Updated on Sep 3 2017 4:21 AM

మొండిబకాయిలతోనే ముప్పు!

మొండిబకాయిలతోనే ముప్పు!

స్థూలంగా చూస్తే దేశ ఆర్థిక వ్యవస్థ మూలాలు పటిష్టంగానే ఉన్నాయని..

ముంబై : స్థూలంగా చూస్తే దేశ ఆర్థిక వ్యవస్థ మూలాలు పటిష్టంగానే ఉన్నాయని.. ఎలాంటి అనిశ్చితులనైనా ఎదుర్కొనే సామర్థ్యం ఉందని... కానీ బ్యాంకుల మొండిబకాయిలు(ఎన్‌పీఏ) అంతకంతకూ పెరుగుతుండటం ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతోందని భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) పేర్కొంది. పెరుగుతున్న ఎన్‌పీఏలు ఇటు ప్రభుత్వం, అటు నియంత్రణ సంస్థలకు కూడా సవాలుగా పరిణమిస్తున్నాయని తెలియజేసింది. గురువారం విడుదల చేసిన అర్ధ వార్షిక ఆర్థిక స్థిరత్వ నివేదిక(ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్)లో ఆర్‌బీఐ ఈ అంశాలను ప్రధానంగా ప్రస్తావించింది.

‘వృద్ధి రేటు, ద్రవ్యోల్బణం, కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్), ద్రవ్యలోటు వంటి స్థూల ఆర్థిక అంశాలను చూస్తే భారత ఆర్థిక వ్యవస్థ మెరుగైన స్థితిలోనే ఉంది. రానున్న రోజుల్లో మరింత పుంజుకునే అవకాశం ఉంది. అయితే, వ్యాపార విశ్వాసం పెరుగుతున్న సంకేతాలు మాత్రం అంతగా కనిపించటం లేదు. ఇది ఆందోళనకరం. మరోపక్క, బ్యాంకింగ్ వ్యవస్థ స్థూల ఎన్‌పీఏలు ఈ ఏడాది మార్చి నాటికి 4.6 శాతానికి ఎగబాకాయి. గతేడాది సెప్టెంబర్ చివరికి ఇవి 4.5 శాతంగా ఉన్నాయి.

పునర్‌వ్యవస్థీకరించిన రుణాలతో కలిపితే మొత్తం మొండిబకాయిలు 10.7 శాతం నుంచి 11.1 శాతానికి ఎగబాకాయి’ అని ఆర్‌బీఐ వివరించింది. ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ నేతృత్వంలోని ఫైనాన్షియల్ స్టెబిలిటీ అండ్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ ఉప సంఘం ఈ నివేదికను రూపొందించింది. కమిటీలో సెబీ, ఐఆర్‌డీఏ, ఎఫ్‌ఎంసీ, పీఎఫ్‌ఆర్‌డీఏ వంటి ఇతర నియంత్రణ సంస్థలకు చెందిన చీఫ్‌లతో పాటు కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు, ఆర్థిక శాఖ కార్యదర్శి కూడా సభ్యులు.

 మరింత పెరిగే ప్రమాదం...
 కాగా, ఎన్‌పీఏల పెరుగుదలకు అడ్డుకట్టపడే పరిస్థితులు ఇంకా రాలేదని (బాటమ్డ్ అవుట్) ఆర్‌బీఐ హెచ్చరించింది. మరికొన్ని త్రైమాసికాల పాటు అధిక మొండిబకాయిల భారం కొనసాగే అవకాశముందని.. దీనివల్ల బ్యాంకింగ్ వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడవచ్చని కూడా తేల్చిచెప్పింది. ఇక రంగాల వారీగా చూస్తే.. మైనింగ్, ఇనుము-ఉక్కు, టెక్స్‌టైల్స్, ఇన్‌ఫ్రా, విమానయానాల్లో అత్యధికంగా మొండిబకాయిలు పేరుకుపోతున్నాయి. మొత్తం ఎన్‌పీఏల్లో ఈ రంగాల వాటాయే 17.9 శాతంగా ఉంది.

కాగా, ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ త్రైమాసికానికి స్థూల ఎన్‌పీఏలు 4.8 శాతానికి ఎగబాకి.. 2016 మార్చి క్వార్టర్‌కు 4.7 శాతానికి చేరే అవకాశం ఉందని కూడా అంచనా వేసింది. అయితే, స్థూల ఆర్థిక పరిస్థితులు దిగజారితే గనక ఈ ఎన్‌పీఏలు మార్చినాటికి 5.9 శాతానికి ఎగబాకే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించింది. ఇక ప్రైవేటు రంగ బ్యాంకులతో పోలిస్తే ప్రభుత్వ రంగ బ్యాంకుల పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. పీఎస్‌యూ బ్యాంకుల స్థూల ఎన్‌పీఏలు మార్చి నాటికి 5.7 శాతానికి ఎగసే అవకాశం ఉందని ఆర్‌బీఐ నివేదిక పేర్కొంది.

 నివేదికలో ఇతర అంశాలివీ...
► ఈ ఏడాది తొలి 6 నెలల్లో కీలకమైన రెపో రేటును ముప్పావు శాతం తగ్గించడం ద్వారా ఆర్థిక వ్యవస్థకు సానుకూల ప్రయోజనాన్ని ఆర్‌బీఐ అందించింది.
► అయితే, రుతుపవన వర్షపాతం సాధారణం కంటే తక్కువగానే ఉండొచ్చన్న అంచనాలు.. ఆహార, తయారీ రంగ ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉంది.
► ఇక స్టాక్ మార్కెట్ల విషయానికొస్తే.. ఆల్గోరిథమ్ ట్రేడింగ్ శరవేగంగా పెరుగుతుండటం ఆందోళనకరం. దీనిపై చాలా అప్రమత్తంగా వ్యవహరించాలి.
► వ్యవసాయ రంగంలో బీమా అవసరాలపై తక్షణం దృష్టిసారించాలి.
 
 ‘భవిష్యత్తులో అంతర్జాతీయంగా ఎలాంటి ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు తలెత్తినా దీటుగా ఎదుర్కొనే సత్తా మనకుంది. గత రెండేళ్లుగా స్థూల ఆర్థిక మూలాలు కూడా బాగానే మెరుగుపడ్డాయి. అయితే, అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం కూడా ఉంది. అభివృద్ధి చెందిన దేశాలు తమ ప్యాకేజీల ఉపసంహరణ, ముఖ్యంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ రానున్న కాలంలో వడ్డీరేట్ల పెంపును మొదలెడితే గ్లోబల్ మార్కెట్లు కొంత కుదుపునకు గురికావచ్చు.  దేశీయంగా విధానపరమైన చర్యల కారణంగా దీన్ని కూడా మనం సమర్థంగానే ఎదుర్కోగలం’.
 - ఎఫ్‌ఎస్‌ఆర్ ముందుమాటలో ఆర్‌బీఐ గవర్నర్ రాజన్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement