ఎక్కడి ధరలు అక్కడే..! | Wholesale prices turn flat in november year-on-year | Sakshi
Sakshi News home page

ఎక్కడి ధరలు అక్కడే..!

Dec 16 2014 12:15 AM | Updated on Sep 2 2017 6:13 PM

ఎక్కడి ధరలు అక్కడే..!

ఎక్కడి ధరలు అక్కడే..!

టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం రేటు నవంబర్‌లో యథాతథంగా(సున్నా శాతం) ఉంది.

నవంబర్ టోకు సూచీ యథాతథం; ద్రవ్యోల్బణం రేటు సున్నా...

ఐదేళ్ల కనిష్ట స్థాయి ఇది...
ఇంధనం, ఆహార ఉత్పత్తుల ధరల తగ్గుదల ప్రభావం...

 
న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం రేటు నవంబర్‌లో యథాతథంగా(సున్నా శాతం) ఉంది. అంటే మొత్తంగా 2013 నవంబర్‌లో ఉన్న స్థాయిలోనే 2014 నవంబర్‌లో కూడా టోకు ధరలు ఉన్నాయన్నమాట. ప్రభుత్వం సోమవారం ఈ గణాంకాలను విడుదల చేసింది. 2014 అక్టోబర్‌లో(2013 అక్టోబర్ నెలతో పోల్చితే) టోకు ధరల పెరుగుదల రేటు 1.77 శాతంగా ఉంది. మొత్తం మూడు విభాగాల్లో ధరల స్పీడ్ నవంబర్‌లో పడిపోవడం ‘యథాతథం’ ఫలితానికి కారణం. తాజా పరిణామంతో టోకు ద్రవ్యోల్బణం రేటు ఐదేళ్ల కనిష్ట స్థాయికి చేరింది.

విభాగాల వారీగా...
ఆహార, ఆహారేతర ఉత్పత్తులతో కూడిన ప్రైమరీ ఆర్టికల్స్ విభాగం ధరలో అసలు పెరుగుదల లేకపోగా (2013 నవంబర్‌తో పోల్చితే) ఇది -0.98 శాతం క్షీణించింది. ఇందులో ఒక్క ఆహార ఉత్పత్తులను చూస్తే, ఈ పెరుగుదల రేటు 0.63%. అయితే ఆహారేతర ఉత్పత్తుల ధరలు క్షీణతలో -3.65%గా ఉన్నాయి.
ఇంధనం, విద్యుత్ విభాగంలో ద్రవ్యోల్బణం రేటు కూడా క్షీణతలో -4.91%గా ఉంది.
మొత్తం సూచీలో 65 శాతం వాటా కలిగిన తయారీ ఉత్పత్తుల (కోర్) సూచీ పెరుగుదల రేటు 2.04 శాతంగా ఉంది.
 
ఆహార ఉత్పత్తులు ఇలా...

ఒక్క  ఆహార ఉత్పత్తుల పెరుగుదల రేటును ప్రత్యేకంగా చూస్తే, అక్టోబర్‌లో ఈ పెరుగుదల రేటు 2.70 శాతంగా ఉంటే, నవంబర్‌లో 0.63 శాతానికి పడిపోయింది. వార్షిక ప్రాతిపదికన గోధుమలు (-2.31 శాతం), కూరగాయలు (-28.57 శాతం), ఉల్లిపాయల (-56.28 శాతం) ధరలు అసలు పెరక్కపోగా మరింత తగ్గాయి. ధరలు పెరిగిన ఉత్పత్తులను చూస్తే, తృణధాన్యాలు (2.09 శాతం), బియ్యం (5.55 శాతం) పప్పు దినుసులు (4.43 శాతం), పండ్లు (14.78 శాతం), ప్రొటీన్ ఆధారిత గుడ్లు, మాంసం, చేపలు (4.36 శాతం), బంగాళ దుంపలు (34.10%), పాలు (10%) ఉన్నాయి.

ఆర్‌బీఐపై ఒత్తిడి...
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) వడ్డీరేట్లు తగ్గించడానికి, తద్వారా వృద్ధికి ప్రోత్సాహం ఇవ్వడానికి ఇది ఒక అవకాశమని పారిశ్రామిక వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. వరుసగా ఆరు నెలల నుంచీ టోకు ధరల సూచీ తగ్గుకుంటూ వచ్చి, తాజా సమీక్షలో యథాతథ స్థాయికి చేరడం.. ఇదే నెలకు సంబంధించి రిటైల్ ధరల సూచీ కూడా రికార్డు స్థాయి 4.38 శాతంగా నమోదుకావడం.. పారిశ్రామిక ఉత్పత్తి అక్టోబర్‌లో రెండేళ్ల కనిష్ట స్థాయికి (అసలు వృద్ధి లేకపోగా -4.2% క్షీణత) పడిపోవడం.. మొదటి త్రైమాసికంలో 5.7%గా ఉన్న స్థూల దేశీయోత్పత్తి వృద్ధి రేటు, రెండో త్రైమాసికంలో 5.3%కి తగ్గడం.. వీటన్నింటికీ తోడు అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరల పతనం దేశ స్థూల ఆర్థిక ఫండమెంటల్స్‌కు పటిష్టతను ఇస్తుండడం వంటి అంశాలు పాలసీ రేటు తగ్గింపునకు సంబంధించి ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్‌పై ఒత్తిడిని పెంచుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement