ఇట్స్‌ టైం... డిలిట్‌ ఫేస్‌బుక్‌

WhatsApp co-founder tweet: Delete Facebook - Sakshi

భారీ డేటా బ్రీచ్‌తో ఇబ్బందుల్లో పడ్డ సోషల్‌మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌కు దెబ్బమీద దెబ్బపడుతోంది.  తాజాగా ఫేస్‌బుక్‌ సొంతమైన వాట్సాప్‌  సహ వ్యవస్థాపకుడు బ్రియాన్ ఆక్టాన్ ట్వీట్‌ ప్రకంపనలు  రేపుతోంది.   ఇక ఫేస్‌బుక్‌కు టాటా చెప్పా‍ల్సిన సమయం(ఇట్స్‌ టైం.. డిలిట్‌ ఫేస్‌బుక్‌)  అంటూ తన  ఫాలోయర్స్‌ను ఉద్దేశించి బ్రియాన్‌ ట్విట్‌ చేశారు. రూ.5 కోట్ల వినియోగదారులు డేటాను విక్రయించిందన్నఆరోపణలతో ఫేస్‌బుక్‌​ సతమతమవుతూండగానే ట్వీట్‌ మరింత దుమారాన్ని రేపుతోంది.  అంతేకాదు బ్రియాన్‌​ ట్వీట్‌తో ట్విటర్‌లో డిలిట్‌ ఫేస్‌బుక్‌ హ్యాష్‌ట్యాగ్‌కు భారీ మద్దతు లభిస్తోంది. ఆయనకు దాదాపు 21వేల మంది  ట్విటర్‌  ఫాలోవర్స్‌ ఉన్నారు.

2014లోసుమారు 19  బిలియన్‌ డాలర్లతో  వాట్సాప్‌ను  ఫేస్‌బుక్‌ సొంతం  చేసుకుంది. ఈ విక్రయం తరువాత  ఫేస్‌బుక్‌తో కొనసాగిన బ్రియాన్‌  గత నెలలోనే సిగ్నల్ ఫౌండేషన్ అనే  లాభాపేక్ష రహిత సంస్థను స్థాపించడం గమనార్హం. 2018, ఫిబ్రవరిలో దీన్ని మాక్సి మార్లిన్‌పైక్‌తో కలిసి స్థాపించారు. అయితే  ఫేస్‌బుక్‌తో ప్రస్తుతం బ్రియాన్‌ రిలేషన్‌ప్‌పై సమాచారం అందుబాటులో లేదు. మరోవైపు బ్రియాన్‌ ట్వీట్‌పై  వాట్సాప్‌ నుంచి ఎలాంటి స్పందన రాలేదు.

కాగా, 2016లో అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో ఫేస్‌బుక్‌ యూజర్ల డేటాను కేంబ్రిడ్జ్ అనలిటికా చోరీ చేసినట్టు అమెరికా, బ్రిటన్ మీడియాలో కథనాలు వచ్చాయి. ట్రంప్ ఎన్నికల ప్రచారం కోసం పనిచేసిన కన్సల్టెన్సీకి ఫేస్‌బుక్ వినియోగదారుల వివరాలు ఎలా లభించాయన్న అంశంపై ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్‌ వివాదంలో  చిక్కుకున్నారు. దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా  అమెరికా, ఐరోపా విచారణ సంస్థలు ఆదేశాలు జారీచేసినట్టు సమాచారం. మరోవైపు ఈ వార్తల నేపథ్యంలో  ఫేస్‌బుక్  క్యాపిటల్‌ వాల్యూ, షేర్లు ఒక్కసారిగా  కుప్పకూలిన సంగతి తెలిసిందే.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top