ఈ ఐపీఓలకు ఏమైంది..?

What happens to these IPOs? - Sakshi

లిస్టింగ్‌ నాడు మాత్రమే లాభాలు

ఇష్యూ ధరతో పోలిస్తే భారీగా పతనం

పెట్టుబడిని సగం చేసిన 3 కంపెనీలు

అధిక వాల్యుయేషన్స్‌ వల్లే ఇన్వెస్టర్లకు నష్టాలు

రూ.800 నుంచి 244కు జారిన న్యూ ఇండియా అష్యూరెన్స్‌

జనరల్‌ ఇన్సూరెన్స్, బీడీఎల్, హెచ్‌ఏఎల్‌... అన్నీ ఇంతే  

(సాక్షి, బిజినెస్‌ విభాగం) : ప్రైమరీ మార్కెట్‌లో సందడి చేసిన అనేక కంపెనీల ఐపీఓలు (ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) సెకండరీ మార్కెట్‌కు వచ్చే సరికి చతికిలపడిపోతున్నాయి. పలు సంస్థల ప్రకటనలు మూలధన సమీకరణకే పరిమితమైపోతున్నాయి.

ఐసీఓ సమయంలో అది చేస్తాం, ఇది చేస్తాం.. కంపెనీ సమర్థత ఓ స్థాయిలో ఉందని చెప్పి ఓవర్‌ వాల్యుయేషన్స్‌ కట్టుకున్న అనేక కంపెనీల అసలు రంగు నెమ్మదిగా బయటపడుతోంది. గతేడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు రూ.500 కోట్లకు మించి నిధులను సమీకరించిన కంపెనీల జాబితాలో 33 సంస్థలుండగా వీటిలో ఏకంగా 17 కంపెనీల ప్రస్తుత మార్కెట్‌ ధరలు ఇష్యూధర కంటే కూడా దిగువకు పడిపోయాయి. వీటిలో 3 కంపెనీలు ఇన్వెస్టర్ల పెట్టుబడిని సగానికిపైగా హరించేశాయి.

మార్కెట్‌ పైకి.. షేరు ధర కిందకి
గడిచిన ఏడాదికాలంలో సెన్సెక్స్‌ 12 శాతం వృద్ధిని నమోదుచేసింది. గతేడాదిలో అయితే ఏకంగా 28 శాతం ర్యాలీ చేసింది. మధ్యలో భారీ పతనాలున్నప్పటికీ మొత్తంగా చూస్తే మేజర్‌ గ్లోబల్‌ మార్కెట్ల కంటే అధిక లాభాలనే పంచింది. యూకే, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, చైనా, రష్యా మార్కెట్లతో పోలిస్తే అవుట్‌ పెర్ఫార్మర్‌గానే నిలిచింది. ప్రధాన సూచీలు ఇలా ఉంటే.. తాజాగా ఐపీఓకు వచ్చి సెకండరీ మార్కెట్‌లోకి అడుగుపెట్టిన పలు కంపెనీలు ఇష్యూ ధర కంటే 11– 69 శాతం శాతం దిగువన ట్రేడవుతున్నాయి.

ఈ జాబితాను ఒకసారి పరిశీలిస్తే.. దేశంలోనే అతి పెద్ద సాధారణ బీమా సంస్థగా ప్రైమరీ మార్కెట్‌లో సందడిచేసిన ‘న్యూ ఇండియా అష్యూరెన్స్‌’ ఐపీఓ ఆ తరువాత కాలంలో ఇన్వెస్టర్ల నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయింది. రూ.770– 800 ధరల శ్రేణినితో వచ్చి రూ.800 వద్ద 1.19 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబ్‌ అయింది. ఈ ఐపీఓ ద్వారా సంస్థ రూ.9,600 కోట్లు సమీకరించింది. లిస్టింగ్‌ రోజునే 6.39 శాతం డిస్కౌంట్‌తో షాకిచ్చి.. క్రమంగా పడిపోతూ ఏడాది కూడా పూర్తికాకముందే 70 శాతం పెట్టుబడిని ఆవిరిచేసింది. ప్రస్తుతం రూ.244 వద్ద ఉంది. ప్రభుత్వ రంగ సంస్థే ఇంతటి ఓవర్‌ వాల్యుయేషన్స్‌తో వచ్చి తమను దెబ్బతీస్తుందని ఎలా ఊహిస్తామన్నది రిటైల్‌ ఇన్వెస్టర్ల మాట.

జనరల్‌ ఇన్సూరెన్స్‌దీ అదే దారి...
ప్రభుత్వ రంగంలోని మరో బీమా సంస్థ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కార్పోరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఐపీఓ సైతం ఇదే తీరును ప్రదర్శించింది. రూ.11,373 కోట్ల సమీకరణ లక్ష్యంతో అతిపెద్ద ఐపీఓగా సందడి చేసి చివరకు భారీ నష్టాలను మిగిల్చిందీ సంస్థ. ఇష్యూ ధర రూ.912 కాగా, మంగళవారం నాటి మార్కెట్‌ ముగింపు సమయానికి రూ.354 వద్ద నిలిచింది. గతేడాది అక్టోబరులో ఐపీఓకు వచ్చిన ఈ కంపెనీ ఇప్పటివరకు షేరు ధరలో 63 శాతం పతనాన్ని నమోదు చేసింది.

ఇక ఐపీఓ ద్వారా రూ.515 కోట్లను సమీకరించిన పాఠ్యపుస్తకాల ముద్రణ సంస్థ ఎస్‌ చాంద్‌ అండ్‌ కంపెనీ కూడా ఇన్వెస్టర్ల పెట్టుబడిని సగం చేసింది. ఇష్యూ ధర రూ.670 ఉండగా, ప్రస్తుతం రూ.300 స్థాయిలో కొనసాగుతోంది. షేరు ధర 54 శాతం కరిగిపోయింది. ఐసీఐసీఐ సెక్యూరిటీస్, ఇండోస్టార్‌ క్యాపిటల్‌ ఫైనాన్స్, హిందూస్తాన్‌ ఏరోనాటిక్స్, భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్, భారత్‌ రోడ్‌ నెట్‌వర్క్, రిలయన్స్‌ నిప్పన్‌ లైఫ్‌ సహా పలు కంపెనీలు ఈ జాబితాలో ఉన్నాయి.

అధిక విలువలే అసలు కారణం..!
కొనేవారు ఉండాలే కానీ, కొన్ని పరిమితులకు లోబడి షేరు ప్రీమియంను నిర్ణయించుకునే వెసులుబాటు కంపెనీలకు ఉంది. ఈ పరిమిత స్వేచ్ఛను ఆసరాగా తీసుకునే పలు కంపెనీలు ఐపీఓ ధరల శ్రేణిని అధిక వాల్యుయేషన్స్‌ వద్ద ప్రకటించేస్తున్నాయి. ఇలా అధిక విలువతో ప్రైమరీ మార్కెట్‌లో ఇన్వెస్టర్లను ఊదరగొడుతున్నప్పటికీ... సెకండరీ మార్కెట్‌లో క్రమంగా అసలు విలువ బయటపడుతోంది. ఈ క్రమంలోనే తాజా 17 కంపెనీల షేరు ధరలో పతనం నమోదైందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.

సత్తా చూపిన అవెన్యూ సూపర్‌ మార్ట్స్‌
వాల్యుయేషన్స్‌ పక్కాగా ఉన్న కంపెనీలలో పెట్టుబడి పదిలంగా ఉండడమే కాకుండా, లాభాలు వందల శాతాల్లోనే ఉంటాయనే దానికి ‘డీ మార్ట్‌’ రిటైల్‌ చైన్‌ను నిర్వహించే అవెన్యూ సూపర్‌ మార్ట్స్‌ ఐపీఓ అద్ధం పట్టింది. ఈ కంపెనీ ఇష్యూ ధర కేవలం రూ.299 కాగా, ప్రస్తుతం రూ.1,534 స్థాయిలో కొనసాగుతోంది.

ఏడాదిన్నర కాలంలోనే 413 శాతం రాబడిని అందించింది. 2017 ఐపీఓ మార్కెట్‌ వేడిలోనే పబ్లిక్‌ ఇష్యూకు వచ్చిన ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ 94 శాతం, బంధన్‌ బ్యాంక్‌ 66 శాతం లాభాలను అందించాయి. విలువ సరిగ్గా ఉండడం, నిర్వహణ సజావుగా కొనసాగడం, వ్యాపార ధోరణిలో సత్తా ఉండడం వంటి అంశాల కారణంగా ఇదే తరహాలో హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ, హెచ్‌డీఎఫ్‌సీ స్టాండర్డ్‌ లైఫ్‌ ఐపీఓలు ఇష్యూ ధర కంటే 45 శాతానికి మించి రాబడిని అందించాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top