
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జీపీఎస్ ట్రాకర్స్ తయారీలో ఉన్న వోల్టీ ఐవోటీ సొల్యూషన్స్... సొంత ప్లాంటు ఏర్పాటు దిశగా కసరత్తు చేస్తోంది. హైదరాబాద్ లేదా ఆంధ్రప్రదేశ్‌లో ఏడాదిలో రానున్న ఈ ప్లాంటు కోసం కంపెనీ రూ.15 కోట్ల వరకు వెచ్చించనుంది.
ఈ తయారీ యూనిట్ ద్వారా 200 మందికి ఉపాధి లభించనుంది. ఇతర విభాగాల్లో మరో 200 మంది అవసరమవుతారని వోల్టీ సీఈవో కోణార్క్ చుక్కపల్లి ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో చెప్పారు. ధర విషయంలో చైనాకు దీటుగా పోటీ పడుతున్నామని, నాణ్యతలో రాజీపడటం లేదని చెప్పారాయన. కొత్త ప్లాంటు రోజుకు 2,000 యూనిట్ల తయారీ సామర్థ్యంతో రానుంది.
10 రకాల మోడళ్లు...
ప్రస్తుతం కంపెనీ హైదరాబాద్‌లోని ఓ థర్డ్ పార్టీకి చెందిన యూనిట్లో జీపీఎస్ ట్రాకర్లను తయారు చేస్తోంది. ఇవి వోల్టీ సొంత ఆర్‌అండ్‌డీ కేంద్రంలో రూపుదిద్దుకున్నాయి. కంపెనీలో 60 మంది ఉద్యోగులుండగా 10 రకాల ఉత్పాదనలు అందుబాటులో ఉన్నాయి.
వీటిలో వాహనాల ట్రాకర్లతో పాటు పర్సనల్ ట్రాకర్ కూడా ఉంది. 30 రోజుల వరకు బ్యాకప్ ఇచ్చే వేరియంట్‌ను కంపెనీ రూపొందించింది. మోడల్‌ను బట్టి దీని ధర రూ.6,000 వరకు ఉంది. నెలకు 7,000 యూనిట్లను కంపెనీ విక్రయిస్తోంది. ఒక ఏడాది రిప్లేస్‌మెంట్ వారంటీ ఇస్తోంది. ఆర్‌ఎఫ్‌ఐడీ రీడర్లను సైతం వోల్టీ తయారు చేస్తోంది. మహీంద్రా అతి పెద్ద కస్టమర్.
డిమాండ్ ఒక కోటి యూనిట్లు..
వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి ఇంటెలిజెంట్ ట్రాన్స్‌పోర్టేషన్ సిస్టమ్ (ఏఐఎస్–140) ప్రమాణాలు భారత్‌లో అమల్లోకి రానున్నాయి. వీటి ప్రకారం బస్సులు, ట్యాక్సీల వంటి పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వాహనాల్లో ట్రాకింగ్ ఉపకరణాలు ఉండాలి. ఈ ట్రాకింగ్ డివైస్‌కు ఏఐఎస్–140 ధ్రువీకరణ తప్పనిసరి.
భారత్‌లో ఏఐఎస్–140 ధ్రువీకరణ ఉన్న 12 కంపెనీల్లో వోల్టీ ఒకటి. తెలుగు రాష్ట్రాల్లో తమకే ఈ ధ్రువీకరణ ఉన్నట్లు కోణార్క్ చెప్పారు. ఏఐఎస్–140 ప్రమాణాలు అమలులోకి వస్తాయి కనక వచ్చే ఏడాది కోటి జీపీఎస్ ట్రాకర్లు అవసరమవుతాయని చెప్పారు. దీనికి అనుగుణంగా తయారీ సామర్థ్యాన్ని పెంచుకుంటామన్నారు.